Black-mold on Onions: సాధారణంగా ఉల్లిపాయ లేనిదే ఏ కూర అంత రుచిగా ఉండదు. టమోటా తర్వాత వంటల్లో ఎక్కువగా ఉపయోగించేది ఉల్లిగడ్డనే. అంతలా మన జీవితాల్లో భాగమైపోయిందీ ఉల్లిపాయ. అంతేకాదు.. మన జీర్ణవ్యవస్థను, గుండె ఆరోగ్యాన్ని కాపాడే శక్తి ఉల్లికి ఉంది. ఇకపోతే ఉల్లిపాయ ఎంత మంచిదైనప్పటికీ.. అది బాగున్నంత వరకే ఈ గుణాలు మనకు మేలు చేస్తాయి. కొన్ని ఉల్లిపాయల మీద అప్పుడప్పుడూ నల్లటి పొర ఏర్పడుతుంటుంది. దానిని తోలే కదా అని తీసేయడమో లేదా గుడ్డతో తుడిచేసి వంటల్లో వాడేయడమో చేస్తుంటారు చాలామంది. ఈ నేపథ్యంలో ఉల్లిపాయలపై ఇలా నల్లటి పొర ఎందుకు ఏర్పడుతుంది? దాన్ని తింటే అనారోగ్య సమస్యలు వస్తాయా? వైద్య నిపుణులు ఏం చెబుతున్నారు.. వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఉల్లిపాయ పొరలపై కనిపించే నల్లటి దుమ్ము లేదా మచ్చల్ని చాలామంది తేలిగ్గా తీసుకుంటారు. కానీ, నిజానికి అవి ఒక రకమైన ఫంగస్(బూజు). దీని శాస్త్రీయ నామం ఆస్పర్‌జిలస్ నైగర్ (Aspergillus niger). ఈ ఫంగస్ సాధారణంగా నేలలో, వృక్ష సంబంధిత పదార్థాలపై వృద్ధి చెందుతుంది. ఉల్లిపాయలు కోసిన తర్వాత లేదా నిల్వ ఉంచే సమయంలో.. తేమ, ఇతర కారణాలతో ఈ నల్లటి బూజు ఏర్పడుతుంది. ఇది మనకి కనిపిస్తున్నట్లు ఉల్లిపాయపై పొరను మాత్రమే కాదు, చాలాసార్లు లోపలి పొరలకు కూడా పాకుతుంది.
Read Also: వింటర్ ఎఫెక్ట్-సైనస్ వేధిస్తోందా.. డోంట్ వర్రీ, ఈ చిట్కాలు పాటిస్తే ఫుల్ రిలీఫ్!
నల్లటి వలయాలు ఏర్పడిన ఉల్లిపాయపై ఆస్పర్‌జిలస్ నైగర్ ఫంగస్ కొన్ని రకాల అత్యంత ప్రమాదకరమైన మైకోటాక్సిన్ (Mycotoxin)ను ఉత్పత్తి చేస్తాయి. వీటినే
ఆక్ర టాక్సిన్-ఏ(Ochratoxin A) అంటుంటారు. ఇదే ఉల్లిపాయల మీద మనకి కనిపించే నల్లటి మచ్చల్లో దాగి ఉన్న విషం. సాధారణంగా ఉల్లిపాయపై నల్లటి మచ్చలు ఉన్నంత మాత్రాన అది విషపూరితమని చెప్పలేం, కానీ ఆ మచ్చలు ఆక్ర టాక్సిన్ ఏను విడుదల చేసే జాతి ఫంగస్. కాబట్టి.. ఇలాంటి నల్లటి మచ్చలు ఉన్న ఉల్లిపాలయలను తింటే.. అది మన ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగిస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
ఆక్ర టాక్సిన్-ఏ అనేది చాలా అత్యంత విషపూరిత పదార్థం. దీన్ని ఆహారం ద్వారా తీసుకుంటే.. దీర్ఘకాలంలో మన శరీరంలోని కీలక అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఇది మూత్రపిండాలను దెబ్బతీసి, కాలక్రమేణా కిడ్నీ సమస్యలకు దారితీయవచ్చు. కాలేయం పనితీరును అడ్డుకొని, దాని ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అంతే కాదు.. ఇది మన శరీరంలోని రోగనిరోధక శక్తిని కూడా తీవ్రంగా బలహీనపరుస్తుంది. కాబట్టి.. నల్లటి మచ్చలు ఏర్పడిన ఉల్లిపాయలను తినకపోవడమే ఉత్తమం.
మార్కట్‌ల ఉల్లిపాయ కొనేటప్పుడే, దానిపై నలుపు రంగులో దుమ్ము, మచ్చలు లేదా పగుళ్లు లేని మంచి నాణ్యత కలిగిన ఉల్లిపాయలను మాత్రమే ఎంచుకోవాలి.
వంట చేసేటప్పుడు ఉల్లిపాయపై నల్లటి మచ్చలు లేదా బూజు కనిపించినట్లయితే.. ఆ మందపాటి పొరలన్నింటినీ పూర్తిగా తొలగించి, మిగిలిన ఉల్లిపాయను ఉపయోగించండి.
ఒకవేళ నల్లటి మచ్చలు ఉల్లిపాయ పై పొరలను దాటి లోపలికి వ్యాపించి ఉన్నట్లు లేదా మెడ భాగం పూర్తిగా ప్రభావితమైనట్లు అనిపిస్తే, ఆ ఉల్లిపాయను వెంటనే పారేయడం ఉత్తమం.
ఉల్లిపాయలను ఎప్పుడూ పొడిగా, చల్లగా, మంచి గాలి తగిలే ప్రదేశంలో నిల్వ చేయాలి. తేమ అధికంగా ఉన్న ప్రదేశాలు ఫంగస్ వృద్ధికి దోహదపడతాయి.
ఉల్లిపాయలపై కనిపించే నల్లటి మచ్చలు ఒక సాధారణ ఫంగస్ అయినా, దాని వెనుక దాగి ఉన్న ఆక్రటాక్సిన్ – ఏ వంటి విషపదార్థాల ప్రమాదాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. కొద్దిపాటి జాగ్రత్తతో మనం మన ఆరోగ్యాన్ని, మన కుటుంబాన్ని ఈ కంటికి కనిపించని విషం బారి నుండి కాపాడుకోవచ్చు.
Read Also: నిద్రపోయే ముందు నీళ్లు తాగడం మంచిదా? కాదా?.. ఈ విషయంలో నిపుణులు మాట ఇదే!