Poor Blood Circulation: మానవ శరీరం ఒక అద్భుతమైన యంత్రం. ఇందులో రక్తం ఇంధనంలా పని చేస్తుంది. గుండె పంపింగ్ ద్వారా రక్తం ధమనుల గుండా ప్రవహించి శరీరంలోని ప్రతి భాగానికి చేరుతుంది. కానీ.. వ్యాయామం లేకపోవడం, ధూమపానం, డయాబెటిస్, అధిక బరువు వంటి కారణాల వల్ల ఈ ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడతాయి. రక్త ప్రసరణ సరిగ్గా లేనప్పుడు శరీరం కొన్ని హెచ్చరిక సంకేతాలను ఇస్తుంది. వీటిని సకాలంలో గుర్తించకపోతే.. గుండె పోటు, స్ట్రోక్ లేదా నరాల దెబ్బతినడం వంటి తీవ్రమైన సమస్యలు ఎదురవుతాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
రక్త ప్రసరణ లోపాన్ని సూచించే ముఖ్య లక్షణాలు:
1. చేతులు, కాళ్ళలో తిమ్మిర్లు:
రక్త ప్రసరణ సరిగ్గా లేనప్పుడు శరీరంలోని చివరల భాగాలు అంటే చేతులు, వేళ్లు, పాదాలకు తగినంత రక్తం అందదు. దీని వల్ల ఆ ప్రాంతాల్లో మొద్దుబారిపోవడం లేదా సూదులతో పొడిచినట్లు అనిపిస్తుంది. ముఖ్యంగా.. ఎక్కువసేపు కూర్చున్నప్పుడు లేదా నిలబడినప్పుడు ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.
2. చల్లని చేతులు, పాదాలు :
సాధారణ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు కూడా మీ అరచేతులు లేదా పాదాలు మంచులా చల్లగా ఉంటున్నాయా ? అయితే ఇది రక్త ప్రసరణ లోపానికి స్పష్టమైన సంకేతం. రక్తం వేడిని కూడా మోసుకెళ్తుంది. ప్రవాహం తగ్గితే ఆయా శరీర భాగాలు చల్లబడతాయి.
3. కాళ్ళ వాపు, నీరు పట్టడం:
రక్త ప్రసరణ వ్యవస్థ బలహీనపడినప్పుడు.. గుండెకు రక్తాన్ని తిరిగి పంపే సామర్థ్యం తగ్గుతుంది. దీని వల్ల పాదాలు, చీల మండలు ,కాళ్ళలో ద్రవాలు పేరుకుపోయి వాపు వస్తుంది. దీనినే ‘ఎడెమా’ అని పిలుస్తారు. దీన్ని నిర్లక్ష్యం చేస్తే నరాలు ఉబ్బి ‘వెరికోస్ వీన్స్’ సమస్యకు దారి తీస్తుంది.
4. విపరీతమైన అలసట, నీరసం:
మెదడుకు, కండరాలకు తగినంత ఆక్సిజన్ అందకపోతే మీరు ఎప్పుడూ అలసిపోయినట్లు అనిపిస్తుంది. కొద్ది పాటి శ్రమకే ఆయాసం రావడం, జ్ఞాపక శక్తి తగ్గడం, ఏకాగ్రత కుదరకపోవడం వంటివి రక్త ప్రసరణ లోపం వల్ల కలిగే మానసిక, శారీరక ఇబ్బందులు.
5. చర్మం రంగు మారడం, గాయాలు మానకపోవడం:
రక్త ప్రసరణ తక్కువగా ఉన్న చోట చర్మం పాలిపోయినట్లు లేదా నీలం రంగులోకి మారవచ్చు (సైనోసిస్). అలాగే.. చర్మానికి తగినంత పోషకాలు అందకపోవడం వల్ల చిన్న చిన్న గాయాలు కూడా మానడానికి చాలా సమయం పడుతుంది. ఇది ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచుతుంది.
Also Read: ఒంట్లో సహజంగానే రక్తం పెరగాలంటే.. ఈ పండ్లు తప్పక తినండి
6. జీర్ణ సమస్యలు:
రక్త ప్రసరణ కేవలం కాళ్ళకు, చేతులకు మాత్రమే కాదు.. జీర్ణ వ్యవస్థకు కూడా చాలా ముఖ్యం. పొట్ట భాగంలో రక్త ప్రవాహం తగ్గితే మలబద్ధకం, ఆకలి లేకపోవడం, తిన్న ఆహారం సరిగ్గా అరగకపోవడం వంటి సమస్యలు వస్తాయి.
నివారణ మార్గాలు:
రోజూ వ్యాయామం: కనీసం 30 నిమిషాల నడక రక్త ప్రసరణను అద్భుతంగా మెరుగు పరుస్తుంది.
ఆరోగ్యకరమైన ఆహారం: ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, వెల్లుల్లి, ఐరన్ ఉన్న ఆహారం తీసుకోవాలి.
నీరు ఎక్కువగా తాగడం: హైడ్రేటెడ్‌గా ఉండటం వల్ల రక్తం చిక్కబడకుండా ప్రవాహం సాఫీగా సాగుతుంది.
ఒత్తిడి తగ్గించుకోవడం: యోగా, ధ్యానం చేయడం వల్ల రక్తనాళాలు వ్యాకోచించి ప్రసరణ పెరుగుతుంది.