ఉత్తర కొరియా సుప్రీం లీడర్ కిమ్ జోంగ్ ఉన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తన నియంతృత్వ విధానాలతో ప్రజలకు నరకం ఎలా ఉంటుందో చూపిస్తున్నాడు. ప్రజల సంక్షేమాన్ని మరిచి.. రాజభోగాలు అనుభవిస్తున్నాడు. అతడి పాలన వల్ల ఉత్తర కొరియా తీవ్రమైన ఆర్థిక సవాళ్లను ఎదుర్కొ్ంటోంది. ఐక్యరాజ్యసమితి నివేదికల ప్రకారం, ఉత్తర కొరియా జనాభాలో దాదాపు 40 శాతానికి పైగా ప్రజలు.. తీవ్ర పోషకాహార లోపంతో, దినదిన గండంగా జీవితాన్ని గడుపుతున్నారు. అయితే, కిమ్ జోంగ్ ఉన్ మాత్రం ప్రపంచంలోని ఏ అగ్రరాజ్య అధినేతకూ తీసిపోని రీతిలో వేల కోట్ల రూపాయల రాచరిక విలాసాలను అనుభవిస్తున్నారు.
దక్షిణ కొరియా, అమెరికా నిఘా సంస్థల అంచనాల ప్రకారం.. కిమ్ జోంగ్ ఉన్ వ్యక్తిగత ఆస్తి సుమారు రూ.35,000 కోట్ల నుంచి రూ.42,000 కోట్లకు పైనే ఉండవచ్చని తెలిసింది. అంతర్జాతీయ ఆంక్షలు ఉన్నప్పటికీ కిమ్ జోంగ్ ఉన్‌కు ఆ స్థాయిలో సంపద ఎలా వస్తోందని చాలా ఆశ్చరపోతుంటారు. ఇందుకు కారణం.. ఆఫీస్ 39. ఇది ఉత్తర కొరియా పాలక వర్గానికి నిధులు సమకూర్చే ఒక రహస్య ప్రభుత్వ విభాగం. హాకింగ్, క్రిప్టోకరెన్సీ దోపిడీ వంటి సైబర్ నేరాలు, బంగారం తవ్వకాలు, చట్టవిరుద్ధమైన ఆయుధాల విక్రయాల్లో ఉత్తర కొరియా కీలకంగా పనిచేస్తోంది. వీటి ద్వారా విదేశాలలో ఉన్న ఉత్తర కొరియన్ బ్యాంక్ ఖాతాల నుంచి బిలియన్ డాలర్ల నిధులను నేరుగా కిమ్ కుటుంబం కోసం సేకరిస్తారు. ఇవి కాకుండా స్విట్జర్లాండ్, ఆస్ట్రియా, లక్సెంబర్గ్, చైనా, ఆస్ట్రియా వంటి దాదాపు 200 విదేశీ బ్యాంక్ ఖాతాలలో కిమ్ రహస్యంగా నిధులు దాచుకున్నట్లు సమాచారం.
ఉత్తర కొరియా వ్యాప్తంగా కిమ్ కుటుంబానికి దాదాపు 17 ప్యాలెస్‌లు ఉన్నట్లు సమాచారం. ప్యాంగ్యాంగ్లో గల రెసిడెన్స్ 55 అనే ప్యాలెస్.. కిమ్ ప్రధాన నివాసం. ఈ ప్యాలెస్ చుట్టూ భారీ కాంపౌండ్ ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో తప్పించుకోడానికి వీలుగా.. భూగర్భ బంకర్లు ఉంటాయి. మిలిటరీ కమాండ్ సెంటర్, స్విమ్మింగ్ పూల్స్, విలాసవంతమైన ఫౌంటెన్లు సైతం ఈ ప్యాలెస్‌లోనే ఉంటాయి. ఇది కాకుండా వోన్సాన్ తీరానికి సమీపంలో కిమ్‌కు ఒక ప్రైవేట్ ఐలాండ్ కూడా ఉంది. ఇక్కడ హాలీవుడ్ స్టార్ల భవనాలను తలపించే విల్లాలు, ప్రైవేట్ వాటర్ పార్కులు ఉన్నాయి.
దేశ, విదేశీ పర్యటనలకు కిమ్ ఉపయోగించే ప్రధాన వాహనం ‘తైయాంగ్హో’. కొరియన్ భాషలో సూర్యుడు అని అర్థం. ఇది ఒక బుల్లెట్‌ప్రూఫ్ రైలు. దీనికి 90 భోగీలు ఉంటాయి. బుల్లెట్‌ప్రూఫ్ గ్లాసెస్, బరువైన బాడీ వల్ల ఈ రైలు గంటకు గరిష్టంగా 60 కి.మీ వేగంతో మాత్రమే ప్రయాణిస్తుంది. ఇందులో బెడ్రూమ్లు, రిసెప్షన్ హాళ్ళు, శాటిలైట్ కమ్యూనికేషన్‌తో కూడిన కమాండ్ రూమ్‌లు ఉంటాయి. ఇంకా ఇందులో పారిస్ నుంచి దిగుమతి చేసుకున్న వైన్లు, ఇరాన్ బ్లాక్ కేవియర్, డెన్మార్క్ నుంచి తెప్పించిన పంది మాంసం వంటకాలు ఉంటాయి. విదేశీ చెఫ్‌లు వీటిని ప్రత్యేకంగా వండి వడ్డిస్తారు. ఈ రైలు కోసం ఉత్తర కొరియాలో ప్రత్యేకంగా 12 ప్రైవేట్ రైల్వే స్టేషన్లు నిర్మించారు.
కిమ్ జోంగ్ ఉన్ వద్ద 100 కంటే ఎక్కువ యూరోపియన్ లగ్జరీ కార్లు ఉన్నాయి. సుమారు రూ.15 కోట్లు విలువ చేసే బుల్లెట్ ప్రూఫ్.. మెర్సిడెస్ మేబాక్, మెర్సిడెస్ బెంజ్ S600 గార్డ్ కార్లు, రోల్స్ రాయిస్ ఫాంటమ్స్ ఆయన గ్యారేజీలో ఉన్నాయి. ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా కిమ్‌కు విలాసవంతమైన ‘Aurus’ లిమోసిన్ కారును కానుకగా ఇచ్చారు. కిమ్ ఉపయోగించే విమానాన్ని ఎయిర్ ఫోర్స్ ఉన్ అంటారు. ఇవి కాకుండా సోవియట్ కాలం నాటి Ilyushin-62, Ukrainian Antonov-148 విమానాలను కిమ్ ఉపయోగిస్తారు. వీటి లోపలి భాగాన్ని బంగారు పూతలతో, అత్యాధునిక ఇంటీరియర్స్‌తో రీ-డిజైన్ చేశారు. కిమ్ కుటుంబానికి 4 భారీ లగ్జరీ పడవలు ఉన్నాయి. అందులో అతిపెద్దది 80 మీటర్ల పొడవుండే యార్ట్. దీని విలువ రూ. 800 కోట్లకు పైగా ఉంటుంది.
స్విట్జర్లాండ్‌లోని లె రోసీస్కూల్లో చదువుకున్నప్పటి నుంచి కిమ్‌కు స్విస్ వాచీలంటే చాలా ఇష్టం. ఆయన కలెక్షన్లో సుమారు రూ.65 కోట్లు విలువైన పాటెక్ ఫిలిప్, రోలెక్స్, ఒమేగా బ్రాండ్ వాచీలు ఉన్నాయి. ఉత్తర కొరియా బడ్జెట్లో గణనీయమైన మొత్తాన్ని తెల్లటి పందెం గుర్రాల పెంపకానికి ఉపయోగిస్తారు. కిమ్ ఈ తెల్లటి గుర్రాలపై స్వారీ చేస్తూ.. ఫొటోలకు పోజులిస్తూ మురిసిపోతూ ఉంటాడు.
Also Read: అప్పట్లో సామాన్యులను లక్షాధిపతులను చేసిన ధీరుభాయ్.. ‘జియో’ IPOతో అది సాధ్యమేనా?