CM Served an Actress : సినిమా ఇండస్ట్రీకి, రాజకీయాలకు ఉన్న సంబంధం విడదీయరానిది. వెండితెరపై దేవుళ్లుగా, వీరులుగా ఆరాధించబడే నటీనటులు, ప్రజల గుండెల్లో సంపాదించుకున్నారు. ఇలా తెలుగు ఇండస్ట్రీ నుంచి వెళ్లి ఏకంగా తమిళనాడు సీఎం అయ్యారు అప్పటి హీరోయిన్ జయలలిత. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరుసార్లు తమిళనాడు రాష్ట్రానికి ఆమె సీఎంగా పని చేశారు. తాజాగా సీనియర్ నటి జయసుధ తమిళనాడు దివంగత సీఎం జయలలిత గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఆ వివరాల్లోకి వెళ్తే…
ఆ రాత్రి ఏం జరిగింది?
తమిళనాడు ప్రజలు ‘అమ్మ’ అని ఆరాధించే దివంగత ముఖ్యమంత్రి జయలలిత , జయసుధ స్వయంగా సేవలు చేశారన్న విషయం చాలా మందికి తెలియదు. జయసుధ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని గుర్తుచేసుకున్నారు. ఒక సమయంలో జయసుధ, జయలలిత ఇద్దరూ ఒకే షూటింగ్ నిమిత్తం ఒక హోటల్‌లో బస చేశారు. అప్పట్లో జయలలిత స్టార్ హీరోయిన్‌గా వెలుగు వెలుగుతున్నారు. ఆ సమయంలో జయసుధకి తీవ్రమైన జ్వరం వచ్చింది. సాధారణంగా జయసుధతో ఉండే వాళ్ళ అమ్మ ఆ సమయంలో అందుబాటులో లేరు, కేవలం వాళ్ళ నాన్న మాత్రమే ఉన్నారు. రోజంతా కూతురి పక్కనే ఉండి సేవలు చేసిన ఆమె తండ్రి, రాత్రి సమయంలో కాసేపు బయట గాలికి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లారట. సరిగ్గా అదే సమయంలో షూటింగ్ ముగించుకుని హోటల్‌కు వచ్చిన జయలలిత, పక్క రూమ్‌లోనే ఉన్న జయసుధకు ఒంట్లో బాలేదని తెలుసుకున్నారు.

‘అమ్మ’ అనిపించుకున్నారు
జయలలిత చాలా రిజర్వ్‌డ్‌గా ఉంటారని అందరూ అనుకుంటారు. కానీ, ఆ రాత్రి జయసుధ పరిస్థితి చూసి ఆమె చలించిపోయారు. షూటింగ్ నుంచి వచ్చి అలసిపోయి ఉన్నప్పటికీ, నిద్రపోకుండా జయసుధ పక్కనే కూర్చుని సేవలందించారట. జ్వరం తగ్గడానికి తడి గుడ్డతో నుదుటిని తూడవడం, సపర్యలు చేయడం వంటివి దగ్గరుండి చూసుకున్నారట. జయసుధ తండ్రి తిరిగి వచ్చేవరకు ఆమె అక్కడే ఉండి ఒక సోదరిలా చూసుకున్నారని జయసుధ స్వయంగా వెల్లడించారు.
ఆపదలో ఆదుకున్న గొప్ప మనసు
కేవలం సపర్యలే కాదు, జయసుధ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా జయలలిత తన పెద్ద మనసును చాటుకున్నారు. ఆమె పరిస్థితి తెలుసుకుని వెంటనే జయ టీవీలో రెండు సీరియల్స్ చేసే అవకాశం కల్పించి ఆదుకున్నారు. ముఖ్యమంత్రిగా దేశం మెచ్చిన పాలన అందించడమే కాదు, అంతకంటే ముందే మనుషులను ప్రేమించే అమ్మగా జయలలిత నిలిచారని జయసుధ భావోద్వేగంతో గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం జయసుధ చెప్పిన ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.