Deool Band2: సూపర్ హిట్స్, సాలిడ్ కలెక్షన్స్ అంటే బాలీవుడ్ లేదా టాలీవుడ్, కలిసివస్తే సాండల్ వుడ్ ఇండస్ట్రీల పేర్లే ఎక్కువ వినిపిస్తాయి.కానీ ఈ మధ్య ఎవరూ ఊహించని రీతిలో గుజరాతీ, మరాఠీ ల ఇండస్ట్రీలు తామూ బరిలోనే ఉన్నామంటూ మీసం మెలేస్తున్నాయి.
అవును …గత కొన్ని నెలల కింద గుజరాతీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ‘లాలో కృష్ణ సదాయతే ’ మూవీ ఎలాంటి సంచలనాలు సృష్టించిందో, ఎంతటి భారీ వసూళ్లను సాధించిందో మనకందరికీ తెల్సిందే. ఇప్పుడు అదే మ్యాజిక్‌ను మరోసారి రిపీట్ చేస్తుంది మరాఠీ సినీ ఇండస్ట్రీ.ఈ క్రమంలో చిన్నబడ్జెట్ లో వచ్చి హై వాల్యూమ్ కలెక్షన్లను సాధిస్తున్న తాజా మరాఠీ చిత్రం ‘దేవూల్ బంద్ 2’ (Deool Band 2) ప్రస్తుతం ట్రేడ్ వర్గాలలో హాట్ టాపిక్ అయింది.
మే 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా
కేవలం రూ.9 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఊహించని రేంజ్‌లో విధ్వంసం సృష్టిస్తోంది. ఈ ఏడాది మే 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ, కేవలం తొమ్మిది రోజుల్లోనే సుమారు రూ.40 కోట్ల గ్రాస్ వసూలు చేసి అందరికి పెద్ద షాకే ఇచ్చింది.టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ తార్డే దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో స్నేహల్ తార్డే, సీనియర్ నటుడు మోహన్ జోషి కీలక పాత్రల్లో నటించి మెప్పించారు.
రిలీజ్ అయిన మొదట్లో మహారాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 11 వందల స్క్రీన్‌లలో విడుదలైన ఈ సినిమాకు, ఫస్ట్ షో నుండే ప్రేక్షకుల నుంచి పాజిటివ్ మౌత్ టాక్ లభించింది. దాంతో థియేటర్ల వద్ద డిమాండ్ భారీగా పెరగడంతో అదనంగా మరో 600 స్క్రీన్‌లను యాడ్ చేశారు.అలా సినిమాని ఆడియన్స్ నెత్తిన పెట్టుకోవడంతో మొదటి వీకెండ్‌లోనే రూ.5.90 కోట్లు రాబట్టిన ఈ చిత్రం, ప్రస్తుతం రూ.40 కోట్ల మార్కును దాటేసి, అత్యధిక వసూళ్లు సాధించిన టాప్-10 మరాఠీ చిత్రాల జాబితాలోకి అఫీషియల్ గా ఎంట్రీ ఇచ్చేసింది.
also read:‘రాకా’, ‘చరణ్’ సినిమాల మధ్య నలిగిపోయిన ‘పుష్ప-3’.. ఇక రానట్టేనా?
మరాఠీ ఇండస్ట్రీలో ఇటీవల స్టార్ హీరో రితేష్ దేశ్‌ముఖ్ నటించిన చారిత్రాత్మక చిత్రం ‘రాజా శివాజీ’ రూ.130 కోట్లతో ఆల్‌టైమ్ టాప్ లిస్ట్ కొనసాగుతుండగా, ఇప్పుడు ‘దేవూల్ బంద్ 2’ కూడా ఆ స్థాయిలోనే లాంగ్ రన్ సాధించే దిశగా దూసుకుపోతుండటం విశేషం.
కథ ఏంటంటే ..
కథ విషయానికి వస్తే.. గ్రామీణ నేపథ్యంలో సాగే ఒక ఎమోషనల్ అండ్ డివోషనల్ డ్రామాగా దీనిని మలిచారు. సంగీత పేగుడే అనే ఒక మహిళా రైతు చుట్టూ ఈ కథ తిరుగుతుంది. నిత్యం కష్టాలతో కుస్తీ పడే ఆమె, తన బాధలను తీర్చమని రోజు దేవుడిని వేడుకుంటుంది. కానీ ఎంతకీ పరిస్థితులు మారకపోవడంతో ఒకరోజు తీవ్ర అసహనానికి గురై నది సమీపంలో ఉన్న చీమల పుట్టపై రాయి విసిరికొడుతుంది. ఆ క్షణంలో ఆమెకు శ్రీస్వామి సమర్థ్ స్వయంగా దర్శనమిస్తారు. ఆనందంతో ఆమె స్వామిని తన గ్రామానికి తీసుకువస్తుంది. అయితే ఇక్కడే ఒక విచిత్రమైన ట్విస్ట్ ఉంది. ఆ స్వామి కేవలం సంగీతకు మాత్రమే కనిపిస్తూ ఉంటాడు. ఎవరూ లేకపోయినా ఆమె గాల్లో చూస్తూ మాట్లాడుతుండటంతో, ఊరి జనాలు ఆమెకు పిచ్చి పట్టిందని భావిస్తారు. ఈ క్రమంలో స్వామి సమర్థ్ రాకతో ఆమె జీవితం ఎలా మారింది? నమ్మకం, నమ్మకద్రోహం, సామాజిక ఆంక్షల మధ్య ఆ మహిళ ఎలాంటి సంఘర్షణను ఎదుర్కొంది? అనే అంశాలను అద్భుతంగా, ప్రేక్షకుల మనసులకు హత్తుకునేలా వెండితెరపై ఆవిష్కరించారు దర్శకుడు ప్రవీణ్ తార్డే
33 గంటల పాటు ఏకధాటిగా షూటింగ్
ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతున్న తరుణంలో, చిత్ర యూనిట్ పంచుకున్న ఒక ఆసక్తికరమైన షూటింగ్ సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక ముఖ్యమైన షెడ్యూల్ కోసం చిత్ర బృందం ఏకంగా 33 గంటల పాటు ఏకధాటిగా, ఎలాంటి విరామం లేకుండా షూటింగ్ నిర్వహించిందట. ఈ విషయాన్ని సీనియర్ నటుడు మోహన్ జోషి ఒక ఇంటర్వ్యూలో వెల్లడిస్తూ, షూటింగ్ ఫ్లోలో దర్శకుడు ప్రవీణ్ తార్డే సీన్ల మీద సీన్లు తీస్తూనే ఉన్నారని, ప్యాకప్ చెప్పాలనే విషయం ఆయనకు గుర్తుచేసే ధైర్యం ఎవరికీ లేకపోయిందని నవ్వుతూ చెప్పారు. చివరకు 30 గంటలు దాటిన తర్వాత తానే స్వయంగా వెళ్లి చెప్పగా, దర్శకుడు ఆశ్చర్యపోయి మరో రెండు షాట్స్ తీసి ముగించారని అన్నారు.
ఇండోర్ సెట్ కావడంతో సమయం తెలియలేదని, మధ్యలో జూనియర్ ఆర్టిస్టులుగా వచ్చిన గ్రామస్థులు వెళ్ళిపోతే, దర్శకుడి స్నేహితులు, కార్ డ్రైవర్లకు కాస్ట్యూమ్స్ వేసి మరీ షూటింగ్ పూర్తి చేశామని నటి స్నేహల్ తార్డే పేర్కొన్నారు. ఈ కష్టమే ఇప్పుడు సినిమాను ఇంతటి సూపర్ హిట్ కారణం అంటున్నారంతా.చూడాలి మరి 40కోట్లని దాటేసి దూసుకెళ్తున్న ఈ సినిమా ముందు ముందు ఇంకెన్ని కోట్లు కొల్లగొడుతుందో !
also read :డిజిటల్ రైట్స్ రూ.130 కోట్లు.. ఆడియో రైట్స్ రూ.50 కోట్లు.. విడుదలకు ముందే ‘పెద్ది’ వసూళ్ల జాతర