Revanth Reddy: కర్ణాటక సంస్కృతికి, ప్రతిష్టాత్మక వారసత్వానికి ప్రతీకగా నిలిచే మైసూరు దసరా సంబరాలు ఈసారి మరింత వేడుకగా సాగాయి. కర్నాటక ‘నాడ హబ్బ’ (రాష్ట్ర పండుగ)గా పిలుచుకునే ఈ ఉత్సవాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రత్యేక ఆహ్వానం మేరకు ఆయన ఈ వేడుకలకు హాజరయ్యారు.
అమ్మవారి దర్శనం, ప్రత్యేక పూజలు
మైసూరు పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి ముందుగా మైసూరు ప్రజల ఆరాధ్య దైవమైన చాముండేశ్వరి దేవి ఆలయాన్ని సందర్శించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు అందుకున్నారు. ఆ తర్వాత రాజభవనం వద్ద జరిగిన ప్రధాన వేడుకలకు చేరుకున్నారు. కేరళ ప్రతిపక్ష నేత వీడీ సతీశన్‌తో పాటు దేశ, విదేశాల నుంచి వచ్చిన పలువురు ప్రముఖులతో కలిసి ఆయన ఈ వేడుకలను తిలకించారు.
జంబూ సవారి – మహోజ్వల ఘట్టం
మైసూరు దసరాలోనే అత్యంత కీలకమైనది ‘జంబూ సవారి’. అందంగా అలంకరించిన ఏనుగుపై, కన్నులపండువగా ఉన్న బంగారు అంబారీలో కొలువుదీరిన చాముండేశ్వరి అమ్మవారి ఉత్సవమూర్తిని ముఖ్యమంత్రి దర్శించుకుని నమస్కరించుకున్నారు. బంగారు అంబారీ ఊరేగింపు సాగుతున్నంత సేపు భక్తిభావంతో నమస్కరిస్తూ ఉత్సవాన్ని తిలకించారు.
కళలు, సంస్కృతుల నిలయం
ఈ ఉత్సవ ఊరేగింపులో కన్నడ నాటి ప్రాచీన సంస్కృతి స్పష్టంగా కనిపించింది. జానపద కళాకారుల విన్యాసాలు, సంగీత, నృత్య బృందాల ప్రదర్శనలు వేడుకలకు అదనపు శోభను తెచ్చాయి. భారతీయ సాంస్కృతిక వైభవానికి, ప్రాచీన వారసత్వానికి అద్దంపట్టేలా సాగిన ఈ సంబరాలు సందర్శకులకు సరికొత్త అనుభూతిని అందించాయి.
Also Read: చంద్రబాబు పాలనపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు.. రాజీనామా చేయాలంటూ ధర్మాన డిమాండ్