గర్భనిరోధక మాత్రలు ఇంతవరకు మహిళలకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. పురుషుల గర్భనిరోధక పద్ధతులు.. కండోమ్‌లు వాడకం, స్టెరిలైజేషన్ వంటి పద్ధతుల్లో లభిస్తున్నాయి. పురుషులకు కూడా మహిళల్లాగే గర్భనిరోధక మాత్రలు తయారు చేయాలని శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. ఈ మాత్ర పురుషుల్లో ఏర్పడే ప్రక్రియను ఆపివేస్తుంది. ఈ మాత్ర పైనే ఇప్పుడు ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. దీనిలో మొదటి దశ విజయవంతమైనట్టు వైద్యులు చెబుతున్నారు.
ఇదే ఆ మాత్ర
ఈ గర్భనిరోధకమాత్రకు YCT 529 అనే పేరును ప్రస్తుతానికి పెట్టారు. ఈ మాత్ర ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి కొన్ని ప్రయోగాలు చేశారు. ఈ మాత్ర వేసుకోవడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కలుగుతాయి? ఎంతటి ప్రభావం చూపిస్తుంది? అనేది శాస్త్రవేత్తలు పరిశోధిస్తున్నారు.
పురుషులకు గర్భనిరోధక పద్ధతులు కేవలం రెండు రకాలుగా మాత్రమే ఉన్నాయి. అందులో మొదటిది కండోమ్ వాడకం, రెండవది వేసెక్టమీ అంటే స్టెరిలైజేషన్ అని కూడా చెప్పుకుంటారు. కండోమ్‌లను ప్రతిసారి ఉపయోగించాల్సి వస్తుంది. అదే వేసెక్టమీ అయితే ఇది శాశ్వతమైన పద్ధతి. దీన్ని మళ్ళీ మార్చడం చాలా కష్టం.
గర్భనిరోధకమాత్ర ఎలా పనిచేస్తుంది?
మహిళలకు తయారుచేసిన గర్భనిరోధక మాత్రలలో హార్మోన్లు ఉంటాయి. ఇవి వేసుకోవడం వల్ల వారి మానసిక స్థితిలో మార్పులు రావడం, బరువు పెరగడం లాంటి సమస్యలు కనిపించాయి. అయితే పురుషులకు తయారుచేసే ఈ కొత్త టాబ్లెట్లతో మాత్రం అలాంటి సమస్యలు రాకుండా చూస్తున్నారు. YCT 529 ట్యాబ్లెట్ ను పురుషులు వేసుకుంటే వారిలో స్పెర్మ్ ఉత్పత్తి ప్రక్రియ తాత్కాలికంగా ఆగిపోతుంది. ఆ తర్వాత నాలుగు నుంచి ఆరు వారాల లోపు తిరిగి ప్రారంభమవుతుంది. ఈ పరీక్షా ఫలితాలు కమ్యూనికేషన్ మెడిసన్ జర్నల్లో ప్రచురించారు. ఈ ఔషధాన్ని మిన్నేసోటా విశ్వవిద్యాలయం, కొలంబియా యూనివర్సిటీ వారు సంయుక్తంగా తయారుచేసినట్టు చెబుతున్నారు.
ఈ మాత్రను ప్రయోగించేందుకు కొంతమంది మగవారిని ఎంపిక చేసుకున్నారు. వారిలో కొంతమందికి 90mg, మరికొంతమందికి 180mg ఇలా మోతాదులు ఇచ్చారు. కొంతమందికి ఆహారాన్ని తిన్న తర్వాత ఈ ట్యాబ్లెట్ ఇస్తే మరి కొంత మందికి మాత్రం ఆహారం తినకముందు ఇచ్చారు. ఈ రెండు పద్ధతుల్లో ఎలా ప్రభావంతంగా పనిచేస్తున్నాయో పరిశీలించారు. రెండు మోతాదుల్లో కూడా మాత్ర శరీరానికి మంచి పరిమాణంలోనే చేరింది. అయితే 180mg ఒక వ్యక్తికి ఉత్తమమైనదిగా గుర్తించారు. పరిశోధకులు ఇక తర్వాతి పరీక్షలలో ఈ మాత్రను రోజులో ఎన్ని సార్లు తీసుకోవాలి అన్నది పరీక్షిస్తారు.
ఈ మాత్ర మార్కెట్లోకి వస్తే పురుషులు అధికంగా వినియోగించే అవకాశం ఉంది. కండోమ్ లు వాడే పద్ధతి ఎంతోమందికి అసౌకర్యంగా ఉంటాయి. అదే ఈ మాత్రను వేసుకుంటే గర్భం రాకుండా ఉంటుంది. అయితే లైంగిక సమస్యలు వ్యాప్తి చెందకుండా ఉండాలంటే మాత్రం కండోమ్‌లను ధరించడమే ఉత్తమ పద్ధతి.