చాలా మంది కారులో సువాసన రావాలనే ఉద్దేశంతో పర్ఫ్యూమ్‌లు లేదా ఎయిర్ ఫ్రెష్‌నర్లు వాడుతూ ఉంటారు. కారులో ఏసీ వేసుకుని ప్రయాణిస్తున్నప్పుడు విండోలు మూసేస్తారు. అలాంటి సమయంలోనే మంచి వాసన కోసం పెర్ఫ్యూమ్ లు వాడుతూ ఉంటారు.అయితే తాజా పరిశోధనలు చెబుతున్నది మాత్రం భిన్నంగా ఉంది. ఈ పర్ఫ్యూమ్‌లలో ఉన్న రసాయనాలు మన ఆరోగ్యానికి ఎంతో హానిచేస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఈ రసాయనాలు ఉంటాయి
మార్కెట్‌లో లభించే కార్ ఫ్రెష్‌నర్లలో ఎక్కువగా వోలటైల్ ఆర్గానిక్ కంపౌండ్స్ (VOCs) అనే రసాయనాలు ఉంటాయి. ఇవి గాలి ద్వారా సులభంగా వ్యాపించి మంచి సువాసనను కలిగిస్తాయి. కానీ ఇవి మన ఊపిరితిత్తుల్లోకి చేరి శ్వాసకోశ సమస్యలు, తలనొప్పులు, కళ్ల మంట, అలెర్జీలు వంటి సమస్యలకు దారితీస్తాయి. కారులో తలుపులు మూసివేసి ఎక్కువసేపు ప్రయాణిస్తే ఈ రసాయనాల ప్రభావం మన శరీరంపై మరింత ఎక్కువ అవుతుంది.
పీలిస్తే ఈ సమస్యలు
ఆరోగ్య నిపుణులు చెబుతున్న ప్రకారం కారు పెర్ఫ్యూమ్‌లలో ఉపయోగించే కొన్ని సింథటిక్ రసాయనాలు గాలిలో కలిశాక… బెంజీన్, ఫార్మాల్డిహైడ్, టోల్యూయిన్ వంటి హానికర పదార్థాలను విడుదల చేస్తాయి. ఇవి ఎక్కువమేరలో శరీరంలోకి చేరితే క్యాన్సర్ ప్రమాదం కూడా పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. అమెరికా పర్యావరణ సంస్థ నివేదిక ప్రకారం, వాహనాల్లో వాడే సువాసన ఉత్పత్తుల్లో దాదాపు 90 శాతం VOCలు ఉంటాయి. ఇవి దీర్ఘకాలికంగా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.
వీరికి శ్వాస సంబంధిత అనారోగ్యాలు
కారు విండోలు మూసివేసి ఉంటే లోపల గాలి చలనం తక్కువగా ఉంటుంది. అటువంటి చోట ఈ రసాయనాలు త్వరగా గాలిలో నిండిపోతాయి. సూర్యరశ్మి లేదా వేడి వాతావరణంలో ఇవి మరింత వేగంగా ఆవిరై గాలిలో మిళితమవుతాయి. ఫలితంగా డ్రైవర్ లేదా ప్రయాణికులు ఊపిరి పీల్చేటప్పుడు ఈ రసాయనాలు శరీరంలోకి చేరుతాయి. చిన్నపిల్లలు, వృద్ధులు లేదా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడేవారికి ఇది అత్యంత ప్రమాదకరంగా మారవచ్చు. ఇంకా ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ పర్ఫ్యూమ్‌లు దుర్వాసనను పూర్తిగా తొలగించవు. కారులో చెమట, ఫంగస్ లేదా ధూళి వలన ఏర్పడిన దుర్వాసన అలాగే ఉంటుంది. దీని వల్ల క్రమంగా కార్‌లో గాలి నాణ్యత మరింతగా తగ్గిపోతుంది.
ఈ సెంట్ ఉత్పత్తుల్లో వాడే ఫ్రాగ్రెన్స్ ఫిక్సేటర్లు (వాసన నిల్వ చేసేందుకు వాడే రసాయనాలు) కూడా దీర్ఘకాలికంగా పీల్చడం వల్ల మానసిక అలసట, నిద్రలేమి, చర్మ వ్యాధులు వంటి దుష్ప్రభావాలను కలిగించగలవు. కాబట్టి కారు పర్ఫ్యూమ్ వాసన మనసుకు ఆనందాన్నిస్తుందే తప్ప అది శరీరానికి మాత్రం మంచిది కాదు.
వీటిని వాడితే బెటర్
కారులో సహజమైన వస్తువులతో మీరు సువాసన వచ్చేలా చేయాలి. నిమ్మకాయ తొక్కలు, కాఫీ పొడి, దాల్చిన చెక్క లేదా లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ వంటి సహజ పదార్థాలు వాడితే మంచి వాసన వస్తాయి. అవి సురక్షితం కూడా. ప్రయాణానికి ముందు, తర్వాత తలుపులు లేదా విండోలు కొద్ది సేపు తెరిచి ఉంచండి. పిల్లలు కారు లోపల ఎక్కువ సమయం గడిపితే పర్ఫ్యూమ్ వాడకం పూర్తిగా నివారించాలి.