కాల్ సెంటర్లు, ఆసుపత్రులు, ఫ్యాక్టరీలు, బీపీఓ ఇలా అనేక రంగాల్లో లక్షలాది మంది రోజూ రాత్రి వేళల్లో పనిచేస్తూ ఉంటారు. ఉద్యోగం ఒక అవసరం కాబట్టి రాత్రి షిఫ్టు అయినా ఒప్పుకొని పనిచేస్తున్నారు. అయితే మన శరీరానికి మాత్రం రాత్రి షిఫ్టు సహజమైనది, ఆరోగ్యకరమైనది కాదని చెబుతున్నారు వైద్య నిపుణులు. మన శరీరం ప్రకృతి ప్రకారం పగలు మాత్రమే పని చేస్తుంది. రాత్రి నిద్రకు అలవాటు పడుతుంది. దీన్నే సిర్కాడియన్ రిథమ్ అంటారు. రాత్రి షిఫ్ట్ వల్ల సహజ గడియారం పూర్తిగా గందరగోళంగా మారిపోతుంది. దీని ప్రభావం అధికంగా నిద్ర పైనే కాదు ఆరోగ్యం పై కూడా పడుతుంది. మొదట్లో మీకు ఇది పెద్ద సమస్యగా కనిపించకపోవచ్చు. ఏళ్లు గడుస్తున్న కొద్ది దీని ప్రభావాలు బయటపడుతూ ఉంటాయి.
మెలటోనిన్ హార్మోన్ తగ్గిపోయి
రాత్రి పని చేసే వారిలో ప్రధానంగా కనిపించేది నిద్రా లోపం. పగటిపూట నిద్రపోవాలంటే శబ్దాలు, వెలుతురు వంటివి ఇబ్బంది పెడతాయి. రాత్రిపూట నిద్ర రావడం కష్టం. దీనివల్ల శరీరానికి అవసరమైన విశ్రాంతి దొరకదు. ఎప్పుడైతే నిద్ర తగ్గుతుందో మానసిక ఒత్తిడి, చిరాకు, ఏకాగ్రత లోపం వంటివి పెరుగుతాయి. నిద్రపోయే సమయంలో విడుదల అయ్యే మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. ఈ హార్మోన్ మన శరీరాన్ని అనేక రోగాలనుంచి కాపాడడంలో ముందుంటుంది. మెలటోనిన్ స్థాయి తగ్గడం వల్ల రోగనిరోధక శక్తి కూడా బలహీనపడుతుంది. త్వరగా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చేస్తూ ఉంటాయి.
Also read: Best 5 Bikes: ప్రతి నెలా లక్షల మంది కొనుగోలు చేస్తున్న టాప్ 5 బైకులు ఇవే
క్యాన్సర్ వస్తుందా?
వైద్య పరిశోధనలు చెబుతున్న ప్రకారం ఎక్కువ కాలం రాత్రిపూట పనిచేసే వారిలో క్యాన్సర్ ప్రమాదం కూడా పెరుగుతుందని తెలుస్తోంది. ముఖ్యంగా హార్మోన్లతో సంబంధం ఉన్న కొన్ని రకాల క్యాన్సర్లకు ఇలా రాత్రిపూట పనిచేయడం అనేది కారణమయ్యే అవకాశం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. రాత్రి షిఫ్టు పనిచేసే వారిలో డయాబెటిస్, బిపి, గుండె జబ్బులు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. అలాగే జంక్ ఫుడ్ అధికంగా తీసుకోవడం, వ్యాయామం లేకపోవడం ఈ ప్రమాదాన్ని మరింతగా పెంచేస్తాయి. జీర్ణక్రియ సరిగా లేకపోతే గ్యాస్, ఎసిడిటీ, కడుపునొప్పి వంటివి కూడా వచ్చేస్తాయి. మానసికంగా కూడా డిప్రెషన్, ఆందోళన, ఒంటరితనం వంటివి పెరిగిపోతాయి.
ఈ జాగ్రత్తలు తీసుకోండి
రాత్రి షిఫ్ట్ లో తప్పకుండా పనిచేయాల్సిన వారు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. పగటిపూట నిద్రపోయే సమయంలో గది పూర్తిగా చీకటిగా, నిశ్శబ్దంగా ఉండేలా చూసుకోండి. నిద్రకు ముందు మొబైల్ టీవీ వంటివి దూరంగా పెట్టండి. సమతుల ఆహారం తీసుకోవడం, నీరు అధికంగా తాగడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వంటివి చాలా ముఖ్యం. వీలైనప్పుడల్లా ఒకే షిఫ్ట్ టైమ్ లో కొనసాగిస్తే శరీరానికి మంచిది. ఆ సమయాలనే శరీరం కూడా అలవాటు పడుతుంది.
Karthika deepam: కార్తీకదీపంలో నటిస్తున్నందుకు నిరుపమ్ పరిటాల తీసుకునే రెమ్యునరేషన్ ఎంత?