Mouthwash Side Effects: ఉదయాన్నే బ్రష్ చేసుకున్న తర్వాత నోరు తాజాగా ఉండాలని చాలామంది మౌత్ వాష్ ఉపయోగిస్తుంటారు. అయితే, ఈ అలవాటు మన గుండె ఆరోగ్యానికి ముప్పు తెచ్చిపెడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. క్రమం తప్పకుండా మౌత్ వాష్ వాడటం వల్ల రక్తపోటు (బీపీ) పెరిగే ప్రమాదం ఉందని పలు పరిశోధనల్లో తేలింది. మనం మంచిదని భావించే ఈ అలవాటు మన శరీరంలో ఎలాంటి మార్పులు తెస్తుందో ఇప్పుడు చూద్దాం.
మన పొట్టలో లాగే నోటిలో కూడా శరీరానికి మేలు చేసే కోట్లాది సూక్ష్మజీవులు (గుడ్ బ్యాక్టీరియా) ఉంటాయి. మనం వాడే యాంటీ బ్యాక్టీరియల్ మౌత్ వాష్‌లు కేవలం చెడు బ్యాక్టీరియాను మాత్రమే కాకుండా.. ఈ మంచి బ్యాక్టీరియాను కూడా పూర్తిగా నాశనం చేస్తాయి. దీంతో నోటిలోని సహజ సమతుల్యత దెబ్బతింటుంది. ఇది వినడానికి సాధారణ విషయంగా అనిపించినా.. దీని వెనుక పెద్ద ఆరోగ్య రహస్యం దాగి ఉంది.
మన నోటిలో ఉండే కొన్ని ప్రత్యేక బ్యాక్టీరియాలు మనం తినే ఆహారం ద్వారా ‘నైట్రిక్ ఆక్సైడ్’ అనే రసాయనం ఉత్పత్తి కావడానికి సహాయపడతాయి. ఈ నైట్రిక్ ఆక్సైడ్ మన రక్తనాళాలు వెడల్పుగా అవ్వడానికి, రక్తం సజావుగా ప్రవహించడానికి దోహదం చేస్తుంది. ఎప్పుడైతే మౌత్ వాష్ వల్ల ఆ బ్యాక్టీరియా చనిపోతుందో.. అప్పుడు నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి తగ్గిపోయి రక్తనాళాలు కుంచించుకుపోతాయి. ఫలితంగా రక్తపోటు పెరుగుతుంది.
Also Read: ఇక పిల్లల Meta AI చాట్స్‌పై నిఘా.. ఆత్మహత్య ఆలోచనలు వస్తే పేరెంట్స్‌కు అర్జెంట్ నోటిఫికేషన్!
ఒక వారంలోనే మౌత్ వాష్ వల్ల బీపీ పెరగడాన్ని శాస్త్రవేత్తలు గమనించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. మౌత్ వాష్ వాడటం ఆపేసిన కేవలం మూడు రోజుల్లోనే బీపీ సాధారణ స్థితికి వచ్చింది. ఈ మార్పు మనం ఆహారంలో ఉప్పును పూర్తిగా తగ్గించినప్పుడు వచ్చే ఫలితంతో సమానం. రోజుకు రెండుసార్లు మౌత్ వాష్ వాడే వారిలో బీపీ పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు.
ప్రముఖ దంత వైద్యుల అభిప్రాయం ప్రకారం.. మన నోటిని శుభ్రం చేసుకోవడం అంటే దాన్ని పూర్తిగా స్టెరిలైజ్ చేయడం కాదు. తోటలో ఒక పిచ్చి మొక్క మొలిస్తే దాన్ని పీకేయాలి కానీ, మొత్తం తోటపై యాసిడ్ పోసి అన్ని మొక్కలనూ చంపేయకూడదు. ప్రస్తుతం మనం మౌత్ వాష్‌ల రూపంలో చేస్తున్నది సరిగ్గా ఇదే. తద్వారా మేలు చేసే బ్యాక్టీరియా పోయి, కేవలం ప్రమాదకరమైన మొండి క్రిములు మాత్రమే మిగిలిపోతాయి.
ప్రముఖ కార్డియాక్ సర్జన్లు తాము వ్యక్తిగతంగా దూరంగా ఉండే అలవాట్లలో మౌత్ వాష్‌ను కూడా చేర్చారు. ధూమపానం, మద్యం, కూల్ డ్రింక్స్ ఎంత ప్రమాదకరమో.. మౌత్ వాష్ కూడా అంతేనని వారు చెబుతున్నారు. ముఖ్యంగా ఇప్పటికే బీపీ సమస్య ఉన్నవారు దీనికి దూరంగా ఉండటం మంచిది. కాబట్టి.. కేవలం నోటి దుర్వాసన తగ్గుతుందనే భ్రమతో గుండె ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెట్టుకోవద్దు.
Also Read: టమాటా సైజును బట్టి ఆరోగ్య ప్రయోజనాలుంటాయా? నిపుణులు ఏమంటున్నారంటే..!