Benefits Of Post Dinner Walk: ఈనాటి బిజీ లైఫ్‌స్టైల్‌లో చాలా మంది రాత్రి పూట ఆలస్యంగా భోజనం చేయడం, తిన్న వెంటనే బెడ్ ఎక్కి నిద్రపోవడం లేదా మొబైల్ చూస్తూ కూర్చోవడం చేస్తుంటారు. ఈ చిన్న అలవాటే మన శరీరంలో అనేక రోగాలకు దారితీస్తుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. దీనికి బదులుగా, రాత్రి భోజనం ముగిసిన తర్వాత కేవలం వెయ్యి అడుగులు (సుమారు 15 నిమిషాలు) నడవడం అలవాటు చేసుకుంటే ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మన శరీరంలో దాగున్న పాత ఆరోగ్య సమస్యలను సైతం దూరం చేసే ఈ ‘రాత్రి నడక’ సీక్రెట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
రాత్రి భోజనం తర్వాత నడక వల్ల తొలగిపోయే ఆరోగ్య సమస్యలు :
“తిన్న వంటా.. నడక జంటా” అంటుంటారు పెద్దలు. రాత్రి పూట హెవీగా తినకపోయినా సరే.. తిన్న తర్వాత శరీరాన్ని కాస్త కదిలించడం వల్ల మెటబాలిజం చురుగ్గా మారుతుంది. వెల్‌నెస్ అప్‌డేట్స్ ప్రకారం, కేవలం 1000 అడుగుల నడకతో అనేక సమస్యలను మాయం చేయవచ్చు.
1. గ్యాస్, బ్లోటింగ్ , అసిడిటీ సమస్యలు మాయం :
చాలా మందికి రాత్రి తిన్న తర్వాత కడుపు ఉబ్బరంగా ఉండటం, ఛాతిలో మంట, పుల్లటి తేన్పులు రావడం వంటి సమస్యలు వేధిస్తుంటాయి. తిన్న వెంటనే పడుకోవడం వల్ల జీర్ణరసాలు వెనక్కి తన్ని అసిడిటీ పెరుగుతుంది. అదే భోజనం తర్వాత మీరు వెయ్యి అడుగులు నడిస్తే.. గురుత్వాకర్షణ శక్తి , శారీరక కదలికల వల్ల ఆహారం జీర్ణాశయంలోకి సులభంగా వెళ్తుంది. ఇది ఎంజైమ్‌ల విడుదలను పెంచి, గ్యాస్ సమస్యలను క్షణాల్లో దూరం చేస్తుంది.
2. బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ :
డయాబెటిస్ లేదా మధుమేహంతో బాధపడేవారికి రాత్రి నడక ఒక సంజీవని లాంటిది. మనం భోజనం చేసిన తర్వాత రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఒక్కసారిగా పెరుగుతాయి. తిన్న వెంటనే నడవడం వల్ల మన కండరాలు ఆ గ్లూకోజ్‌ను శక్తిగా మార్చుకోవడానికి వాడుకుంటాయి. దీని వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరిగి, మరుసటి రోజు ఉదయానికి షుగర్ లెవెల్స్ చాలా నార్మల్‌గా ఉంటాయి.
3. ఊబకాయం, పొట్ట చుట్టూ కొవ్వుకు చెక్ :
రాత్రి పూట మన శరీరంలో మెటబాలిజం రేటు సహజంగానే తగ్గుతుంది. తిన్న క్యాలరీలు కరగకపోతే అది నేరుగా పొట్ట చుట్టూ కొవ్వుగా పేరుకుపోతుంది. డిన్నర్ తర్వాత 1000 అడుగులు నడవడం వల్ల ఎక్స్‌ట్రా క్యాలరీలు బర్న్ అవుతాయి. ఇది మీ బరువును అదుపులో ఉంచడమే కాకుండా.. పొట్ట రాకుండా కాపాడుతుంది.
4. గుండె ఆరోగ్యం పటిష్టం:
నడక అనేది గుండెకు ఒక అద్భుతమైన వ్యాయామం. రాత్రి పూట ప్రశాంతమైన వాతావరణంలో నడవడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, రక్తపోటును అదుపులో ఉంచుతుంది. క్రమం తప్పకుండా రాత్రి పూట నడిచే వారిలో గుండె జబ్బులు వచ్చే ముప్పు 30 శాతం తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
Also Read: హోమ్ ఫుడ్ తిన్నా హై బీపీనా? వంటగదిలో చేసే ఈ చిన్న తప్పులే అసలు కారణం!
5. మానసిక ఒత్తిడి తగ్గి, ప్రశాంతమైన నిద్ర :
ఆఫీస్ టెన్షన్లు, ఇంటి పనుల వల్ల వచ్చే ఒత్తిడితో చాలా మందికి రాత్రిళ్లు సరిగ్గా నిద్ర పట్టదు. భోజనం తర్వాత నడిచినప్పుడు మన మెదడులో ‘ఎండార్ఫిన్లు’ అనే హ్యాపీ హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి మానసిక ఒంత్తిడిని, యాంగ్జైటీని అద్భుతంగా తగ్గిస్తాయి. ఒంటికి కాస్త శ్రమ కలగడం వల్ల పడక ఎక్కిన వెంటనే ఎలాంటి ఆలోచనలు లేకుండా హాయిగా గాఢ నిద్ర పడుతుంది.
రాత్రి నడకలో పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు :
వేగంగా నడవద్దు: రాత్రి పూట మార్నింగ్ వాక్‌లాగా పరుగెత్తడం లేదా బ్రిస్క్ వాకింగ్ (వేగంగా నడవడం) చేయకూడదు. చాలా సాధారణంగా, ప్రశాంతంగా అడుగులు వేయాలి. వేగంగా నడిస్తే జీర్ణక్రియ దెబ్బతింటుంది.
సమయం: భోజనం ముగిసిన 5 నుంచి 10 నిమిషాల తర్వాత వాకింగ్ ప్రారంభించడం మంచిది.
ఫోన్ పక్కన పెట్టండి: నడిచేటప్పుడు మొబైల్ చూడటం మానేసి, ప్రకృతిని ఆస్వాదిస్తూ లేదా ఇంట్లో వారితో మాట్లాడుతూ నడవడం వల్ల మైండ్ రిలాక్స్ అవుతుంది.