సోషల్ మీడియాతో జరిగే మంచితో పోల్చితే, చెడే ఎక్కువగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొంత మంది పిల్లలు సోషల్ మీడియా కారణంగా స్మార్ట్ ఫోన్ కు బానిసలుగా మారుతున్నారు. మానసిక సమస్యలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో చాలా ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. తాజాగా ఈ లిస్టులో డెన్మార్క్ చేసింది. సోషల్ మీడియాకు సంబంధించి కొత్త రూల్స్ ను రూపొందిస్తోంది. 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను బ్యాన్ చేయాలని భావిస్తోంది. జుగుప్సాకరమైన వీడియోలు, బెదిరింపులు, ఒత్తిడి లాంటి హానికరమైన విషయాల నుంచి పిల్లలను సురక్షితంగా ఉంచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్ లాంటి యాప్‌లు పిల్లల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని గుర్తించింది. వారి సమయాన్ని వృథా చేయడంతో పాటు మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నాయని డెన్మార్క్ ప్రభుత్వం గుర్తించింది.
డెన్మార్క్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం చట్టంగా మారితే.. సోషల్ మీడియా యాప్‌లు వినియోగదారుల వయస్సు తనిఖీ చేయాల్సి ఉంటుంది. 15 ఏళ్లలోపు పిల్లలు అకౌంట్స్ కలిగి ఉండటానికి అనుమతించబడరు. 13, 14 ఏళ్ల వయస్సు గల పిల్లలు వారి తల్లిదండ్రుల అంగీకారంతో సోషల్ మీడియాను ఉపయోగించవచ్చు. ఈ నిబంధనల గురించి ఇప్పటికే డెన్మార్క్ పార్లమెంటులో చర్చ జరుగుతోంది. త్వరలోనే ఈ నిర్ణయం చట్టరూపం దాల్చే అవకాశం కనిపిస్తోంది.
డెన్మార్క్ పాలకులు పిల్లల మానసిక పరిణతి గురించి ఆందోళన చెందుతున్నారు. సోషల్ మీడియా పిల్లల ఆలోచనలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నట్లు గుర్తించారు. సోషల్ మీడియా యాప్ లలో ఎక్కువ సమయం గడపడం వల్ల పిల్లలు ఆందోళనకు గురి కావడంతో పాటు చూపును కోల్పోవచ్చు. తమను తాము ఇతరులతో పోల్చుకోవచ్చు. కొంతమంది పిల్లలు ఆన్ లైన్ లో చూసే విషయాల కారణంగా తమ గురించి తాము చెడుగా భావిస్తారని అధ్యయనాలు చెబుతున్నాయి.
డెన్మార్క్ తాజా నిర్ణయం చట్టంగా మారితే, సోషల్ మీడియాపై కఠిన వయోపరిమితిని నిర్ణయించిన మొదటి దేశాలలో ఒకటి కావచ్చు. 16 ఏళ్లలోపు పిల్లల కు సోషల్ మీడియాను నిషేధిస్తూ ఆస్ట్రేలియా ఇప్పటికే ఇలాంటి చట్టాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు డెన్మార్క్ కూడా అదే ఆలోచన చేయడంతో.. మరిన్ని దేశాలు ఈ దిశగా అడుగులు వేసే అవకాశం ఉన్నట్లు నిపుణులు భావిస్తున్నారు. అదే జరిగితే ప్రపంచ వ్యాప్తంగా పిల్లలు టెక్నాలజీని ఉపయోగించే విధానం మారనుంది.
తాజా నిర్ణయానికి డెన్మార్క్ పార్లమెంట్ లో మెజారిటీ సభ్యులు అనుకూలంగా ఓటు వేస్తే, చట్టంగా మారుతుంది. ఈ చట్టాన్ని సోషల్ మీడియా కంపెనీలు అనుసరించాల్సి ఉంటుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పిల్లలను సేఫ్ గా ఉంచేందుకు ఇది మంచి నిర్ణయం అని కొంత మంది భావిస్తే, అమలు చేయడం అంత సులభం కాదని మరికొంత మంది అంటున్నారు. ప్రస్తుతానికి, యువతకు ఇంటర్నెట్‌ను సురక్షితంగా మార్చడంలో డెన్మార్క్ ముందుంది.
Read Also: సింగిల్స్ కు వల వేస్తున్న డేటింగ్ యాప్స్.. హైదరాబాదులో ఇవి బాగా ఫేమస్, జర భద్రం గురూ!