Diabetes: షుగర్ వ్యాధి అనగానే రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు మాత్రమే అందరికీ గుర్తుకొస్తాయి. కానీ, డయాబెటిస్ ప్రభావం పురుషులు, మహిళలపై ఒకేలా ఉండదు. శరీర తత్వాలు, హార్మోన్లు, జీవనశైలిలోని వ్యత్యాసాల వల్ల ఈ వ్యాధి ఇద్దరిలో వేర్వేరు రకాల ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి.. ఈ తేడాలను అర్థం చేసుకుని జాగ్రత్త పడటం ఎంతో ముఖ్యం.
మహిళల శరీరంలో జరిగే హార్మోన్ల మార్పులు షుగర్ స్థాయిలపై నేరుగా ప్రభావం చూపుతాయి. పీరియడ్స్ సమయం, గర్భధారణ, అలాగే మెనోపాజ్ దశల్లో వారి హార్మోన్లలో వచ్చే మార్పుల వల్ల ఇన్సులిన్ నిరోధకత పెరిగి గ్లూకోజ్ స్థాయిలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. దీంతో ఆడవారిలో డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవడం కాస్త సవాలుగా మారుతుంది.
మగవారి విషయానికి వస్తే.. ఇన్సులిన్ నిరోధకత, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ సమస్యల వల్ల చాలా చిన్న వయసులోనే గుండె సంబంధిత వ్యాధులు, మూత్రపిండాల (కిడ్నీ) సమస్యల బారిన పడే అవకాశం ఉంది. అందుకే మగవారు రెగ్యులర్‌గా బీపీ, కొలెస్ట్రాల్, కిడ్నీ ఫంక్షన్ పరీక్షలు చేయించుకోవడం ఎంతో అవసరం.
Also Read: 30 దాటిన ప్రతి మహిళ సప్లిమెంట్లు వాడాలా? ఈ విషయంలో నిపుణులు ఏమంటున్నారంటే..
దీర్ఘకాలిక వ్యాధులతో జీవించడం ఎవరికైనా ఒత్తిడితో కూడుకున్నదే. అయితే, డయాబెటిస్ ఉన్న మహిళలు పురుషుల కంటే ఎక్కువగా మానసిక ఆందోళన, డిప్రెషన్‌కు గురవుతున్నారని వైద్యులు చెబుతున్నారు. ఇంటి పని, కుటుంబ బాధ్యతలు, అనారోగ్యం అన్నీ కలిసి వారిపై మానసిక భారాన్ని పెంచుతాయి. కాబట్టి.. మానసిక ప్రశాంతత కోసం కౌన్సెలింగ్, ఇంట్లో వారి మద్దతు చాలా అవసరం.
షుగర్ వ్యాధి అంటే కేవలం బ్లడ్ షుగర్ రీడింగ్ చూసుకోవడం మాత్రమే కాదు. బరువు, రక్తపోటు, కొలెస్ట్రాల్, హార్మోన్లు, మానసిక ఆరోగ్యం.. వీటన్నింటినీ ఒకేసారి గమనిస్తూ ఉండాలి. స్త్రీ, పురుషుల శరీర శైలికి తగినట్లుగా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నప్పుడే సరైన చికిత్స అందుతుంది.
గుండెల్లో నొప్పి, ఆయాసం, అకస్మాత్తుగా చూపు మందగించడం, కాళ్లలో వాపులు, మూత్రవిసర్జనలో విపరీతమైన మార్పులు, కాళ్లపై మానని గాయాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. క్రమం తప్పకుండా షుగర్, హెచ్‌బీఏ1సీ పరీక్షలు చేయించుకుంటే భవిష్యత్తులో వచ్చే పెద్ద పెద్ద ప్రమాదాల నుండి సురక్షితంగా బయటపడవచ్చు.
Also Read: రక్తంలో చక్కెర పెరగకుండా ఉండాలంటే ఆపిల్ తినాలా? పియర్ తినాలా?