అది హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలోని ఓ ఐటీ కారిడార్. అక్కడి ఎత్తైన స్కైస్క్రేపర్లు కాసేపు తలెత్తి చూడాలంటేనే మెడ నొప్పి వస్తుంది. అలాంటి భవనాలపై బొమ్మల్లా వేలుడుతూ.. అద్దాలను క్లీన్ చేస్తున్న కూలీలను చూస్తే.. ‘‘వామ్మో.. అక్కడి నుంచి పడితే?’’ అనే ప్రశ్న మదిలో మెదులుతుంది. అంత సాహసం చేస్తున్నారంటే.. వారి జీతాలు గట్టిగానే ఉండొచ్చులే, చాలా దేశాల్లో అలాంటి పని చేసేవారికి లక్షల్లో జీతాలు ఉంటాయట.. అని కూడా అనుకుంటారు. కానీ, ఇది ఇండియా. పనికి తగిన జీతం వస్తుందో లేదో తర్వాత.. కనీసం చేసిన పనికి సమయానికి డబ్బులిస్తే చాలు అనుకొనే పరిస్థితి ప్రస్తుతం ఉంది. ఇక అలా ప్రాణాలకు తెగించి పనిచేసేవారికి ఇచ్చే జీతాలు గురించి తెలిస్తే.. మరోసారి ‘వామ్మో’ అంటారు. ఈసారి మరింత ఆశ్చర్యంతో.. ఇదెక్కడి న్యాయం అని ముక్కున వేలు వేసుకుంటారు.
కార్పొరేట్ భవనాల అద్దాలు, బాల్కనీలు మెరిసిపోతూ కనిపించడానికి కారణం.. ఆ కార్మికుల సాహసం. తమ ప్రాణాలను లెక్క చేయకుండా.. ఎటువంటి భయం లేకుండా.. భారీ అంతస్తులకు వేలాడుతూ.. పనిచేసే గ్లాస్ క్లీనర్ల జీవితాన్ని తెలిపే ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిర్భయ్ శర్మ అనే వ్యక్తి ఇటీవల నానక్‌రామ్‌గూడ పరిధిలోని ఒక హైరైజ్ అపార్ట్‌మెంట్ 44వ అంతస్తులో పనిచేస్తున్న కార్మికులు వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేశాడు. ఇందులో వారి జీతాలు గురించి అడిగి తెలుసుకున్నారు.
ఈ వీడియోలో ఉన్న ఒక కార్మికుడు.. తాను జార్ఖండ్ నుంచి పని కోసం హైదరాబాద్ వచ్చానని తెలిపాడు. ఈ పని చేసేందుకు నెలకు రూ.25 వేలు జీతం చెల్లిస్తారని తెలిపాడు. జీతంతోపాటు యాజమాన్యం తమకు బియ్యం, వంట గ్యాస్ ఉచితంగా ఇస్తారని, ఆఫీస్‌కు రాకపోకల కోసం ట్రావెల్ అలవెన్సులు కూడా అందిస్తారని చెప్పాడు.
ఆకాశాన్ని తాకేంత ఎత్తులో.. భవనానికి తాడు సహాయంతో వేలాడుతూ పనిచేస్తుంటే భయం వేయడం లేదా అనే ప్రశ్నకు అతడు బదులిస్తూ.. ‘‘మొదట్లో కాస్త భయం వేసేది. ఇప్పుడది అలవాటైపోయింది. దాదాపు 5, 6 ఏళ్ల నుంచి ఇదే పనిచేస్తున్నా. కాబట్టి ఇప్పుడు భయం అనిపించడం లేదు’’ అని తెలిపాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది. అంత ఎత్తులో పనిచేస్తున్న వారికి కనీసం ఇన్సురెస్స్ చెల్లించాలని, తగిన భద్రతా పరికారాలు, సెఫ్టీ కిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. వారి శ్రమకు తగిన జీతం చెల్లించాలని మరికొందరు అంటున్నారు.
Also Read: లేఆఫ్ తర్వాత.. రెండేళ్ల కొడుకుతో ఆఫీసుకెళ్లిన ఉద్యోగి, చివరికి ఓ నిజం తెలుసుకున్నాడు