High cholesterol:హై కొలెస్ట్రాల్‌ను ‘సైలెంట్ కిల్లర్’ అని పిలుస్తారు, ఎందుకంటే ఇది రక్తనాళాల్లో పేరుకుపోయే వరకు ఎటువంటి స్పష్టమైన లక్షణాలను చూపదు. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగినప్పుడు, అది గుండెపోటు, స్ట్రోక్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. చాలా మంది దీనిని సాధారణ అలసటగా భావించి నిర్లక్ష్యం చేస్తారు. శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతున్నప్పుడు కనిపించే కొన్ని సూక్ష్మమైన మార్పులను ముందుగానే గుర్తించడం ద్వారా ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు. హై కొలెస్ట్రాల్ ప్రారంభ సంకేతాల గురించి వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం.
హై కొలెస్ట్రాల్ యొక్క ప్రారంభ లక్షణాలు:
సాధారణంగా కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు రక్త పరీక్ష ద్వారానే ఖచ్చితంగా తెలుస్తుంది. అయితే.. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు ప్రమాదకరంగా మారుతున్నప్పుడు ఈ కింది లక్షణాలు కనిపించవచ్చు.
1. ఛాతీలో అసౌకర్యం : రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోయినప్పుడు , గుండెకు రక్త ప్రసరణ తగ్గుతుంది. దీని వల్ల ఛాతిలో నొప్పి లేదా ఒత్తిడి అనిపించవచ్చు. దీనిని ‘ఆంజినా’ అని పిలుస్తారు. ఇది గుండె జబ్బులకు ప్రధాన సంకేతం.
2. విపరీతమైన అలసట , ఊపిరి ఆడకపోవడం: కొలెస్ట్రాల్ వల్ల రక్త ప్రసరణ నెమ్మదించినప్పుడు, శరీర భాగాలకు తగినంత ఆక్సిజన్ అందదు. దీని వల్ల చిన్నపాటి పని చేసినా విపరీతమైన అలసట రావడం, మెట్లు ఎక్కినప్పుడు ఊపిరి అందకపోవడం వంటివి జరుగుతాయి.
3. కాళ్లలో నొప్పి , తిమ్మిర్లు: రక్తనాళాలు మూసుకు పోవడం వల్ల కాళ్లకు రక్త ప్రసరణ తగ్గుతుంది. నడిచేటప్పుడు లేదా వ్యాయామం చేసేటప్పుడు కాళ్ల కండరాలలో నొప్పి రావడం, రాత్రి పూట తిమ్మిర్లు పట్టడం వంటివి జరిగితే అది హై కొలెస్ట్రాల్ లక్షణం కావచ్చు.
4. కళ్ల చుట్టూ పసుపు రంగు మచ్చలు: కొంత మందిలో కను రెప్పల పైన లేదా కళ్ల మూలల్లో పసుపు రంగులో చిన్న చిన్న గడ్డలు లేదా మచ్చలు కనిపిస్తాయి. ఇవి శరీరంలో కొవ్వు నిల్వలు పెరిగాయని చెప్పడానికి స్పష్టమైన బాహ్య సంకేతం.
5. మెడ, తల వెనుక భాగంలో నొప్పి: రక్త ప్రసరణలో ఆటంకాలు ఏర్పడినప్పుడు తరచుగా తల నొప్పి రావడం, ముఖ్యంగా మెడ వెనక భాగంలో భారంగా అనిపించడం వంటివి జరుగుతాయి.
6. అరచేతులు, అరికాళ్లలో మంటలు: నరాలకు రక్త ప్రసరణ సరిగ్గా అందనప్పుడు చేతులు, కాళ్లలో సూదులతో గుచ్చినట్లు ఉండటం లేదా మంటలు రావడం వంటివి గమనించవచ్చు.
Also Read: శీతాకాలంలో బరువు పెరగకుండా ఉండాలంటే.. తప్పకుండా పాటించాల్సిన 4 రూల్స్ ఇవే!
7. అధిక రక్తపోటు: కొలెస్ట్రాల్ వల్ల రక్తనాళాలు కుంచించుకుపోయి గట్టిపడతాయి. దీని వల్ల రక్తాన్ని పంప్ చేయడానికి గుండె ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది. ఫలితంగా రక్తపోటు పెరుగుతుంది.
హై కొలెస్ట్రాల్ లక్షణాలు అందరిలో ఒకేలా ఉండవు. ముఖ్యంగా ధూమపానం చేసేవారు, అధిక బరువు ఉన్నవారు, వంశ పారంపర్యంగా గుండె జబ్బులు ఉన్నవారు క్రమం తప్పకుండా రక్త పరీక్షలు చేయించుకోవాలి. పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం, రోజూ వ్యాయామం చేయడం, నూనె పదార్థాలను తగ్గించడం ద్వారా కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవచ్చు.