Saree Cancer| “సారీ క్యాన్సర్” అంటే చీర క్యాన్సర్ అనే పదం ఇటీవల బాగా ప్రచారంలో ఉంది. చాలామంది దీని గురించి విని ఆందోళన చెందుతున్నారు. అయితే, ఇది అరుదైన పరిస్థితి అని వైద్యులు చెబుతున్నారు. చీర కట్టడం వలన నేరుగా క్యాన్సర్ వస్తుందని దీని అర్థం కాదు. బిగుతుగా ఉండే దుస్తుల వల్ల నడుము ప్రాంతంలో చర్మానికి చాలా కాలం పాటు జరిగే అసౌకర్యంతో వచ్చే ఆరోగ్య సమస్య.
చీరక్యాన్సర్ అనే పదం వైద్య పరిభాషలో లేదు. సాధారణంగా ఉండే వాడుక భాష పదం. చీర ధరించినప్పుడు నడుము చుట్టూ చర్మం తీవ్ర ఒత్తిడికి గురికావడంతో అరుదుగా వచ్చే ఒక రకమైన చర్మ క్యాన్సర్. అయితే చీర వల్ల క్యాన్సర్ రాదు. దాని లోపల బిగుతుగా కట్టే పావడ వల్ల దీర్ఘకాలంలో అంటే చాలా సంవత్సరాలు పాటు రాపిడి వల్ల వచ్చే చర్మ సమస్య. చీర వల్ల ప్రత్యక్షంగా క్యాన్సర్ రాదు.
ప్రధాన కారణం ఒకే చోట ప్రతిరోజూ బిగుతుగా ఉండే విధంగా బట్టలు ధరించడం. దీనివల్ల చర్మం ఎర్రబారడం, దురద, మారడం జరుగుతుంది. చెమట, శుభ్రంగా లేకపోవడం, సంవత్సరాలపాటు బిగుతు దుస్తులు ధరించడం కూడా ప్రమాదం పెంచుతాయి. కొన్ని అరుదైన సందర్భాల్లో ఈ సమస్య ‘స్క్వామస్ సెల్ కార్సినోమా’ అనే క్యాన్సర్‌గా మారుతుంది.
నడుము చుట్టూ చర్మం నల్లబడడం, దురద, చర్మం గరుకుగా లేదా మందంగా మారడం.. లాంటివి కనిపిస్తే చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదముందని సంకేతాలు. వీటిని చాలామంది పట్టించుకోరు. సరైన సమయంలో గమనించకపోతే తర్వాత మరింత తీవ్రమవుతుంది.
ప్రారంభ లక్షణాలు పట్టించుకోకపోతే, తర్వాత గాయంగా మారి పుండ్లు అవుతాయి. ఆ ప్రదేశంలో నొప్పి, రక్తస్రావం, నడుము చుట్టూ వాపు లేదా గడ్డలు రావచ్చు. ఇది చాలా అరుదు, కానీ అలాంటి స్థితి వస్తే వెంటనే వైద్యుడిని కలవాలి.
చీరలు ధరించినవారి అందరికీ ఈ క్యాన్సర్ రాదు. నిపుణుల ప్రకారం ఈ క్యాన్సర్ అరుదుగా వస్తుంది. అయినా అవగాహన ఉండటం వల్ల ఎప్పటికప్పుడు లక్షణాలు గుర్తించి, చిన్న చర్మ సమస్యలు తీవ్రం కాకుండా ఆపుకోవచ్చు.
Also Read: పీరియడ్స్ సమయంలో రుతుస్రావం ఎక్కువగా ఉందా? నొప్పి నుంచి ఉపశమనం కోసం జీవనశైలిలో ఈ మార్పులు చేయండి
చీరలోపల పావడ బిగుతుగా ధరించకూడదు. సౌకర్యంగా వదులుగా కట్టండి. ప్రతిరోజూ ఒకే చోట ముడి వేయకండి, చోటు మారుస్తూ కట్టండి. నడుము ప్రాంతం శుభ్రంగా, పొడిగా ఉంచుకోండి. మెత్తని, కాటన్ వస్త్రాలు ధరించండి. తరుచూ నడుము చుట్టూ ఉన్న ప్రదేశంలో చర్మ సమస్యలు ఏమైనా ఉంటే గమనించండి.
ఒకే చోట చర్మం నల్లబడటం, పుండు, దురద లేదా నొప్పి చాలా రోజులు ఉంటే వెంటనే డాక్టర్ ని సంప్రదించండి. తొలి దశలో చికిత్స తీసుకుంటే క్యాన్సర్ లాంటి ప్రమాదం తప్పించవచ్చు.