Micro Break: రోజంతా జిమ్‌లో గంటలు గంటలు చెమటోడ్చడం కంటే.. ఆఫీసులో మీరు ప్రతి అరగంటకు తీసుకునే రెండు నిమిషాల విరామం మీ ప్రాణాలను కాపాడుతుందని మీకు తెలుసా ? అవును.. ‘మైక్రో-బ్రేక్స్’ అనేవి కేవలం విశ్రాంతి మాత్రమే కాదు.. అవి మీ వెన్నెముకకు, రక్త ప్రసరణకు ఇచ్చే అత్యుత్తమ ట్రీట్‌మెంట్. ఆఫీసు కుర్చీకే అతుక్కుపోవడం వల్ల వచ్చే దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడటానికి, మీ పని తీరును పెంచుకోవడానికి.. ఈ చిన్ని బ్రేక్స్ ఎలా సహాయ పడతాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
మనం కూర్చున్నప్పుడు మన శరీరంలోని పెద్ద కండరాలు (కాళ్లు, వీపు) విశ్రాంతి స్థితిలోకి వెళ్లిపోతాయి. దీని వల్ల రక్త ప్రసరణ మందగిస్తుంది. మెటబాలిజం 90% వరకు పడిపోతుంది. ఫలితంగా వెన్నునొప్పి, మెడ నొప్పి మాత్రమే కాకుండా, గుండె జబ్బులు వచ్చే అవకాశం కూడా పెరుగుతుంది. ఆఫీసులో 9 గంటల పాటు కదలకుండా కూర్చొంటే.. సాయంత్రం జిమ్‌కి వెళ్లి చేసే వ్యాయామం ఆ నష్టాన్ని పూర్తిగా పూడ్చలేదు.
మైక్రో-బ్రేక్స్: 2 నిమిషాల మేజిక్:
ప్రతి 30 నిమిషాలకు ఒకసారి కేవలం 2 నిమిషాలు బ్రేక్ తీసుకోవడం వల్ల కలిగే లాభాలు అద్భుతం.
కండరాల రీసెట్: కూర్చున్నప్పుడు వెన్నెముకపై పడే ఒత్తిడి, నిలబడినప్పుడు లేదా చిన్నగా అటు ఇటు నడిచినప్పుడు వెంటనే తగ్గిపోతుంది.
బ్లడ్ సర్క్యులేషన్: కాళ్లలోని రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే ప్రమాదం తప్పుతుంది. మెదడుకు ఆక్సిజన్ సరఫరా పెరిగి ఏకాగ్రత పెరుగుతుంది.
మానసిక చురుకుదనం: నిరంతరంగా స్క్రీన్ చూడటం వల్ల వచ్చే అలసట తగ్గి, సృజనాత్మకత పెరుగుతుంది.
Also Read: ఇన్సులిన్ నిద్రపోయే టైమ్‌లో తింటున్నారా? షుగర్ రావొచ్చు జాగ్రత్త
కూర్చున్న చోటే చేసుకునే చిన్న స్ట్రెచెస్:
మీరు ఆఫీసులో ఉండగానే.. మీ సీటు వదలకుండా చేయగలిగే కొన్ని వ్యాయామాలు..
నెక్ రోల్స్: నెమ్మదిగా తలని కుడి, ఎడమ వైపు తిప్పడం వల్ల మెడ కండరాల బిగువు తగ్గుతుంది.
షోల్డర్ ష్రగ్స్ : భుజాలను పైకి కిందకు కదిలించడం వల్ల మెడ, భుజాల మధ్య ఉండే ఒత్తిడి మటుమాయమవుతుంది.
సీటెడ్ ట్విస్ట్: కుర్చీలో కూర్చునే నడుమును ఇరువైపులా తిప్పడం వల్ల వెన్నెముక సరళత పెరుగుతుంది.
యాంకిల్ రొటేషన్ : డెస్క్ కింద కాళ్లను గుండ్రంగా తిప్పడం వల్ల రక్త ప్రసరణ సాఫీగా సాగుతుంది.
స్టాండింగ్ డెస్క్ :
ఇటీవలి కాలంలో ప్రపంచ వ్యాప్తంగా సాఫ్ట్‌వేర్ కంపెనీలు ‘స్టాండింగ్ డెస్క్’లను ప్రోత్సహిస్తున్నాయి. కూర్చుని పని చేసే దాని కంటే.. నిలబడి పని చేయడం వల్ల గంటకు 50 క్యాలరీలు అదనంగా ఖర్చవుతాయి. ఇది బరువు తగ్గడానికి , షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉండటానికి సహాయ పడుతుంది. ఒకే సారి గంటల తరబడి నిల బడకుండా.. 20 నిమిషాలు కూర్చుంటే 10 నిమిషాలు నిలబడి పని చేయడం బెస్ట్.
ఎర్గోనామిక్స్ ప్రాముఖ్యత:
మీ కుర్చీ, టేబుల్ పొజిషన్ మీ ఆరోగ్యానికి ముఖ్యం.
మీ కళ్లు కంప్యూటర్ స్క్రీన్ పైభాగానికి సమాంతరంగా ఉండాలి.
మీ మోచేతులు 90 డిగ్రీల కోణంలో ఉండాలి.
పాదాలు నేలకు ఆని ఉండాలి.