Loneliness: ఈ లోకంలోకి మనిషి ఒంటరిగానే వస్తాడు, ఒంటరిగానే వెళ్తాడు అనేది పాత నానుడి. నిజానికి అది పూర్తిగా నిజం కాదేమో! ఎందుకంటే.. అమ్మ గర్భంలోని బిడ్డకు ఇంద్రియాలు ఏర్పడగానే బయటి శబ్దాలకు ఆ శిశువు స్పందిస్తుంది. ఆ అపురూపమైన జీవిని ఈ కొత్త ప్రపంచంలోకి ఆహ్వానించేందుకు ఇక్కడ తల్లిదండ్రులు, ఇంటి పెద్దలు, వైద్యులు.. ఎంతో ఆశతో ఎదురుచూస్తుంటారు. మొత్తానికి ఆ బిడ్డ బయటికి రాగానే, తన తల్లి పొత్తిళ్లలో ఒదిగి పోతుంది. చివరికి మనిషి పోయాక కూడా ఆ దేహానికి నలుగురి చేతులమీదుగా సగౌరవ వీడ్కోలు అందుతుంది. కాబట్టి.. ప్రాణం ఉన్నంతసేపూ ఏ మనిషి ఒంటరి కాడు. కొంతమంది వారి మానసిక పరిస్థితి వల్లనో, వేరే వ్యక్తులతో కలవపోవడం వల్లోనో ఒంటరితనం అనే చీకట్లో కూరుకుపోతుంటారు. ఒంటరి అనే భావనకు కారణాలు, దాని బయటపడే మార్గాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఎవరైనా ఒంటరితనంతో బాధపడుతున్నారంటే.. ఆ మనిషి సహజ పద్ధతులవల్ల కావచ్చు, బుద్ధికౌశల్యం లోపించడం వల్ల కావచ్చు, పేదరికం వల్ల అయితేనేమీ, ఏదైనా తప్పు చేయడం వల్ల గానీ లేదా వైఫల్యాల వల్ల గానీ ఒంటరితనం అలవడుతుంది. ఇంకొన్నిసార్లు ఆకర్షణీయంగా లేవనే భావన, అంగవైకల్యాలు ఒంటరి తనాన్ని ఇంకా పెంచుతాయి.
కొన్నిసార్లు మనిషి అస్వస్థతవల్ల కూడా ఒంటరితనం ఏర్పడవచ్చు.. అయితే, తమలోని ఒంటరితనపు భావనే తమ అస్వస్థతకు అసలైన కారణమని చాలామంది గ్రహించలేరు. ఒక్కోసారి మనం నివాసం ఉంటున్న పరిసరాలు కూడా మనల్ని ఒంటరితనంలోకి నెట్టివేస్తాయి. అంతేకాకుండా.. ఆందోళనలు, నైతిక విలువలు లోపించిన కుటుంబ సభ్యుల ప్రవర్తన, ప్రేమ రాహిత్యం, గుర్తింపులేని గానుగెద్దు జీవితం ఇవన్నీ మానసికంగా మనిషిని కృంగదీయడం వల్ల ఆ మనిషి ఒంటరిగా మారవచ్చు.
ఒంటరితనం అనే చీకటిలో నలిగిపోతున్న మనిషి కారణాలేమైనా కానివ్వండి.. దానివల్ల ఏర్పడే గాయాలు మాత్రం చాలా బాధాకరమైనవిగా ఉంటాయి.
ఒంటరి తనమనేది పూర్తిగా మానసికమైనది. కాబట్టి, అన్నిటి కన్నా ముందు మానసికంగా ఒంటరితనాన్నిఎదుర్కోడానికి సన్నద్ధులు కావాలి.
* నలుగురితో కలిసి పోవడం వల్ల ఒంటరితనాన్ని జయించవచ్చని నిపుణులు చెబుతున్నారు. చిత్రలేఖనం, సంగీతం, నృత్యం వంటి లలిత కళలపై ఆసక్తి ఉంటే.. వెంటనే సమీపంలోని శిక్షణా కేంద్రాల్లో చేరవచ్చు. అక్కడ మీలాంటి ఆసక్తులు ఉన్న కొత్త మిత్రులు పరిచయమవుతారు. కొత్తవారితో కలిసి నేర్చుకునే క్రమంలో ఒంటరి అనే భావనే దూరం అవుతుంది.
* అప్పుడప్పుడు విహారయాత్రలు కూడా ప్లాన్ చేస్తుండాలి. ఒంటరిగా వెళ్లలేకపోతే.. అనేక టూరిజం ఏజెన్సీలు గ్రూప్ ప్యాకేజీలను అందిస్తున్నాయి. తోటి యాత్రికులతో కలిసి కొత్త ప్రదేశాలకు వెళ్తే.. కొత్త పరిచయాలు పెరిగి, క్రమంగా ఒంటరితనం దూరమవుతుంది.
* ఇంట్లో ఒంటరిగా అనిపిస్తే.. దగ్గర్లోని జిమ్‌లో జాయిన్ అవ్వండి. అక్కడ మీలాగే ఆరోగ్య స్పృహ ఉన్నవారితో కలిసి వ్యాయామం చేస్తే.. మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది. లేదా టెన్నిస్, బ్యాడ్మింటన్, స్విమ్మింగ్ వంటి క్రీడల కోసం స్పోర్ట్స్ అకాడమీల్లో చేరిపోవచ్చు.
* మీరు మానసికంగా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉంటే మాత్రం.. మానసిక నిపుణులను సంప్రదించడం ఉత్తమం. వాళ్లు మీలాంటి సమస్యలతో బాధపడుతున్నవారితో కలిపి గ్రూప్ కౌన్సెలింగ్ ఏర్పాటు చేస్తారు. ఇక్కడ ఒకరి సమస్యలు మరొకరు పంచుకోవడం వల్ల మానసికంగా స్ట్రాంగ్ అవుతారు.
* మీకు సమాజ సేవ చేయాలనే ఆలోచన ఉంటే, స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేయొచ్చు. ఎందుకంటే, సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా పది మందితో కలిసి పనిచేస్తున్నామన్న భావనతో పాటు, సమాజానికి ఏదో చేస్తున్నామనే సంతృప్తి కూడా కలుగుతుంది.