Korean Zombie Thriller: ఓ భారీ భవనంలో జరుగుతున్న కార్యక్రమం… కాసేపటికే ప్రాణాంతక వైరస్ వ్యాప్తితో నరకంగా మారుతుంది. వైరస్ సోకిన మనుషులు భయంకరమైన జీవులుగా మారుతుంటే, బయటకు వెళ్లే మార్గాలన్నీ మూసుకుపోతాయి. లోపల చిక్కుకున్న వారికి ఎవరిని నమ్మాలో, ఎక్కడికి వెళ్లాలో కూడా అర్థం కాని పరిస్థితి ఎదురవుతుంది. కళ్లముందే ప్రాణాలు పోతుంటే, ఈ వైరస్ బారి నుంచి బయటపడటం సాధ్యమేనా ? ఇలాంటి ఉత్కంఠభరితమైన కథాంశంతో తెరకెక్కిన కొరియన్ థ్రిల్లర్ ‘కాలనీ’ (Colony). మరి ఈ సినిమాను ఓటీటీలో ఎక్కడ చూడాలంటే?
సియోల్లోని ఓ భారీ మాల్ లో బయోటెక్నాలజీకి సంబంధించిన కార్యక్రమం జరుగుతుంటుంది. అంతా ప్రశాంతంగా సాగుతున్న సమయంలో అనూహ్యంగా ఓ ప్రమాదకరమైన వైరస్ వ్యాపిస్తుంది. పరిస్థితి తీవ్రతను గుర్తించిన అధికారులు భవనాన్ని మూసివేయడంతో లోపల ఉన్న వారికి బయటపడే మార్గం లేకుండా పోతుంది. కొద్దిసేపటి క్రితం వరకు సాధారణంగా సాగిన జీవితం ఒక్కసారిగా ప్రాణాల కోసం జరిగే పోరాటంగా మారుతుంది.
వైరస్ సోకిన వారిలో వేగంగా మార్పులు చోటు చేసుకుంటాయి. వారు భయంకరమైన జీవులుగా రూపాంతరం చెంది, ఇతరులపై దాడి చేయడం మొదలుపెడతారు. దీంతో భవనంలోని ప్రతి ప్రాంతం ప్రమాదకరంగా మారుతుంది. ఎక్కడి నుంచి ముప్పు ఎదురవుతుందో తెలియని పరిస్థితిలో, అక్కడ చిక్కుకున్నవారు సురక్షితమైన ప్రదేశం కోసం వెతుకుతారు. ఈ సంక్షోభంలో కొందరు వైరస్ స్వభావాన్ని అర్థం చేసుకుని దాని వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తారు.
మరికొందరు ఎలాగైనా భవనం నుంచి బయటపడాలని చూస్తారు. అయితే వైరస్ ప్రభావం వేగంగా పెరుగుతుండటంతో ప్రతి ప్రయత్నం కొత్త ప్రమాదానికి దారి తీస్తుంది. కలిసి పోరాడితేనే ప్రాణాలతో బయటపడే అవకాశం ఉన్నా, భయం కారణంగా ఒకరిపై మరొకరికి నమ్మకం తగ్గిపోతుంది. అలాగే బయోటెక్నాలజీకి సంబంధించిన సెమినార్ లో పాల్గొన్న ఒక ప్రొఫెసర్ కూడా ఆ భవనంలో చిక్కుకుపోతుంది. అసలు ఈ వైరస్ ఎక్కడి నుంచి వచ్చింది? దాని ప్రభావం ఇంత వేగంగా ఎందుకు పెరుగుతోంది ? ఈ భవనంలో చిక్కుకున్న వారిలో ఎంతమంది ప్రాణాలతో బయటపడతారు ? అనే ప్రశ్నల చుట్టూ కథ ఉత్కంఠభరితంగా సాగుతుంది.
‘కాలనీ’ సినిమా జియో హాట్స్టార్ (Jio Hotstar)లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ అందుబాటులో ఉండడం గుడ్ న్యూస్. ఈ చిత్రంలో జియానా జున్ (Gianna Jun), కూ క్యో-హ్వాన్ (Koo Kyo-hwan), జీ చాంగ్-వూక్ (Ji Chang-wook), షిన్ హ్యున్-బిన్ (Shin Hyun-been), గో సూ (Go Soo) నటించారు. యోన్ సాంగ్-హో (Yeon Sang-ho) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వైరస్ భయం, భయంకరమైన రూపాంతరాలు, మనుగడ కోసం జరిగే పోరాటం ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయి. కొరియన్ జాంబీ సినిమాలు ఇష్టపడే వారు ఈ సినిమాను తమ వాచ్లిస్ట్లో చేర్చుకోవచ్చు.
Read Also: అత్తింట్లోనే దెయ్యాల వేట… ఒక్కొక్కరినీ రాక్షసులుగా మార్చే దుష్టశక్తి… తెలుగులోనూ హారర్ మూవీ