School Bag: స్కూల్ ముగియగానే ఇంటికి రాగానే సోఫాలోకో, మంచం మీదకో విసిరేసే స్కూల్ బ్యాగ్ వెనుక ఒక అద్భుతమైన ఫ్లాష్‌బ్యాక్ ఉందన్న సంగతి మీకు తెలుసా..అవును ఈరోజు రంగురంగుల డిజైన్లు, జిప్పర్లు, వాటర్ బాటిల్ హోల్డర్లతో స్టైలిష్‌గా కనిపించే ఈ బ్యాగ్ వెనుక దాదాపు వందేళ్ల హిస్టరీ ఉంది. అయితే ఈ స్కూల్ బ్యాగ్‌ను అసలు మొదట ఎవరు కనిపెట్టారు అనే ప్రశ్నకు చరిత్రలో ఒకే ఒక్క పేరు ఎక్కడా కనిపించదు. కాకపోతే ఈరోజు మనం వాడుతున్న ‘మోడ్రన్ స్కూల్ బ్యాగ్’ రూపానికి మాత్రం జర్మనీ దేశమే నాంది పలికిందని చెప్పాలి .
మొదటి అధికారిక స్కూల్ బ్యాగ్ ఇదే
విషయంలోకి వెళ్తే 1850వ సంవత్సరం నాటికి జర్మనీలో అక్షరాస్యత పెరిగి, పిల్లలు బళ్లకు వెళ్లడం ఒక్కసారిగా ఎక్కువైంది. అప్పట్లో ఇప్పటిలా నోట్‌బుక్స్ కాకుండా పలకలు, సుద్దముక్కలు, బరువైన పుస్తకాలు ఉండేవి. వాటన్నింటినీ చేతుల్లో పట్టుకుని కిలోమీటర్ల దూరం నడవడం పిల్లలకు కష్టంగా ఉండేది. ఆ సమయంలోనే జర్మనీ షూ తయారీదారులకు ఒక క్రేజీ ఐడియా వచ్చింది. అప్పట్లో సైనికులు తమ వెనుక భాగంలో ‘రాన్ జెన్’ అనే ప్రత్యేకమైన వీపు సంచులను తగిలించుకునేవారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని 1870లో తోలుతో గట్టిగా ఉండే సంచులను తయారు చేయడం ప్రారంభించారు. దానికి ‘టోర్నిస్టర్’ లేదా ‘షుల్‌రాన్ జెన్’ అని పేరు పెట్టారు. చరిత్రలో నమోదైన మొదటి అధికారిక స్కూల్ బ్యాగ్ ఇదే. అప్పట్లో పుస్తకాల ధరలు ఆకాశంలో ఉండేవి, కాబట్టి అవి నలగకుండా, వర్షానికి తడవకుండా ఉండేందుకు ఈ తోలు సంచులను చాలా దిట్టంగా డిజైన్ చేసేవారు.
1938లో అమెరికాలో సరికొత్త విప్లవం
కాలం మారుతున్న కొద్దీ ఈ బ్యాగ్ రూపం కూడా మారుతూ వచ్చింది. 1938లో అమెరికాలో సరికొత్త విప్లవం వచ్చింది. అప్పటివరకు ఉన్న బటన్స్ స్థానంలో ‘జిప్పర్’ సౌకర్యంతో కూడిన కాన్వాస్ బ్యాగ్‌లు మార్కెట్లోకి వచ్చాయి. ఇవి పిల్లలకు పుస్తకాలు దాచుకోవడానికి చాలా ఈజీగా అనిపించాయి. అయితే నిజమైన మోడ్రన్ లుక్ వచ్చింది మాత్రం 1967లోనే. ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్ ‘జాన్ స్పోర్ట్’ కంపెనీ మొట్టమొదటిసారిగా నైలాన్ మెటీరియల్‌తో తేలికపాటి ‘బ్యాక్‌ప్యాక్’ను స్కూల్ పిల్లల కోసం రంగంలోకి దించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా స్కూల్ బ్యాగ్ రూపురేఖలనే మార్చేసింది.
also read :ఒకరితో ప్రేమలో ఉంటూనే ఇతరులతో ఫిజికల్ రిలేషన్.. నా పార్ట్‌నర్‌కు అంతా తెలుసంటున్న బాలీవుడ్ బ్యూటీ
ఇక మన భారతదేశం విషయానికి వస్తే కథ పూర్తిగా వేరే. 1960ల కాలం వరకు మన దేశంలో మెజారిటీ పిల్లలకు స్కూల్ బ్యాగ్ అంటే ఏంటో కూడా తెలియదు. చాలామంది తమ పుస్తకాలను ఒక పొడవాటి టవల్‌లోనో లేదా పాత గుడ్డలోనో మూట కట్టుకుని చంకలో పెట్టుకుని వెళ్లేవారు. మరికొందరు అప్పట్లో ట్రెండ్‌గా ఉన్న అల్యూమినియం పెట్టెలను (ట్రంక్ బాక్సులు) పట్టుకుని బడిబాట పట్టేవారు. ఎండైనా, వానైనా ఆ పెట్టెలే పిల్లలని కాపాడేవి . అయితే మన దేశంలో 1980లకి ముందు కేవలం ధనవంతుల పిల్లలకే ఈ బ్యాగులు అందుబాటులో ఉండేవి , ఆ తర్వాతే స్కూల్ బ్యాగులు మధ్యతరగతి కుటుంబాలకు సైతం అందుబాటులోకి వచ్చాయి.
సింపుల్ వస్తువు వెనుక ఇంతటి క్రేజీ స్టోరీ
ఈ బ్యాగ్ చరిత్ర కేవలం పుస్తకాలు మోయడానికే పరిమితం కాలేదండోయ్ .. ఒకప్పుడు కేవలం అవసరం కోసం పుట్టిన బ్యాగ్, ఈరోజు ఫ్యాషన్ ఐకాన్‌గా మారిపోయింది. కార్టూన్ క్యారెక్టర్ల నుంచి స్మార్ట్ బ్యాగ్‌ల వరకు ఎన్నో వెరైటీలు వచ్చాయి. రోజువారీ జీవితంలో మనం పెద్దగా పట్టించుకోని ఈ సింపుల్ వస్తువు వెనుక ఇంతటి క్రేజీ స్టోరీ ఉందన్నది ఎవరూ ఊహించని నిజం. మొత్తానికి ఇదండీ స్కూల్ బ్యాగు వెనుకున్న స్టోరీ !
also read :9 రోజుల్లోనే రూ.40 కోట్లు.. థియేటర్లలో కాసుల వర్షం కురిపిస్తున్న మరాఠీ సినిమా