Microplastics: ఒక్కసారి ఊహించండి.. మనం తాగే నీళ్లలోనే కాదు, మన శరీరంలో ప్రవహించే రక్తంలో కూడా ప్లాస్టిక్ ముక్కలు ఉంటే? వినడానికే భయంగా ఉంది కదూ! ఉదయం తాగే వాటర్ బాటిల్ నుంచి, మనం తినే ఆహారాన్ని చుట్టే ప్యాకేజింగ్ వరకు.. ఇలా మనకు తెలియకుండానే కంటికి కనిపించని మైక్రోప్లాస్టిక్స్ మన శరీరంలోకి చేరుతున్నాయి. అయితే, ఇవి రక్తంలోకి ప్రవేశించిన తర్వాత ఏం జరుగుతుంది?
మన శరీర కణాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? గుండె, మెదడు వంటి కీలక అవయవాల ఆరోగ్యానికి ఇవి ముప్పుగా మారుతున్నాయా? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్న శాస్త్రవేత్తలకు తాజాగా కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అసలు ఈ మైక్రోప్లాస్టిక్స్ వెనుక ఉన్న ప్రమాదమేంటి? సైన్స్ ఏం చెబుతోంది? ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ఇన్నాళ్లూ ప్లాస్టిక్ ముక్కలు శరీరంలోకి వెళ్లినా సైలెంట్గా ఉంటాయని, పెద్దగా రసాయనిక చర్యలు జరపవని అనుకునేవారు. కానీ కొలంబియా, కాలిఫోర్నియా యూనివర్సిటీల పరిశోధకులు ఇది తప్పని తేల్చారు. ప్లాస్టిక్ కణాలు నీటిని తాకినప్పుడు ఒక విచిత్రమైన మార్పు జరుగుతుంది. ఈ రెండింటి కలయిక వల్ల ఉచితంగా తిరిగే కొన్ని శక్తివంతమైన అణువులు లేదా రాడికల్స్ తయారవుతాయి. ఇవి పక్కనే ఉన్న కణాలపై ప్రభావం చూపిస్తాయి.
Also Read: యూట్యూబ్లో ఏఐ పాటలకు ప్రత్యేక లేబుల్స్.. అసలు ఇవి ఎలా పనిచేస్తాయంటే?
ప్లాస్టిక్ ఎంత చిన్నగా విరిగిపోతే అంత ఎక్కువ ఉపరితల వైశాల్యం పెరుగుతుంది. బాటిల్ నీళ్లలో లేదా మన రక్తంలో ఇవి ఉన్నప్పుడు, చుట్టూ ఉండే నీటిని మార్చేస్తాయి. దీనివల్ల ఎక్కువ సంఖ్యలో రియాక్టివ్ రాడికల్స్ ఉత్పత్తవుతాయి. మనం తాగే డ్రింక్స్, తినే ఆహారం ద్వారా ఇవి మన అవయవాలకు చేరుతున్నాయి. మెదడు, గుండె, కాలేయం, ఊపిరితిత్తులు ఇలా ప్రతీ చోటా ఈ ప్లాస్టిక్ అవశేషాలు ఉంటున్నట్లు సైంటిస్టులు ముందే గుర్తించారు.
ఈ రాడికల్స్ వల్ల శరీరంలోని కణజాలం దెబ్బతింటుంది. గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, డిమెన్షియా, బ్రెయిన్ ట్యూమర్లు రావడానికి ఈ మైక్రోప్లాస్టిక్సే ఒక ప్రధాన కారణమని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. బాటిల్ వాటర్ ద్వారా వేల సంఖ్యలో ఈ మైక్రో కణాలు మన పొట్టలోకి వెళ్తున్నాయి. శరీరంలో అధిక భాగం నీరే ఉంటుంది కాబట్టి.. రక్తంలోకి ఇవి చేరగానే వెంటనే ఈ ప్రమాదకర రసాయన చర్యలు మొదలైపోతున్నాయి.
ప్లాస్టిక్ వల్ల శరీరంలో ఎలా హాని జరుగుతుందో తెలిసింది కాబట్టి.. నష్టం కలిగించని రీతిలో ప్లాస్టిక్ను తిరిగి డిజైన్ చేసే అవకాశం ఉంటుందని సైంటిస్టులు భావిస్తున్నారు. ఈ లోగా మనం చేయగలిగిందల్లా బాటిల్ వాటర్, ప్లాస్టిక్ ప్యాక్డ్ ఫుడ్ వాడకం వీలైనంత తగ్గించడమే. మన ఆరోగ్యం కోసం ఈ చిన్న మార్పు తప్పనిసరి.
Also Read: ఈ నవరాత్రులకు 3 స్పెషల్ డిషెస్.. ప్రసాదంగానూ పెట్టొచ్చు, రుచికి తిరుగే ఉండదు!