High IQ Kid| సాధారణంగా 5 ఏళ్ల వయసు పిల్లలు ఆటలు, బొమ్మలు, కథలతో సమయం గడుపుతుంటారు. కానీ భారతీయ మూలాలున్న అర్జున్ ప్రజాపతి మాత్రం చిన్న వయసులోనే ఈ విశ్వం, అంతరిక్షం, బ్లాక్ హోల్స్, మానవ శరీరం, జన్యుశాస్త్రం వంటి అంశాలపై ఆసక్తి చూపిస్తున్నాడు. ఇప్పటివరకు 3,000కు పైగా పుస్తకాలను చదివేశాడు. నాలుగేళ్ల వయసులోనే రెండు అంతర్జాతీయ హై ఐక్యూ సంస్థల్లో సభ్యత్వం పొందాడు. అతడి ఐక్యూ స్కోర్ 141గా నమోదైంది. అయితే, అర్జున్ తల్లిదండ్రులు అతడి తెలివితేటల కంటే ఆసక్తి, ఆనందం, స్వేచ్ఛతో నేర్చుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు.
అర్జున్‌కు సుమారు 18 నెలల వయసు నుంచే పుస్తకాలు చదవడంపై ఆసక్తి మొదలైంది. గణితం, ఖగోళశాస్త్రం, మానవ శరీర నిర్మాణం, జన్యుశాస్త్రం, సూక్ష్మజీవశాస్త్రం, చరిత్ర వంటి విషయాలను తెలుసుకోవడానికి ఇష్టపడతాడు. అతడి తండ్రి డాక్టర్ విశాల్ వి. ప్రజాపతి వైద్యుడు, క్లినికల్ పరిశోధకుడు. తల్లి మహిత న్యాయవాదిగా పనిచేస్తున్నారు. అర్జున్‌కు ఎప్పుడు చదవాలనిపించినా పుస్తకం అందుబాటులో ఉండేలా తల్లిదండ్రులు తమ కారులో 8 నుంచి 10 పుస్తకాలు ఉంచుతారు.
నాలుగేళ్ల పది నెలల వయసులో అర్జున్‌కు స్టాన్‌ఫోర్డ్ – బినెట్ ఇంటెలిజెన్స్ పరీక్ష నిర్వహించారు. అందులో అతడి పూర్తి స్థాయి ఐక్యూ స్కోర్ 141గా నమోదైంది. నాన్‌వెర్బల్ ఐక్యూ స్కోర్ 149గా, ఫ్లూయిడ్ రీజనింగ్ స్కోర్ 144గా నమోదయ్యాయి. వర్కింగ్ మెమరీ స్కోర్ 146గా ఉంది. ఈ ఫలితాల ఆధారంగా అతడికి మెన్సా, ఇంటర్‌టెల్ అనే అంతర్జాతీయ హై – ఐక్యూ సంస్థల్లో సభ్యత్వం లభించింది. కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ, అంటారియో ప్రీమియర్ డగ్ ఫోర్డ్ నుంచి కూడా అభినందనలు అందాయి.
అర్జున్‌కు మానవ శరీరం, రోగనిరోధక వ్యవస్థ, అంతరిక్షం గురించి తెలుసుకోవడం చాలా ఇష్టం. తెల్ల రక్తకణాలు వైరస్‌లు, క్రిములతో పోరాడతాయని కూడా అతడు నేర్చుకున్నాడు. ఒకసారి ఆడుకుంటూ పడిపోయి మోచేతికి గాయం చేసుకున్నప్పుడు, ఎముకకు దెబ్బ తగిలిందేమోనని అనుమానించాడు. ఎక్స్‌రే తీయించుకోవచ్చా అని వైద్యుడిని అడిగాడు. పరీక్షలో ఎలాంటి ఎముక విరుగ లేదని తేలింది.
Also Read: ఏదైనా ఇట్టే పసిగట్టేస్తారు.. ఈ తేదీల్లో పుట్టినవారు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారు
అర్జున్ తల్లిదండ్రులు అతడి చదువుకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. అతడి ఆసక్తులకు అనుగుణంగా నేర్చుకునే అవకాశాలు కల్పిస్తారు. గణితం, సంగీతం, పెయింటింగ్, ఫ్రెంచ్, స్పానిష్ భాషలపై కూడా ఆసక్తి చూపిస్తున్నాడు. తెలివితేటలతో పాటు దయ, ధైర్యం, ఇతరుల పట్ల కరుణ కూడా ముఖ్యమని తల్లిదండ్రులు నేర్పుతున్నారు. భవిష్యత్తులో ఏ రంగాన్ని ఎంచుకున్నా అతడి నిర్ణయాన్ని గౌరవిస్తామని తెలిపారు.
Also Read: ఏడాదికి రూ. కోటి వరకు జీతం కావాలా? వెంటనే ఈ కెరీర్ ఎంచుకోండి
అర్జున్ లాంటి తెలివితేటల గల పిల్లలు.. తల్లిదండ్రుల సరైన పెంపకానికి ఉదాహరణ. పిల్లలపై మార్కులు, విజయాల కోసం ఒత్తిడి చేయకుండా, వారి సహజ ఆసక్తులను ప్రోత్సహించాలి. నేర్చుకోవడాన్ని ఆనందంగా మార్చినప్పుడే పిల్లలు తమ సామర్థ్యాలను స్వేచ్ఛగా అభివృద్ధి చేసుకోగలరు.