Vertigo Problem: ప్రతి ఉదయం అందరికీ ఒకేలా ఉండకపోవచ్చు. కొందరికి ఉదయం నిద్రవేగానే తాజా అనుభూతి కలుగుతుంటుంది. శరీరం తేలిగ్గా ఉండి, మెదడు చురుగ్గా పని చేస్తుంటుంది. మరి కొందరికేమో.. తాజా అనుభూతి కలగకపోగా.. తల తిరుగుతున్నట్లుగా, బలహీనంగా, నీరసంగా అనిపిస్తుంటుంది. ఇంకొంత మందికి ఎత్తైన ప్రాంతాలకు వెళ్లినప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు తల తిప్పినట్టు, కళ్లు తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంటుంది. వాంతి వచ్చినట్టుగా వికారంగానూ ఉంటుంది. అయితే, ఇలాంటి పరిస్థితులు తరచూ ఎదురవుతుంటే మాత్రం జాగ్రత్త పడాలని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. ఎందుకంటే.. ఈ విధమైన పరిస్థితిని ‘వర్టిగో’ అని పిలుస్తారు. మన రోజుని దుర్భరంగా మార్చే వర్టిగోకు కారణాలేంటి? బయటపడే మార్గాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
తల ఎత్తినప్పుడు, తల దించినప్పుడు, బెడ్ మీద ఒకపక్క నుంచి మరో పక్కకు తిరిగినా, బెడ్డు మీద నుంచి లేచి కూర్చున్నా.. ఇలా అస్తమానం తల తిరుగుతుంటుంది. కొన్నిసార్లు నడుస్తున్నప్పుడు తూలిపడిపోతుంటారు. కాకపోతే, ఈ లక్షణాలన్నీ కొన్నిసెకన్ల నుంచి రెండు నిమిషాల మధ్యలోనే ఉంటాయి. మన చెవిలో ఉన్న బ్యాలెన్స్ ఆర్గాన్లో క్యాల్షియం కార్బోనేట్ క్రిస్టల్స్ ఉంటాయి. తల ఎత్తినా, తల దించినా ఈ క్రిస్టల్స్ చెవిలోని ఫ్లూయిడ్‌లో అటు ఇటు తిరుగుతాయి. దీంతో తల తిరుగుతుందంటున్నారు వైద్యులు. చాలావరకు ఒకచెవిలోనే ఇలా జరుగుతుంటుంది. ఈ రకం వర్టిగోని పొజిషనల్ టెస్ట్ ద్వారా డయాగ్నోస్ చేస్తారు.
మన శరీరంలో ప్రతి సమస్యకు కచ్చితంగా ఏదో ఒక కారణం ఉంటుంది. ముఖ్యంగా రక్తపోటు వల్ల, శరీరంలో నీరు తగ్గడానికి వాడే మందుల వల్ల కూడా వర్టిగో పెరగొచ్చు. స్లీప్ అప్నియా సమస్య ఉన్నవారు నిద్రలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతుంటారు. దీనివల్ల రక్తంలో ఆక్సిజన్ తగ్గుతుంది. దీంతో ఉదయం నిద్రలేవగానే తల తిరిగే అవకాశముంది. గురక వస్తున్నా, బాగా నిద్రపోయిన తర్వాత కూడా.. తెల్లవారు జామున అలసటగా అనిపిస్తున్నా.. వైద్యుల్ని సంప్రదించడం మంచిది.
* మన శరీరానికి అవసరమైన స్థాయిలో ద్రవాలు తీసుకోకపోతే డీ హైడ్రేషన్‌కు గురవుతాం.
* అధిక మోతాదులో ఆల్కహాల్ తాగడం, కెఫిన్ తీసుకునే వారిలోనూ ఈ సమస్య ఉంటుంది.
* మీ శరీరానికి సరిపడా మంచినీరు అందుబాటులో లేకపోతే మెదడు, శరీరం సరిగ్గా పనిచేయలేవు.
* తల తిరిగినట్లుగా, నిలుచున్న ప్రదేశం తిరిగిపోయినట్లుగా అనిపిస్తూ ఉన్నప్పుడు కూడా జాగ్రత్త పడకపోవడం.
ఎవరిలో అయినా వర్టిగో లక్షణాలు కనిపిస్తే.. ఆ వ్యక్తిని ఒకసారి నడిపించి చూడాలి. ఆ టైంలో ఎక్కువగా తూలితే.. ఎంఆర్ఐ, సీటీ స్కానింగ్ చేయాలి. అలక్ష్యం చేస్తే మాత్రం స్ట్రోక్ వచ్చే అవకాశం లేకపోలేదు. రక్తంలో చక్కెర స్థాయి పడిపోయినా ఉదయం నిద్ర లేవగానే తల తిరిగుతుంది. మధుమేహం ఉన్న వారిలో ఈ సమస్య ఎక్కువ. చెవిలోని లోపలి భాగం దెబ్బతిన్నా, అనారోగ్యానికి గురైనా తల తిరిగే సమస్య రావచ్చు. కానీ.. చాలా వరకు ఇది దానంతట అదే తగ్గుతుంది. ఒక వేళ తగ్గకపోతే.. డాక్టర్లను సంప్రదించాలి.