Dark Chocolate: వయసుతో సంబంధం లేకుండా చాలామంది ఇష్టపడే స్వీట్ ఏదంటే.. చాక్లెట్స్. అయితే అన్ని రకాల చాక్లెట్లలో కంటే డార్క్ చాక్లెట్ల ద్వారానే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు వైద్య నిపుణులు. ఎందుకంటే.. దీనిలో ఉండే పోషకాల వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడటం నుంచి ఒత్తిడి తగ్గే వరకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధనల్లో వెల్లడైంది. ముఖ్యంగా రాత్రిపూట డార్క్ చాక్లెట్ తినే విషయంలో కొన్ని జాగ్రత్తలు కూడా అవసరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూసేద్దాం..
డార్క్ చాక్లెట్‌లో ఫ్లేవనాయిడ్లు అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో వాపును తగ్గించడంలో, కణాలను ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడడంలో సహాయపడతాయి. రాత్రిపూట శరీరం సహజంగా పునరుద్ధరణ దశలో ఉండే సమయంలో, ఈ యాంటీఆక్సిడెంట్లు కణాల ఆరోగ్యానికి తోడ్పడతాయని చెబుతున్నారు నిపుణులు. అలాగే కొన్ని అధ్యయనాల ప్రకారం.. డార్క్ చాక్లెట్స్ అలసటను తగ్గించి, మెదడు పనితీరు, జీవన నాణ్యతను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుందట.
Also Read: కోడిగుడ్లు నిజంగా మన ఆరోగ్యానికి మేలు చేస్తాయా? ఈ నిజాలు తెలిస్తే అవాక్కే!
ఈ డార్క్ చాక్లెట్ మానసిక స్థితిపై కూడా మంచి ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు. ఇది ‘ఫీల్ గుడ్’ హార్మోన్లుగా పిలిచే సెరోటోనిన్, ఎండార్ఫిన్ల విడుదలను ప్రోత్సహిస్తుంది. దీంతో మనసు ప్రశాంతంగా ఉండటం, ఒత్తిడి తగ్గడం వంటి లాభాలు కనిపిస్తాయి. దీనిలో ఉండే పాలీఫెనాల్స్ కార్టిసాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. దీంతో మానసిక ప్రశాంతతను పొందవచ్చు.
* డార్క్ చాక్లెట్ల వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. రాత్రిపూట తినేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం అంటున్నారు నిపుణులు. దీనిలో సహజంగానే కెఫిన్, థియోబ్రోమిన్ అనే ఉత్తేజకాలు ఉంటాయి. దీంతో ఆలస్యంగా నిద్ర పట్టడం, నిద్ర నాణ్యత తగ్గడానికి కారణమవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి.. పడుకోవడానికి కనీసం రెండు గంటల ముందే చాక్లెట్స్ తినేయడం ఉత్తమం.
* కొంతమందిలో డార్క్ చాక్లెట్ కడుపులో యాసిడ్ రిఫ్లక్స్ లేదా గుండెల్లో మంటను కూడా ప్రేరేపించవచ్చు. ముఖ్యంగా రాత్రి నిద్రకు ముందు తింటే ఈ సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. అన్నవాహికకు సంబంధించిన సమస్యలున్నవారిలో చాక్లెట్ తీసుకున్న తర్వాత యాసిడ్ ప్రభావం పెరిగినట్టు పరిశోధనలు వెల్లడించాయి.
* ఇంకో విషయం ఏమిటంటే.. డార్క్ చాక్లెట్‌లో చక్కెర పరిమాణం మిల్క్ చాక్లెట్‌తో పోలిస్తే తక్కువగా ఉన్నా, అది తీపి కోరికను పెంచుతుంది. రాత్రివేళ ఎక్కువగా తీసుకుంటే.. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం, బరువు పెరగడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
* అయితే రాత్రిపూట డార్క్ చాక్లెట్ పూర్తిగా మానేయాల్సిందే అన్న నియమం ఏమీలేదు. తినాలనుకుంటే.. మితంగా తీసుకోవడం బెటర్. నిద్రకు కనీసం ఒకటి నుంచి రెండు గంటల ముందు, చిన్న మోతాదులో తినడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే 70% లేదా అంతకంటే ఎక్కువ కోకో కంటెంట్ ఉన్న డార్క్ చాక్లెట్‌ను ఎంచుకోవడం మంచిది. ఇందులో ఫ్లేవనాయిడ్లు ఎక్కువగా ఉండి, చక్కెర తక్కువగా ఉంటుంది.
* మొత్తానికి.. డార్క్ చాక్లెట్ సరైన సమయంలో, సరైన పరిమాణంలో తీసుకుంటే ఆరోగ్యానికి మేలే చేస్తుంది. కానీ నిద్ర సమస్యలు ఉన్నవారు లేదా కెఫిన్‌కు సున్నితంగా స్పందించే వారు రాత్రిపూట దీనికి దూరంగా ఉండటం ఉత్తమమని నిపుణులు సలహా ఇస్తున్నారు.
Also Read: మానసిక ఒత్తిడి, డిప్రెషన్‌కు చెక్ పెట్టాలంటే.. రోజూ ఈ పండు తింటే చాలంటున్నారు ఎక్స్‌పర్ట్స్!