Back Pain: చాలామంది వెన్నునొప్పి రాగానే అది కేవలం అలసట వల్ల లేదా తప్పుగా కూర్చోవడం వల్ల వచ్చిందని భావిస్తారు. పెయిన్ కిల్లర్ వేసుకుంటే తగ్గిపోతుందని అనుకుంటారు. అయితే.. వెన్నునొప్పి కొన్నిసార్లు లోపల పెరుగుతున్న క్యాన్సర్, గుండె సమస్యలు లేదా వెన్నెముక ఇన్ఫెక్షన్లకు ముందస్తు హెచ్చరిక కావచ్చు. ఆ నొప్పి ఎప్పుడు ‘సైలెంట్ కిల్లర్’గా మారుతుందో, ఏ లక్షణాలను చూసి భయపడాలో తెలుసుకోవడం మీ ప్రాణాలను కాపాడుకోవడంలో అత్యంత కీలకం.
వెన్నునొప్పి ఎప్పుడు ప్రమాదకరం?
వెన్నునొప్పి అనేది ఒక లక్షణం మాత్రమే, వ్యాధి కాదు. చాలా వరకు వెన్నునొప్పి కండరాలు పట్టేయడం వల్ల వస్తుంది. కానీ.. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అది ప్రాణాపాయానికి సంకేతం. ఒక సర్జన్‌గా నేను నా కెరీర్‌లో గమనించిన ‘రెడ్ ఫ్లాగ్’ ఇక్కడ ఉన్నాయి.
1. బరువు తగ్గడం, రాత్రిపూట నొప్పులు:
మీకు వెన్నునొప్పితో పాటు, మీరు ప్రయత్నించకుండానే బరువు తగ్గుతున్నట్లయితే అది ప్రమాదకర సంకేతం. ముఖ్యంగా రాత్రి పడుకున్నప్పుడు నొప్పి మరింత తీవ్రంగా ఉంటే.. అది వెన్నెముకకు పాకిన క్యాన్సర్ కావచ్చు. కణతులు వెన్నెముకపై ఒత్తిడి తెచ్చినప్పుడు ఇలాంటి నొప్పి వస్తుంది.
2. జ్వరం, వెన్నునొప్పి :
నొప్పి తీవ్రంగా ఉండి, దానితో పాటు జ్వరం, చలి వస్తుంటే అది వెన్నెముకలో ఏర్పడిన ఇన్ఫెక్షన్ కావడానికి అవకాశం ఉంది. ఇది రక్తంలోకి పాకితే సెప్సిస్ అనే ప్రాణాంతక స్థితికి దారి తీస్తుంది. సర్జరీ లేదా ఏదైనా ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత ఇలా జరిగితే వెంటనే అలర్ట్ అవ్వాలి.
3. కాళ్లు మొద్దుబారడం, నియంత్రణ కోల్పోవడం :
వెన్నునొప్పితో పాటు మీ మలమూత్ర విసర్జనపై నియంత్రణ కోల్పోతే.. అది మెడికల్ ఎమర్జెన్సీ. దీనిని కౌడా ఈక్వినా సిండ్రోమ్ అంటారు. వెన్నెముక దిగువ భాగంలో నరాలు తీవ్రంగా నలిగిపోయినప్పుడు ఇలా జరుగుతుంది. దీనికి 24 నుంచి 48 గంటల్లోపు సర్జరీ చేయకపోతే శాశ్వత పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంది.
4. ఛాతి నొప్పి, వెన్నునొప్పి :
అకస్మాత్తుగా వీపు మధ్యలో విపరీతమైన నొప్పి వచ్చి, అది పొట్టలోకి పాకుతున్నట్లు అనిపిస్తే అది అయోర్టిక్ అనూరిజం కావచ్చు. గుండె నుంచి రక్తాన్ని తీసుకెళ్లే ప్రధాన రక్తనాళం చిట్లడం వల్ల ఈ నొప్పి వస్తుంది. ఇది క్షణాల్లో ప్రాణాలు తీయగలదు.
5. వయస్సు, ఎముకల బలహీనత:
50 ఏళ్లు దాటిన వారిలో.. తుమ్మినా తీవ్రమైన వెన్నునొప్పి వస్తే అది వెన్నెముక ఫ్రాక్చర్ కావచ్చు. ఆస్టియోపోరోసిస్ వల్ల ఎముకలు బలహీనపడి ఇలా జరుగుతుంది. దీనిని సకాలంలో గుర్తించకపోతే వైకల్యానికి దారితీస్తుంది.
Also Read: బీపీ.. 130/80 దాటితే లైట్ తీసుకోవద్దు, హెచ్చరిస్తున్న డాక్టర్లు !
సర్జన్ సలహా: ఎప్పుడు డాక్టర్‌ను సంప్రదించాలి ?
నొప్పి 4 వారాల కంటే ఎక్కువ కాలం ఉంటే.
నొప్పి కాళ్లలోకి పాకుతూ, బలహీనత కలిగిస్తుంటే.
విశ్రాంతి తీసుకున్నా నొప్పి తగ్గకపోతే.
స్టెరాయిడ్స్ వాడుతున్నప్పుడు లేదా వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు నొప్పి వస్తే.
వెన్నునొప్పిని ఎప్పుడూ ఒకే కోణంలో చూడకండి. పైన పేర్కొన్న ఏ ఒక్క లక్షణం ఉన్నా, అది కేవలం నడుము నొప్పి అని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే నిపుణులైన సర్జన్‌ను సంప్రదించండి. సకాలంలో గుర్తిస్తే ఏ సమస్యనైనా ఎదుర్కోవచ్చు.