Blood Sugar Control: మనం రోజూ తినే అన్నం, గోధుమలు తగ్గించేస్తే చాలు.. బ్లడ్ షుగర్ మాయమైపోతుందని చాలామంది గుడ్డిగా నమ్ముతుంటారు. కానీ, ఇవి తగ్గించినా కొందరిలో షుగర్ లెవెల్స్ అస్సలు తగ్గవు. ఇందుకు కారణం మనం తినే తిండిలో జరిగే కొన్ని చిన్న చిన్న పొరపాట్లే. అసలు అన్నం మానేసినా షుగర్ ఎందుకు పెరుగుతుందో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
అన్నం తగ్గించామనే ధైర్యంతో చాలామంది దాని బదులు కడుపు నిండా వేరే కార్బోహైడ్రేట్లు లాగిస్తుంటారు. కొంతమంది అన్నం తగ్గించి, కూరల్లో బంగాళాదుంపలు లేదా స్వీట్ పొటాటోలు ఎక్కువగా వేసుకుని తింటారు. మరికొందరు రాత్రిపూట రొట్టెలని, రాగి దోసెలని బలంగా లాగిస్తుంటారు. ఇవన్నీ ఆరోగ్యకరమైనవే అయినా.. వీటిలోనూ కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే, మార్కెట్లో దొరికే చాలా మిల్ట్స్ (చిరుధాన్యాలు) పాలిష్ చేసినవే ఉంటున్నాయి. పాలిష్ చేయడం వల్ల వాటిలో ఉండే పీచు పదార్థం పోయి, తిన్న వెంటనే అది గ్లూకోజ్‌లా మారి షుగర్‌ను అమాంతం పెంచేస్తుంది. కాబట్టి కేవలం ధాన్యం మార్చినంత మాత్రాన షుగర్ తగ్గదు.
Also Read: దిష్టి ఎలా తీయాలో తెలుసా? వేటితో తీస్తే వెంటనే ఫలితం ఉంటుంది?
పండ్లు తింటే మంచిదే కదా.. అని రోజూ రకరకాల పండ్లు లాగించడం, లేదా జ్యూస్‌లు తాగుతుండటం కూడా షుగర్ పెరగడానికి పెద్ద కారణమే. పండ్ల రసాలు తాగితే శరీరానికి పీచు అందదు, పైగా నేరుగా చక్కెర అందుతుంది. ఇక టీ టైమ్‌లో కామన్ అయిపోయిన బిస్కెట్ల సంగతి సరేసరి. డీటాక్స్, షుగర్-ఫ్రీ, మల్టీగ్రెయిన్ అని ప్యాకెట్ల మీద రాసి ఉన్నప్పటికీ వాటిలో మైదా, పంచదార, కొవ్వు పదార్థాలు ఉంటాయనే నిజాన్ని మర్చిపోకూడదు. రెండు బిస్కెట్లు తిన్నా సరే, శరీరంలోకి వేగంగా కార్బోహైడ్రేట్లు చేరిపోతాయి. అలాగే విటమిన్లు ఉన్నాయని తాగే ప్యాకేజ్డ్ డ్రింక్స్‌లోనూ షుగర్ మోతాదు ఎక్కువే ఉంటుంది.
అన్నం ఒక్కటే తగ్గించడం వల్ల పెద్దగా ఒరిగేదేమీ లేదు. మీరు రోజూ తినే ఆహారపు అలవాట్లు, తినే మోతాదు మొత్తం మారాలి. మీ ప్లేట్లో పిండి పదార్థాలు తక్కువగా ఉండే కూరగాయలు నిండుగా ఉండాలి. వీటితో పాటు పప్పు, గుడ్లు, చేపలు, చికెన్ లేదా పెరుగు వంటి ప్రొటీన్ ఉండే పదార్థాలను సరిపడా తీసుకోవాలి. స్వీట్లు, బేకరీ తిండి, బిస్కెట్లు, నూనెలో వేయించిన స్నాక్స్ వంటి వాటికి పూర్తిగా దూరంగా ఉండడం మంచిది.
బ్లడ్ షుగర్ అనేది కేవలం ఒక్క పూట మనం తిన్న అన్నం మీద మాత్రమే ఆధారపడి ఉండదు. రోజంతా మనం ఏమేమి తింటున్నాము, ఎంత తింటున్నాము, ఏ వ్యాయామం చేస్తున్నాము, డాక్టర్ రాసిచ్చిన మందులు సరిగ్గా వాడుతున్నామా లేదా అనేదానిపై ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. కాబట్టి.. నేను ఎంత అన్నం మానేశాను? అని ఆలోచించడం మానేసి, రోజూ ఏమేమి తింటున్నానో ఒకసారి బేరీజు వేసుకోవడం చాలా ముఖ్యం.
Also Read: చూపు దెబ్బతినకముందే అప్రమత్తం కండి.. కళ్లు చెప్పే ఆ రహస్య సంకేతాలు ఇవే!