Heart Attacks:ప్రస్తుతం మన దేశంలో హార్ట్ ఎటాక్ కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా గత దశాబ్ద కాలంలో యువతలో కూడా ఈ సమస్య అధికమవ్వడం గమనార్హం. కేవలం వృద్ధాప్యం వల్ల మాత్రమే కాకుండా.. మనకు తెలియకుండానే మనం చేసే కొన్ని పొరపాట్లు గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. తాజా అధ్యయనాల ప్రకారం.. ఇండియాలో జరిగే 99% గుండెపోటు సమస్యకు ప్రధానంగా నాలుగుకారకాలు ఉన్నాయని తేలింది. ఈ అంశాలను ముందుగానే గుర్తించి జాగ్రత్త పడటం ద్వారా ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు.
99% గుండెపోటులకు కారణమయ్యే ఆ 4 అంశాలు:
1. ఇన్సులిన్ రెసిస్టెన్స్ , మెటబాలిక్ సిండ్రోమ్:
చాలా మందికి చక్కెర వ్యాధి (డయాబెటిస్) ఉంటేనే గుండెకు ముప్పు అని అనుకుంటారు. కానీ.. డయాబెటిస్ రాకముందే శరీరంలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే ప్రక్రియ మొదలవుతుంది. మన శరీర కణాలు ఇన్సులిన్‌కు సరిగ్గా స్పందించనప్పుడు, రక్తంలో ఇన్సులిన్ స్థాయిలు పెరుగుతాయి. ఇది రక్త నాళాలలో వాపు కొవ్వు పేరుకుపోవడానికి దారి తీస్తుంది. పొట్ట చుట్టూ కొవ్వు ఎక్కువగా ఉండటం దీనికి ప్రధాన సంకేతం.
2. అధిక రక్తపోటు (సైలెంట్ కిల్లర్):
బీపీ ఎక్కువగా ఉన్నా చాలామందికి ఎలాంటి లక్షణాలు కనిపించవు. అందుకే దీనిని ‘సైలెంట్ కిల్లర్’ అంటారు. నిరంతరం రక్తపోటు ఎక్కువగా ఉండటం వల్ల గుండెకు రక్తాన్ని పంప్ చేసే ధమనులు గట్టిపడిపోతాయి.మన దేశంలో ఉప్పు వాడకం ఎక్కువగా ఉండటం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల రక్తపోటు త్వరగా పెరుగుతోంది. ఇది చివరికి గుండెపోటుకు లేదా పక్షవాతానికి దారితీస్తుంది.
3. పెరిగిన కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్:
మన రక్తంలో చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలు పెరగడం వల్ల రక్త నాళాల లోపల ‘ప్లేక్’ ఏర్పడుతుంది. ఇది రక్తం సరఫరాను అడ్డుకుంటుంది. ముఖ్యంగా ప్రాసెస్ చేసిన ఆహారం, ట్రాన్స్ ఫ్యాట్స్ ఉన్న నూనెలు వాడటం వల్ల ఇండియాలో.. ‘గుడ్ కొలెస్ట్రాల్’ తగ్గి, చెడు కొలెస్ట్రాల్ పెరుగుతోంది.గుండెకు రక్తం అందకపోవడమే గుండెపోటుకు ప్రాథమిక కారణం.
4. మానసిక ఒత్తిడి, నిద్రలేమి:
నేటి ఆధునిక లైఫ్ స్టైల్‌లో ఒత్తిడి అనేది ఒక సర్వసాధారణ అంశమైపోయింది. నిరంతర పని ఒత్తిడి, సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల శరీరంలో ‘కార్టిసాల్’అనే హార్మోన్ విడుదలవుతుంది. ఇది గుండె వేగాన్ని, రక్త పోటును పెంచుతుంది.రోజుకు 6 గంటల కంటే తక్కువ నిద్రపోయే వారిలో గుండెపోటు వచ్చే అవకాశం 20-30% ఎక్కువగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి.
నివారణ మార్గాలు – మనం ఏం చేయాలి ?
గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ కింది మార్పులు అవసరం.
ఆరోగ్యకరమైన ఆహారం: మైదా, పంచదార, ప్యాక్ చేసిన ఆహారాలను తగ్గించాలి. పీచు పదార్థం ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు తీసుకోవాలి.
క్రమం తప్పని వ్యాయామం: రోజుకు కనీసం 30-45 నిమిషాల నడక లేదా ఏదైనా శారీరక శ్రమ తప్పనిసరి. ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ను తగ్గిస్తుంది.
రెగ్యులర్ చెకప్స్: 30 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ కనీసం ఏడాదికి ఒకసారి లిపిడ్ ప్రొఫైల్, HbA1c (చక్కెర పరీక్ష), మరియు బీపీ చెక్ చేయించుకోవాలి.
ఒత్తిడి : యోగా, ధ్యానం వంటివి చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉండి గుండెపై భారం తగ్గుతుంది.