Oats for cholesterol: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఆహారపు అలవాట్లు మారిపోవడంతో చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య అధిక కొలెస్ట్రాల్. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండె జబ్బుల ముప్పు పొంచి ఉంటుంది. అయితే.. మన వంటింట్లో అందుబాటులో ఉండే ‘ఓట్స్’ కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కేవలం బ్రేక్ ఫాస్ట్ గానే కాకుండా, గుండెను రక్షించే కవచంలా ఓట్స్ ఎలా పనిచేస్తాయి? వీటిలో ఉండే పోషకాలు ఏమిటి? అనే విషయాలను గురించి పూర్తి విషయాలు వివరంగా తెలుసుకుందాం.
ఓట్స్ తింటే కొలెస్ట్రాల్ తగ్గుతుందా?
ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ ఇష్టపడే వారి డైట్ లిస్ట్‌లో ఓట్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఓట్స్ కేవలం బరువు తగ్గడానికే కాదు. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి. దీనికి గల ప్రధాన కారణం అందులో ఉండే బీటా-గ్లుకాన్ అనే కరిగే ఫైబర్.
1. బీటా-గ్లుకాన్ ఎలా పనిచేస్తుంది?
ఓట్స్‌లో ఉండే అత్యంత శక్తివంతమైన పదార్థం బీటా-గ్లుకాన్. మనం ఓట్స్ తిన్నప్పుడు, ఈ ఫైబర్ జీర్ణవ్యవస్థలో ఒక మందపాటి జెల్ లాంటి పొరను ఏర్పరుస్తుంది. ఇది రక్తంలోకి కొలెస్ట్రాల్ గ్రహించబడకుండా అడ్డుకుంటుంది. అలాగే.. కాలేయం ద్వారా తయారయ్యే పిత్త రసాలను తనతో పాటు బయటకు పంపివేస్తుంది. దీని వల్ల శరీరం కొత్త పిత్త రసాలను తయారు చేయడానికి రక్తంలోని కొలెస్ట్రాల్‌ను వాడుకుంటుంది. ఫలితంగా చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి.
2. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది:
రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడాన్ని ఓట్స్ నిరోధిస్తాయి. రోజూ ఒక కప్పు ఓట్స్ తీసుకోవడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం గణనీయంగా తగ్గుతుందని అనేక పరిశోధనలు నిరూపించాయి. ఓట్స్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ముఖ్యంగా ఎవెనాంత్రామైడ్స్, రక్తపోటును నియంత్రించడంలో అంతే కాకుండా వాపులను తగ్గించడంలో సహాయ పడతాయి.
3. రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణ:
ఓట్స్‌లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. దీని వల్ల తిన్న వెంటనే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు. డయాబెటీస్ ఉన్న వారిలో కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. ఓట్స్ వారి రక్తంలో షుగర్ ,కొవ్వు రెండింటినీ సమతుల్యం చేస్తాయి.
Also Read: పసుపు పాలు తాగుతున్నారా? ఈ సైడ్ ఎఫెక్ట్స్ తెలిస్తే షాక్ అవుతారు!
4. ఓట్స్‌ను ఎలా తీసుకోవాలి?
ఓట్స్ ప్రయోజనాలు పూర్తిగా అందాలంటే వాటిని సరైన పద్ధతిలో తీసుకోవాలి.
స్టీల్-కట్ ఓట్స్ లేదా రోల్డ్ ఓట్స్: ఇవి తక్కువగా ప్రాసెస్ చేయబడతాయి కాబట్టి ఫైబర్ అధికంగా ఉంటుంది.
చక్కెరను నివారించండి: ఓట్స్‌లో పంచదారకు బదులుగా పండ్లు , నట్స్ లేదా చిటికెడు దాల్చినచెక్క పొడిని చేర్చుకోండి.
నీరు/పాలు: ఓట్స్ ఉడికించేటప్పుడు నీరు లేదా తక్కువ కొవ్వు ఉన్న పాలను వాడటం మంచిది.
ఓట్స్ అనేది కొలెస్ట్రాల్‌ను సహజంగా తగ్గించుకోవాలనుకునే వారికి ఒక అద్భుతమైన ఆహారం. రోజుకు కనీసం 3 గ్రాముల బీటా-గ్లుకాన్ (సుమారు ఒక కప్పు వండిన ఓట్స్) తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలను 5-10% వరకు తగ్గించవచ్చు. అయితే కేవలం ఓట్స్ మాత్రమే కాకుండా.. క్రమం తప్పని వ్యాయామం, సమతుల్య ఆహారం కూడా తోడైతే మీ గుండె పది కాలాల పాటు పదిలంగా ఉంటుంది.