Mandya Mutton Greens Recipe: సండే వచ్చిందంటే చాలు.. చాలామంది ఇళ్లలో ముక్క లేనిదే ముద్ద దిగదు. ఈ క్రమంలో ప్రతిసారీ రెగ్యులర్ మటన్ కర్రీ, బొక్కల పులుసు తిని బోర్ కొట్టింది అనుకుంటే.. ఈసారి కర్ణాటకలోని మాండ్యా స్టైల్ మటన్ గ్రీన్స్ ట్రై చేయాల్సిందే. మాండ్యా అనగానే మనకు అక్కడ వండే నాటుకోడి, మటన్ వంటకాలే గుర్తుకొస్తాయి. అక్కడ చేసే వంటల్లో ఉపయోగించే ఫ్రెష్ పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీరల ఘాటు ఈ మటన్ గ్రీన్స్‌కు ఒక ప్రత్యేకమైన రుచిని, మంచి రంగును ఇస్తుంది.
ఒక్కసారి ఈ గ్రీన్ మటన్ గ్రేవీని వేడివేడి అన్నంలోనో లేదా రాగి సంగటితో తింటే ఆ రుచి జన్మలో మర్చిపోలేరు. ముఖ్యంగా ఇంట్లో విందులు ఉన్నప్పుడు లేదా వీకెండ్స్‌లో స్పెషల్‌గా ఏదైనా వండాలనుకున్నప్పుడు ఇది సరైన ఛాయిస్. మరెందుకు ఆలస్యం.. ఈ నోరూరించే మటన్ గ్రీన్స్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం రండి..
మటన్ – అర కిలో
పచ్చిమిర్చి – ఎనిమిది
కొత్తిమీర – ఒక పెద్ద కట్ట
పుదీనా – ఒక చిన్న కట్ట
ఉల్లిపాయలు – రెండు
టమోటాలు – రెండు
అల్లం వెల్లుల్లి పేస్ట్ – రెండు స్పూన్లు
Also Read: అరకు ఫేమస్ బొంగు చికెన్.. తింటే జీవితంలో ఆ రుచిని మర్చిపోరు, ఎలా చేయాలో తెలుసా?
పసుపు – అర స్పూను
ధనియాల పొడి – ఒక స్పూను
గరం మసాలా – ఒక స్పూను
చెక్క – చిన్న ముక్క
లవంగాలు – నాలుగు
యాలకులు – రెండు
నూనె – నాలుగు స్పూన్లు
ఉప్పు – రుచికి సరిపడా
నిమ్మరసం – ఒక స్పూను
మటన్‌ను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్లో కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్‌లా రుబ్బుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద కుక్కర్ పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత చెక్క, లవంగాలు, యాలకులు వేసి వేగించాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు రంగు మారిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలా బాగా వేపాలి.
ఇప్పుడు అందులో టమోటా ముక్కలు, పసుపు, సరిపడా ఉప్పు వేసి టమోటాలు మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. ఆ తర్వాత కడిగి పెట్టుకున్న మటన్ ముక్కలను వేసి బాగా కలపాలి. మటన్ లోని నీరు ఇంకిపోయే వరకు 5 నిమిషాలు వేయించాలి. ఇప్పుడు ధనియాల పొడి, గరం మసాలా వేసి మసాలాలు ముక్కలకు పట్టేలా తిప్పాలి.
తర్వాత మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా పేస్ట్‌ను మటన్‌లో వేసి బాగా కలపాలి. గ్రేవీకి సరిపడా నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి 5 – 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. విజిల్స్ వచ్చి ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసి కూరను ఒకసారి కలపాలి. గ్రేవీ దగ్గరకు పడేంత వరకు కాసేపు చిన్న మంటపై ఉంచాలి. చివరగా నిమ్మరసం పిండుకుని దించేస్తే ఎంతో రుచికరమైన మాండ్యా మటన్ గ్రీన్స్ రెడీ. దీనిని వేడివేడి అన్నం, రోటీ లేదా రాగిముద్దతో వడ్డిస్తే కడుపు నిండా ఆస్వాదించవచ్చు.
Also Read: ఈ నవరాత్రులకు 3 స్పెషల్ డిషెస్.. ప్రసాదంగానూ పెట్టొచ్చు, రుచికి తిరుగే ఉండదు!