Winter Acne: చలికాలం రాగానే చర్మం తన సహజసిద్ధమైన తేమను కోల్పోయి పొడిబారిపోతుంది. చాలా మంది మొటిమలు కేవలం వేసవిలోనే వస్తాయని అనుకుంటారు. కానీ చలికాలంలో కూడా మొటిమల సమస్య తీవ్రంగా ఉంటుంది. చర్మం పొడిబారినప్పుడు, ఆ తేమను భర్తీ చేయడానికి చర్మ గ్రంథులు అధికంగా నూనెను ఉత్పత్తి చేస్తాయి. ఈ అధిక నూనె, చనిపోయిన చర్మ కణాలు , బ్యాక్టీరియాతో కలిసి రంధ్రాలను మూసివేయడం వల్ల మొటిమలు ఏర్పడతాయి. దీనినే ‘వింటర్ ఆక్నే’ అంటారు. సరైన జాగ్రత్తలు పాటించడం ద్వారా చలికాలంలో కూడా చర్మాన్ని కాంతివంతంగా, మొటిమలు లేకుండా ఉంచుకోవచ్చు.
చలికాలంలో మొటిమల సమస్య నుంచి తప్పించుకోవడానికి ఈ క్రింది చిట్కాలను పాటించండి.
1. సున్నితమైన క్లెన్సర్ వాడండి: వేసవిలో వాడే కఠినమైన ఫేస్ వాష్‌లను చలికాలంలో వాడకూడదు. ఇవి చర్మాన్ని మరింత పొడిగా మారుస్తాయి. దీనికి బదులుగా క్రీమ్ ఆధారిత లేదా ‘హైడ్రేటింగ్ క్లెన్సర్’ వాడాలి. ఇది చర్మంలోని తేమను తొలగించకుండా మురికిని మాత్రమే శుభ్రం చేస్తుంది.
2. మాయిశ్చరైజర్ తప్పనిసరి: చర్మం జిడ్డుగా ఉందనే కారణంతో చాలా మంది మాయిశ్చరైజర్ రాయడం మానేస్తారు. ఇది పెద్ద తప్పు. చలికాలంలో చర్మానికి తగినంత తేమ అందకపోతే మొటిమలు పెరుగుతాయి. కాబట్టి ‘నాన్-కామెడోజెనిక్’ అంటే రంధ్రాలను మూసివేయని మాయిశ్చరైజర్‌ను ఎంచుకోవాలి. హైలురోనిక్ యాసిడ్ లేదా సిరామైడ్స్ ఉన్న క్రీములు ఉత్తమం.
3. వేడి నీటిని తక్కువగా వాడండి: చలికాలంలో వేడి వేడి నీళ్లతో స్నానం చేయడం హాయిగా అనిపిస్తుంది. కానీ.. అతిగా వేడి నీటిని ముఖంపై వాడటం వల్ల చర్మంపై ఉండే సహజ నూనెలు పోయి చర్మం పొలుసులుగా మారుతుంది. ఇది మొటిమలకు దారితీస్తుంది. కాబట్టి ముఖం కడగడానికి ఎప్పుడూ గోరు వెచ్చని నీటినే వాడాలి.
4. హైడ్రేషన్ (నీరు తాగడం): చలికాలంలో దాహం తక్కువగా వేయడం వల్ల చాలా మంది నీరు తక్కువగా తాగుతారు. లోపల డీహైడ్రేషన్ ఉంటే అది చర్మంపై ప్రభావం చూపుతుంది. రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు తాగడం వల్ల చర్మం లోపలి నుంచి శుభ్రపడి మొటిమలు తగ్గుతాయి.
5. సన్ స్క్రీన్ వాడటం మర్చిపోవద్దు: చలికాలంలో ఎండ తక్కువగా ఉన్నప్పటికీ.. హానికరమైన UV కిరణాలు చర్మాన్ని దెబ్బతీస్తాయి. చర్మం దెబ్బతింటే మొటిమల మచ్చలు త్వరగా తగ్గవు. కాబట్టి బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా సన్ స్క్రీన్ రాసుకోవాలి.
Also Read: హై కొలెస్ట్రాల్ లక్షణాలు ఇవే.. లైట్ తీసుకుంటే చాలా డేంజర్ !
6. ఆహార నియమాలు: చలికాలంలో వేపుళ్లు, తీపి పదార్థాలు ఎక్కువగా తినాలనిపిస్తుంది. ఇవి శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను పెంచి మొటిమలకు కారణమవుతాయి. వీటికి బదులుగా పండ్లు, కూరగాయలు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే వాల్‌నట్స్, చేపలు తీసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
7. ముఖాన్ని తాకకూడదు: చేతులకు ఉండే బ్యాక్టీరియా ముఖానికి సోకడం వల్ల మొటిమలు ఇన్ఫెక్షన్‌గా మారుతాయి. అలాగే మొటిమలను గిల్లడం వల్ల మచ్చలు పడతాయి. ఫిల్లో కవర్స్ వారానికి ఒకసారి మార్చడం వల్ల కూడా మొటిమలను నివారించవచ్చు.
Also Read: ఎన్ని మందులు వాడినా మోకాళ్ల నొప్పులు తగ్గట్లేదా? ఈ హోం రెమెడీస్ ట్రై చేయండి