Intermittent Fasting: చాలామంది బరువు తగ్గాలి, శరీరంలో శక్తి పెరగాలి, మెటబాలిజం మెరుగుపడాలి అని ‘ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్’ను ఫాలో అవుతుంటారు. అయితే అన్ని నియమాలు పాటిస్తున్నా.. ఆశించిన మార్పులు మాత్రం కనిపించకపోతే నిరాశ పడటం సహజమే. నిజానికి మీ ఫాస్టింగ్ పద్ధతిలో చేసే చిన్న పొరపాట్లే మీరు ఆశించిన ఫలితాలను ఆలస్యం చేస్తాయంటున్నారు నిపుణులు.
ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది ఒక్కరోజులో అద్భుతాలు చూపించే మ్యాజిక్ కాదు. ఇది క్రమశిక్షణతో పాటు సరైన అలవాట్లను కూడా కోరుకునే ప్రయాణం. ఇప్పుడు చాలామంది తెలియకుండా చేసే 5 ముఖ్యమైన తప్పులు ఏవో తెలుసుకుని, వాటిని సరిదిద్దుకుందాం.
ఫాస్టింగ్ విండోలో కేలరీలు పూర్తిగా నియంత్రించాల్సి ఉంటుంది. కానీ కాఫీ లేదా టీలో పాలు, చక్కెర, ఫ్లేవర్డ్ క్రీమ్స్ కలిపితే అవి ఫాస్టింగ్‌ను బ్రేక్ చేస్తాయి. ఇలా చిన్నపాటి అలవాట్లే మీ శరీరాన్ని ఫాస్టింగ్ మోడ్‌లోకి వెళ్లకుండా అడ్డుకుంటాయి. ఫాస్టింగ్ సమయంలో నీరు, బ్లాక్ కాఫీ లేదా బ్లాక్ టీ మాత్రమే తీసుకోవడం ఉత్తమం.
Also Read: మాయా లేదు మంత్రం లేదు.. ఏడు పవర్‌ఫుల్ సైంటిఫిక్ ట్రిక్స్‌తో శరీరాన్ని వెంటనే రీసెట్ చేయొచ్చు!
ఇంతసేపు తినలేదు కదా.. అన్న భావనతో ఈటింగ్ విండోలో అతిగా తినడం మరో సాధారణ తప్పు. ఫాస్టింగ్ చేసినంత మాత్రాన ఏది పడితే అది తినేయొచ్చని భావిస్తే, బరువు తగ్గడం మరింత కష్టమవుతుంది. ఈ సమయంలో సమతుల్యమైన ఆహారం, సరైన కేలరీలు తీసుకోవడం చాలా ముఖ్యం.
కేవలం తిన్నామా లేదా అన్నది కాకుండా, ఏమి తింటున్నామన్నది కూడా మరింత ముఖ్యమైనది. ప్రొటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు లేని ఆహారం శరీరానికి అవసరమైన శక్తిని ఇవ్వదు. ఫలితంగా త్వరగా ఆకలి వేయడం, అలసట రావడం వంటి సమస్యలు ఏర్పడతాయి. దీని వల్ల ఫాస్టింగ్‌ను కొనసాగించడం కూడా కష్టమవుతుంది.
తగినంత నిద్ర లేకపోతే శరీరంలో ఒత్తిడి హార్మోన్లు పెరుగుతాయి. ముఖ్యంగా కార్టిసాల్ స్థాయి ఎక్కువైతే, కొవ్వు కరిగే ప్రక్రియ మందగిస్తుంది. రోజుకు కనీసం 7 నుంచి 9 గంటల నిద్ర లేకపోతే, మీరు చేస్తున్న ఫాస్టింగ్ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవచ్చు.
ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌తో పాటు శరీరానికి కదలిక కూడా అవసరం. రోజూ కొంతసేపు వాకింగ్ అయినా, మితమైన వ్యాయామం అయినా చేయకపోతే మెటబాలిజం నెమ్మదిస్తుంది. బరువు తగ్గాలనుకుంటే ఫాస్టింగ్ మాత్రమే చేస్తే సరిపోదు. శరీరాన్ని చురుగ్గా ఉంచుకోవడం కూడా హెల్తీ లైఫ్‌స్టైల్‌కు ఎంతో ముఖ్యం.
ఇకపోతే ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది ఓ దీర్ఘ ప్రయాణం. ఇందులో ఓర్పు, స్థిరత్వం, సరైన అలవాట్లు అన్నీ ఉండాలి. మీరు ఆశించిన ఫలితాలు రాకపోతే.. దినచర్యలో ఎలాంటి తప్పులను చేస్తున్నారో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న మార్పులు కూడా కాలక్రమంలో పెద్ద ఫలితాలను ఇస్తాయి.
Also Read: కిక్కు కోసం పెగ్గు అవసరం లేదు.. రోజుకొక హగ్గు చాలంటున్న వైద్య నిపుణులు!