Center Scrap Selling: స్క్రాప్ తో కేంద్రానికి భారీ ఆదాయం వచ్చింది. గత నెలలో భారీ క్లీన్ నెస్ డ్రైవ్‌లో భాగంగా కేంద్రం స్క్రాప్‌ను అమ్మింది. ఈ స్క్రాప్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి రూ. 800 కోట్లు ఆదాయం సమకూరింది. ఇది రూ.615 కోట్ల వ్యయంతో చంద్రునిపై విజయవంతంగా దిగిన చంద్రయాన్-3 బడ్జెట్ కంటే అధికం. 2021లో ప్రారంభమైన వార్షిక క్లీన్ నెస్ డ్రైవ్ నుంచి, ఈ సంవత్సరం వరకు స్క్రాప్ అమ్మకం ద్వారా ప్రభుత్వం దాదాపు రూ.4,100 కోట్లకు పైగా ఆదాయం పొందింది. ఈ ఏడాది అక్టోబర్ 2 నుంచి 31 మధ్య జరిగిన ఈ డ్రైవ్ లో ఇప్పటి వరకు గరిష్టంగా 232 లక్షల చదరపు అడుగుల ప్రభుత్వ కార్యాలయ స్థలాలను క్లీన్ చేయగా వీటిల్లో 29 లక్షలకు పైగా పాత ఫైళ్లను తొలగించారు. ఈ డ్రైవ్ లో దాదాపు 11.58 లక్షల కార్యాలయాలను కవర్ చేయనున్నారు.
పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం ఆధ్వర్యంలో విదేశాలలోని పలు మిషన్లు సహా 84 మంత్రిత్వ శాఖలు, విభాగాలలో ఈ క్లీన్ నెస్ డ్రైవ్ ప్రోగ్రామ్ చేపట్టారు. ముగ్గురు సీనియర్ మంత్రులు, మన్సుఖ్ మాండవీయ, కె.రామ్ మోహన్ నాయుడు, జితేంద్ర సింగ్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 2021 నుంచి 2025 వరకు కేంద్రం ఐదుసార్లు భారీ క్లీన్ నెస్ డ్రైవ్ ప్రోగ్రామ్స్ చేపట్టింది. ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రత, పెండింగ్ ఫైళ్ల భారాన్ని తగ్గించడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమాల్లో ‘స్వచ్ఛత’ ప్రచారం కింద 23.62 లక్షల కార్యాలయాలను కవర్ చేశారు. వీటిల్లో 928.84 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని ఖాళీ చేయడం, 166.95 లక్షల ఫైళ్లను తొలగించడం చేశారు. ఈ స్క్రాప్ ద్వారా రూ.4,097.24 కోట్లు ఆదాయం పొందింది.
Also Read: Karregutta Operation: హిడ్మా పని ఖతం! కర్రెగుట్టను చుట్టుముట్టిన 200 మంది పోలీసులు