Homemade Floor Cleaner: ఇంటి ఫ్లోర్ ఎప్పుడూ మెరిసిపోవాలని అందరూ కోరుకుంటారు. వీటి కోసం రకరకాల ఫ్లోర్ క్లీనర్లను కూడా వాడుతుంటారు. కానీ మార్కెట్‌లో దొరికే ఘాటైన కెమికల్స్ వల్ల అలర్జీలు, స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన ‘వేప’తో ఇంట్లోనే ఫ్లోర్ క్లీనర్‌ని ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇది కేవలం నేలను క్లీన్ చేయడమే కాదు.. బ్యాక్టీరియా, క్రిములను కూడా తరిమికొడుతుంది. అసలు దీని తయారీ ప్రాసెస్ ఏంటో, ఎలా వాడాలో చూసేద్దాం రండి.
ప్రస్తుత కాలంలో మనం వాడే ప్రతి వస్తువులోనూ కెమికల్స్ ఉంటున్నాయి. ముఖ్యంగా.. ఫ్లోర్ క్లీనర్స్ లో ఉండే ఘాటైన ఆమ్లాలు చిన్న పిల్లలు,పెంపుడు జంతువులు ఉన్న ఇళ్లలో కొంచెం ప్రమాదకరమే. అందుకే.. మనకు ఎంతో అందుబాటులో ఉండే వేప ఆకులతో అత్యంత శక్తివంతమైన, సహజమైన ఫ్లోర్ క్లీనర్‌ను తయారు చేసుకుని వాడటం మంచిది.
కావాల్సిన పదార్థాలు :
వేప ఆకులు: రెండు పెద్ద కప్పులు
నీరు: సుమారు 2 లీటర్లు
కర్పూరం : 4-5
బేకింగ్ సోడా: 2 టేబుల్ స్పూన్లు
వెనిగర్ లేదా నిమ్మరసం: పావు కప్పు
తయారీ విధానం:
1. వేప కషాయం తయారు చేయడం:
ముందుగా వేప ఆకులను శుభ్రంగా కడిగి.. 2 లీటర్ల నీటిలో వేసి బాగా మరిగించాలి. నీరు సగానికి అయ్యే వరకు (అంటే ముదురు ఆకుపచ్చ రంగులోకి వచ్చే వరకు) మరిగించాలి. దీని వల్ల వేపలోని యాంటీ-బ్యాక్టీరియల్ గుణాలు నీటిలోకి చేరుతాయి.
2. మిశ్రమాన్ని చల్లార్చడం:
మరిగిన నీటిని వడకట్టి, ఆ కషాయాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి.
3. ఇతర పదార్థాలు కలపడం:
చల్లారిన వేప నీటిలో కర్పూరం పొడిని కలపండి. కర్పూరం కేవలం మంచి సువాసననే కాదు, దోమలు , ఈగలను కూడా దరిచేరనీయదు. ఆ తర్వాత బేకింగ్ సోడా, వెనిగర్ కలపండి. ఇవి నేలపై ఉండే మొండి మరకలను తొలగించడానికి సహాయపడతాయి.
4. నిల్వ చేయడం:
ఈ మిశ్రమాన్ని ఒక పాత ఫ్లోర్ క్లీనర్ బాటిల్‌లో లేదా స్ప్రే బాటిల్‌లో పోసి నిల్వ ఉంచుకోవచ్చు. ఇది సుమారు 15 నుండి 20 రోజుల వరకు తాజాగా ఉంటుంది.
ఎందుకు ఈ వేప క్లీనర్ వాడాలి?
1.కెమికల్ ఫ్రీ: ఇందులో ఎటువంటి హానికరమైన ఫాస్ఫేట్లు లేదా అమ్మోనియా ఉండవు.
2.క్రిమిసంహారిణి: వేప సహజంగానే వైరస్‌లు మరియు బ్యాక్టీరియాను చంపుతుంది.
3.ఖర్చు తక్కువ: మనకు పెరట్లోనే దొరికే వేప ఆకులతో అతి తక్కువ ఖర్చుతో దీన్ని తయారు చేసుకోవచ్చు.
4. సురక్షితం: ఇంట్లో పాకే పిల్లలు లేదా పెంపుడు జంతువులకు ఇది ఏమాత్రం హాని చేయదు.
Also Read: రోజంతా ఉత్సాహంగా ఉండాలా? అయితే మహిళలు ఈ మార్నింగ్ రొటీన్ ఫాలో అవ్వాల్సిందే!
వాడే విధానం:
మీరు సాధారణంగా నేలను తుడి చేటప్పుడు ఒక బకెట్ నీటిలో ఒక కప్పు ఈ వేప మిశ్రమాన్ని కలిపి వాడుకోవచ్చు. టైల్స్, మార్బుల్స్ లేదా గ్రానైట్ ఏ రకమైన ఫ్లోరింగ్ కైనా ఇది పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది.
ప్రకృతిని ప్రేమిస్తూ.. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇలాంటి చిన్న చిన్న మార్పులు చేయడం ఎంతో ముఖ్యం. మీరు కూడా ఈ వేప ఫ్లోర్ క్లీనర్ ని ట్రై చేసి, మీ ఇల్లు ఎంత తాజాగా ఉందో గమనించండి.