Roasted Guava Benefits: జామకాయను ముక్కలుగా కోసుకుని.. కాస్త ఉప్పు, కారం చల్లుకుని తినడం మనందరికీ అలవాటే. కానీ.. జామకాయను నిప్పులపై కాల్చి తింటే వచ్చే రుచే వేరు. పూర్వ కాలంలో.. మన పెద్దలు జామకాయను నిప్పుల మీద కాల్చి.. ఇచ్చేవారు. ఇది కేవలం నోటికి రుచిని ఇవ్వడమే కాదు. శరీరానికి కొండంత ఆరోగ్యాన్ని ఇస్తుందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా మారుతున్న వాతావరణంలో.. వచ్చే ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ పొందడానికి కాల్చిన జామకాయ ఒక అద్భుతమైన ఔషధంగా పని చేస్తుంది.
కాల్చిన జామకాయ ఆరోగ్య ప్రయోజనాలు :
జామకాయను ‘పేదల ఆపిల్’ అని పిలుస్తారు. ఇందులో విటమిన్ సి, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అయితే పచ్చి జామకాయ తింటే.. కొందరికి జలుబు చేస్తుంది. కానీ.. జామకాయను లైట్‌గా కాల్చి తింటే దాని గుణాలు మారి శరీరానికి అమితమైన మేలు జరుగుతుంది. పోషకాహార నిపుణుల నివేదికల ప్రకారం.. కాల్చిన జామకాయ వల్ల కలిగే 6 ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..
1. మొండి దగ్గు, జలుబుకు అద్భుత నివారణ:
చాలామంది చలికాలంలో లేదా వర్షాకాలంలో జామకాయ తింటే జలుబు చేస్తుందని భయపడతారు. కానీ జామకాయను నిప్పులపై లేదా గ్యాస్ స్టవ్ మీద నల్లటి మచ్చలు వచ్చే వరకు కాల్చి, దానికి కొద్దిగా మిరియాల పొడి, రాక్ సాల్ట్ చల్లి తింటే గొంతు నొప్పి, దగ్గు, కఫం వంటి సమస్యలు తక్షణమే తగ్గుతాయి. కాల్చడం వల్ల జామకాయలోని శీతలీకరణ గుణం తగ్గి, ఉష్ణ గుణం పెరుగుతుంది. ఇది ఊపిరితిత్తుల్లోని ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది.
2. రోగనిరోధక శక్తి రెట్టింపు అవుతుంది:
జామకాయలో ఆరెంజ్ కంటే నాలుగు రెట్లు ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. జామకాయను వేడి చేసినప్పుడు అందులోని పోషకాలు మరింత సులభంగా శరీరానికి అందుతాయి. ఇది వైట్ బ్లడ్ సెల్స్ ఉత్పత్తిని పెంచి, వైరల్ ఇన్ఫెక్షన్లు, సీజనల్ వ్యాధుల నుంచి మనల్ని కాపాడుతుంది.
3. జీర్ణక్రియ మెరుగుపడుతుంది:
కాల్చిన జామకాయ జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది. జామకాయను కాల్చడం వల్ల అందులోని డైటరీ ఫైబర్ (పీచు పదార్థం) మృదువుగా మారుతుంది. ఇది కడుపు ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది. తిన్న ఆహారం త్వరగా అరగడానికి, పేగుల కదలికలను సజావుగా ఉంచడానికి ఇది తోడ్పడుతుంది.
4. బ్లడ్ షుగర్ నియంత్రణ :
మధుమేహం ఉన్నవారికి జామకాయ ఒక సూపర్ ఫుడ్. దీని గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. జామకాయను కాల్చుకుని తినడం వల్ల శరీరంలో ఇన్సులిన్ నిరోధకత తగ్గుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా అదుపులో.. ఉంచుతుంది. అయితే డయాబెటిస్ ఉన్నవారు దీనిపై చక్కెర లేదా ఎక్కువ ఉప్పు చల్లకూడదు.
5. బరువు తగ్గడానికి సహాయపడుతుంది:
కాల్చిన జామకాయ తింటే కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. ఇందులో కేలరీలు తక్కువగా.. ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల పదే పదే ఆకలి వేయదు. ఇది మెటబాలిజాన్ని (జీవక్రియను) వేగవంతం చేసి, శరీరంలో పేరుకు పోయిన అనవసర కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది.
6. గుండె ఆరోగ్యానికి, కంటి చూపుకు మేలు:
కాల్చిన జామకాయలో పొటాషియం, సోడియం సమతుల్యంగా ఉంటాయి. ఇది రక్తపోటును నియంత్రణలో ఉంచి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే.. ఇందులో ఉండే విటమిన్ ఎ కంటి చూపును మెరుగుపరచడమే కాకుండా.. వయసు పెరగడం వల్ల వచ్చే కంటి సమస్యలను దూరం చేస్తుంది.
జామకాయను ఎలా కాల్చాలి ?
జామకాయను మరీ పండుగా కాకుండా.. కొంచెం దోరగా ఉన్నదాన్ని ఎంచుకోవాలి. దాన్ని శుభ్రంగా కడిగి.. నేరుగా నిప్పులపై లేదా పుల్కా స్టాండ్ ఉపయోగించి గ్యాస్ స్టవ్‌పై అన్ని వైపులా సమానంగా కాల్చాలి. పై తొక్క కొద్దిగా నల్లగా మారిన తర్వాత తీసి, ముక్కలుగా కోయాలి. దీనిపై కొద్దిగా నల్ల ఉప్పు లేదా మిరియాల పొడి చల్లుకుని వేడివేడిగా తింటే అద్భుతంగా ఉంటుంది.