Revanth Reddy Report: తెలంగాణ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. 100 రోజుల్లో రూ.6 వేల కోట్ల బకాయిలు విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉద్యోగ సంఘాల నాయకులకు ఇటీవల హామీ ఇచ్చారు. ఇందులో తొలి విడత రూ.2 వేల కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. మిగిలిన రూ.4 వేల కోట్లు కూడా త్వరలోనే జమ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. రిటైర్డ్ ఉద్యోగుల జీపీఎఫ్ బకాయిలు 100 శాతం ప్రభుత్వం క్లియర్ చేసింది.
రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి అందుతున్న సంక్షేమ పథకాల వివరాలన్నీ ఒకే కార్డులో అందుబాటులో ఉండేలా సమగ్ర సంక్షేమ కార్డు రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఏ పౌరుడికి ఏ శాఖ ద్వారా, ఏ పథకం కింద, ఎంత మేర లబ్ధి చేకూరుతోందో ఈ కార్డు ద్వారా స్పష్టంగా తెలిసేలా ఉండాలని సూచించారు. అన్ని శాఖల నుంచి లబ్ధిదారుల డేటాను సేకరించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు. ప్రజలకు అందుతున్న అన్ని డిజిటల్ సేవలను ఒకే వేదికపైకి తీసుకురావడమే కాకుండా, మరింత పారదర్శకతను పెంచేందుకు యూనిఫైడ్ స్మార్ట్ కార్డును తీసుకురావడమే దీని ఉద్దేశం. ఈ విధానం అనుసరించడం వల్ల నిజమైన అర్హులకు పథకాలు మరింత కచ్చితంగా చేరుతాయని, అదే సమయంలో అనర్హులను గుర్తించడం సులభమవుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ కార్డ్‌లో ఆరోగ్యశ్రీ, సీఎం సహాయ నిధి, ఫీజు రీయింబర్స్‌మెంట్, కార్మిక శాఖ, విద్యా శాఖ, బీమా పథకాలు, ప్రభుత్వం తీసుకొస్తున్న బీమా పథకాల వివరాలు ఉండేలా డిజైన్ చేస్తున్నారు.
హైదరాబాద్ అమీర్‌పేటసర్కిల్‌లో ఏర్పాటు చేసిన విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు విగ్రహాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా ఇచ్చిన హామీకి అనుగుణంగా ఆయన జయంతి రోజునే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. భారతదేశ ఉక్కు మహిళ ఇందిరా గాంధీ, తెలుగుజాతి గర్వించదగిన నాయకుడు ఎన్ టీ రామారావుల స్ఫూర్తితో రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తున్నామన్నారు సీఎం రేవంత్. ఈ సందర్భంగా ఎన్టీఆర్ సేవలను స్మరించుకున్నారు. రాష్ట్రంలో 3.24 కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తున్నామని.. దానికి ఎన్టీఆర్ 2 రూపాయలకే కిలోబియ్యం పథకం స్ఫూర్తి అన్నారు రేవంత్ రెడ్డి. ఎన్టీఆర్ అమలు చేసిన కూడు, గుడ్డ, నీడ నుంచి స్ఫూర్తితో అనేక సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నామని తెలిపారు.
తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాలకు నిరంతరం హై-స్పీడ్ బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీని అందించే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి పని చేస్తున్నారు. ఇందుకోసం అమెండెడ్ భారత్‌నెట్ ప్రోగ్రామ్ సజావుగా అమలు చేయడానికి సీఎం రేవంత్ కొన్ని కీలక అంశాలను కేంద్ర సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా దృష్టికి తీసుకెళ్లారు. ఈ ప్రోగ్రామ్‌కు సంబంధించి సాధ్యమైనంత తొందరగా ఒప్పందాన్ని కుదుర్చుకోవడం, పెండింగ్‌లో ఉన్న నిధులను సత్వరం విడుదల చేయడం వంటి అంశాలపై చర్చించారు. మండలం నుంచి గ్రామ పంచాయతీ రింగ్ నెట్‌వర్క్ వ్యవస్థలను డిజిటల్ భారత్ నిధికి బదిలీ చేయడంపై స్పష్టమైన విధానం ఉండాలని కేంద్ర మంత్రిని కోరారు. వీటిపై సింధియా సానుకూలంగా స్పందించారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి దశలో, నెట్‌వర్క్ దెబ్బతిన్న ఉమ్మడి నిజామాబాద్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లోని 3,089 గ్రామాలకు డిజిటల్ కనెక్టివిటీ పునరుద్ధరిస్తారు.
తుమ్మిడిహెట్టి బ్యారేజ్ ఎత్తు, నిర్మాణంపై మహారాష్ట్రతో చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వం అడుగు ముందుకేసింది. సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌కు లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బృందంతో సమావేశానికి సమయమివ్వాలని, అనుకూలమైన తేదీని త్వరగా ఖరారు చేయాలని సీఎం కోరారు. డా. బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత – చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజ్ నిర్మించాల్సి ఉంది. మొదటి ప్రతిపాదనలో ఈ బ్యారేజ్ 152 మీటర్ల ఎత్తు నిర్మించాలనుకున్నారు. అయితే 148 మీటర్ల ఎత్తులో బ్యారేజ్ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. 148 మీటర్ల కంటే కొంత ఎక్కువ ఎఫ్‌ఆర్‌ఎల్‌ను పరిశీలించినా, మహారాష్ట్రలో ముంపు ప్రభావం తక్కువగానే ఉంటుందనేది తెలంగాణ వాదన. ఎఫ్‌ఆర్‌ఎల్ పెరిగితే గ్రావిటీ ద్వారా తెలంగాణకు నీటిని తెచ్చుకునే వీలుందని లేఖలో ప్రస్తావించారు సీఎం రేవంత్.
వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడంతో వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అదనపు ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలన్నారు. కల్లాల్లో ఉన్న ధాన్యం తడవకుండా అవసరమైన టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఇప్పటికే కొనుగోళ్లు పూర్తైన కేంద్రాల నుంచి టార్పాలిన్లను తరలించాలన్నారు సీఎం రేవంత్.
రాష్ట్రంలోని 50 వేల మంది గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రతి నెలా మొదటి తారీఖునే జీతాలు చెల్లించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు. గ్రామ పంచాయతీ సిబ్బంది జీతాలు చెల్లించడానికి ప్రభుత్వం నుంచి ప్రతినెలా 50 కోట్లు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తామన్నారు. అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు అనే తేడా లేకుండా ప్రభుత్వంలోని అన్ని శాఖల పరిధిలోని ఉద్యోగులకు మొదటి తారీఖునే జీతాలు అందేలా చూడాలని స్పష్టం చేశారు.
పెన్షన్ల పంపిణీ విధానంపై ముఖ్యమంత్రి గారు అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు. పోస్టల్ శాఖ ద్వారా అందజేస్తున్న ప్రస్తుత పెన్షన్ పంపిణీ విధానాన్ని మార్చి నేరుగా లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని చెప్పారు. పెన్షన్లు అర్హులకు మాత్రమే అందేలా చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా ఓటర్ గుర్తింపు కార్డు, ఆధార్, సర్వే డేటా ఆధారంగా పెన్షన్లను క్రమబద్ధీకరించాలని చెప్పారు.
2034 నాటికి కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళుతుంది. మహిళా సంఘాలు ఆర్థికంగా ఎదగడానికి అన్ని నియోజకవర్గాల కేంద్రాల్లో కార్పొరేట్ స్థాయిలో మహిళా శక్తి సూపర్ బజార్లు ప్రారంభించడానికి వీలుగా సమగ్ర ప్రణాళికలను తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. సూపర్ బజార్లతో పాటు మహిళలు వ్యాపార రంగంలో మరింతగా రాణించడానికి స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ప్రతి మండలంలో రైస్ మిల్లులు, గోడౌన్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు.
బ్యాంకుల నుంచి వీటికి అవసరమైన రుణాలను ఇప్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా స్వయం సహాయక సంఘాల కోసం 8 వేల ఇందిరా స్త్రీ శక్తి భవనాలకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. జూలై 31 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు మేరీలాండ్ బాల్టిమోర్ లో నిర్వహించనున్న అసోసియేషన్ 19వ తెలుగు మహాసభలకు హాజరుకావాలని సీఎంను ఆహ్వానించారు.
రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి గింజా కొనుగోలు చేస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మద్దతు ధరలు ప్రకటించడమే తప్ప కేంద్రం రాష్ట్రంలో పంటను కొనుగోలు చేయడం లేదని, కనీసం 30 శాతం కూడా సేకరించడం లేదని వివరించారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కారణంగా హామాలీలు తరలివెళ్లడంతో ఇక్కడ కొంత కొరత ఏర్పడిందని, అలాగే ఎండల కారణంగా మధ్యాహ్నం సమయంలో పని జరగడం లేదన్నారు. ధాన్యం కొనుగోళ్లపై నిరంతరం సమీక్ష చేస్తున్నానని తెలిపారు. సన్నవడ్లకు రూ. 500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తున్నామని, మొక్కజొన్నను మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నామని గుర్తుచేశారు.
Also Read: లీకేజీలకు ఛాన్సే లేదు.. ఏపీ ‘మెగా డీఎస్సీ’ వివాదాలపై తేల్చి చెప్పిన విద్యాశాఖ!
Story by: Anup, Big Tv