Fever: వర్షాకాలంలో అయినా, శీతాకాలంలో అయినా వైరల్ ఫీవర్స్ రావడం సర్వసాధారణం. అయితే ఈ వైరల్ ఫీవర్స్ అనేది ఒక్కోసారి చాలా ఇబ్బంది పెడుతుంటాయి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు వానాకాలంలో దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. అయితే, జ్వరం వచ్చిన ప్రతిసారీ అందరూ చెప్పే మాటేంటంటే.. జ్వరం తగ్గే వరకు స్నానం చేయకూడదని సలహా ఇస్తుంటారు. స్నానం చేయడం వల్ల జ్వరం తీవ్రత ఇంకా పెరుగుతుందని భయపెడుతుంటారు. అయితే, ఇది ఎంతవరకు నిజమనేది ఇప్పుడు తెలుసుకుందాం.
వైరల్ ఫీవర్స్ వచ్చినప్పుడు శరీరంలో అనేక నొప్పులు ఇబ్బంది పెడుతుంటాయి. ఆ సమయంలో స్నానం చేయొద్దని చెప్పే ఈ పాత నమ్మకం కేవలం అపోహ మాత్రమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మొత్తానికే స్నానం చేయకుండా ఉండటం కంటే.. జ్వరం ఉన్నప్పుడు ఏ రకమైన స్నానం మేలు చేస్తుంది? ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ముందుగా తెలుసుకోవాలంటున్నారు వైద్యులు.
జ్వరం వచ్చినప్పుడు శరీరం ఉష్ణోగ్రత పెరుగుతుంది, అసౌకర్యంగా ఉంటుంది. అలాంటప్పుడు స్నానం చేయడం అనేది కేవలం పరిశుభ్రత కోసం కాదు.. శరీరాన్ని ఉత్తేజపరచానికి కూడా సహాయపడుతుంది. జ్వరం ఉన్నప్పుడు స్నానం చేయకూడదు అనేది ఒక అపోహ మాత్రమే అంటున్నారు ఆరోగ్య నిపుణఉలు. ఫీవర్ ఉన్నప్పుడు స్నానం చేయడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత సమతుల్యత చెందుతుందే తప్పా ఎలాంటి నష్టం వాటిల్లదు అని చెబుతున్నారు.
జ్వరంతో ఇబ్బంది పడుతన్నప్పుడు గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల ఆరోగ్యానికి మంచిదే అంటున్నారు వైద్య నిపుణులు. ఆ సమయంలో స్నానం చేయడం వల్ల జ్వరం కారణంగా వచ్చే అలసట, ఒళ్లు నొప్పులు, చిరాకు తగ్గిపోతాయి. అంతేకాదు.. పరిశుభ్రత వల్ల మానసికంగా కూడా రిఫ్రెష్‌గా అనిపిస్తుంది. అయితే, చల్లని నీటితో స్నానం చేయకపోవడమే ఉత్తమం. ఎందుకంటే, చల్లని నీటి ద్వారా శరీరంలో చలి మొదలవుతుంది. దీంతో జ్వరం మరింత పెరిగే అవకాశం ఉంటుంది.
ఫీవర్ వచ్చినప్పుడు ఎక్కువ సమయం నీటిలో ఉండకపోవడం మంచిది. 5 నుంచి 10 నిమిషాల్లో స్నానం ముగించాలి. అంతేకాకుండా పొడి తవల్‌తో శరీరాన్ని శుభ్రంగా తుడుచుకుని.. వెచ్చని దుస్తులు ధరించాలి. ఒకవేళ జ్వరం మరీ ఎక్కువగా ఉంటే.. గోరువెచ్చని నీటిలో కాటన్ టవల్‌ను తడిపి, శరీరాన్ని తుడిస్తే సరిపోతుంది.
చాలామంది ఇచ్చే సలహా.. జ్వరం వచ్చినప్పుడు స్నానం చేయకూడదు అని. అయితే, ఈ నమ్మకం కేవలం అశాస్త్రీయమైనది. ఎందుకంటే.. అసౌకర్యంగా అనిపించినప్పుడు, భయం లేకుండా గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల శారీరక, మానసిక ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి ఈ స్నానం పరోక్షంగా సహాయపడుతుంది.