Railway porters overcharging| రైలు ప్రయాణంలో లగేజీని మోసేందుకు కూలీల సహాయం తీసుకోవడం సాధారణమే. అయితే, కొందరు కూలీలు నిర్ణీత ఛార్జీల కంటే ఎక్కువ డబ్బులు అడిగితే ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అధికారిక ధరలు తెలియక చాలామంది వారు అడిగినంత డబ్బు చెల్లిస్తుంటారు. కానీ, ఇలాంటి పరిస్థితుల్లో మౌనంగా ఉండాల్సిన అవసరం లేదు. రైల్వే అధికారులకు ఫిర్యాదు చేయడానికి పలు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. కూలీ అధిక ఛార్జీలు అడిగితే ఎలా ఫిర్యాదు చేయాలి? ఫిర్యాదు చేసేటప్పుడు ఏ వివరాలు అవసరం? ఇప్పుడు తెలుసుకుందాం.
స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రయాణికులు రైల్వే శాఖకు చెందిన రైల్ మదద్ వెబ్‌సైట్‌ను ఉపయోగించండి. ఇందుకోసం railmadad.indianrailways.gov.in వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. అందులో అందుబాటులో ఉన్న సంబంధిత ఫిర్యాదు విభాగాన్ని ఎంచుకుని సమస్యకు సంబంధించిన వివరాలను నమోదు చేయండి. మీరు ప్రయాణించిన రైల్వే స్టేషన్ పేరు, కూలీ బ్యాడ్జి నంబర్, అతను అడిగిన మొత్తం వంటి వివరాలను అందించండి. ఫిర్యాదు సమర్పించిన తర్వాత రిఫరెన్స్ నంబర్‌ను భద్రపరచుకోండి. తదుపరి సమాచారం తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.
ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయడం సాధ్యం కాకపోతే రైల్వే స్టేషన్‌లోని స్టేషన్ మాస్టర్‌ను సంప్రదించండి. అవసరమైతే సంబంధిత వాణిజ్య విభాగం అధికారులను కూడా ఫిర్యాదు చేయండి.
జరిగిన సంఘటనను వివరించి, ఫిర్యాదు లిఖితపూర్వకంగా అందించండి. కూలీ బ్యాడ్జి నంబర్, సంఘటన జరిగిన ప్రదేశం, సమయం, అతను అడిగిన డబ్బు వంటి వివరాలను పేర్కొనండి. స్టేషన్‌లో ప్రదర్శించిన అధికారిక ధరల పట్టికను పరిశీలించి, అదనపు ఛార్జీల గురించి అధికారులకు తెలియజేయండి.
ఇంటర్నెట్ సౌకర్యం లేని ప్రయాణికులు రైల్వే హెల్ప్‌లైన్ నంబర్ 139 సంప్రదించవచ్చు. కాల్ చేసినప్పుడు స్టేషన్ పేరు, కూలీ గుర్తింపు వివరాలు, అధికంగా డబ్బులు అడిగిన విషయాన్ని స్పష్టంగా తెలియజేయండి. మీ ఫిర్యాదు నమోదు చేశారా లేదా నిర్ధారించుకుని, సాధ్యమైతే రిఫరెన్స్ నంబర్ తీసుకోండి. సంబంధిత అధికారులు ఫిర్యాదును పరిశీలించి, నిబంధనల ప్రకారం.. తదుపరి చర్యలు తీసుకోవచ్చు.
Also Read: రైలు ప్రయాణంలో ఫ్యామిలీకి వేర్వేరు సీట్లు వచ్చాయా? ఇదిగో ముందుగానే ఇలా మార్చుకోండి
ఫిర్యాదు చేసేటప్పుడు కూలీని గుర్తించడం చాలా ముఖ్యం. అందుకే లగేజీ అప్పగించే ముందు అతని గుర్తింపు బ్యాడ్జిని పరిశీలించండి. బ్యాడ్జి నంబర్‌ను నోట్ చేసుకోండి లేదా అవసరమైతే ఫోటో తీసుకోండి. సంఘటన జరిగిన సమయం, ప్రదేశం, చెల్లించిన మొత్తానికి సంబంధించిన రసీదు వంటి ఆధారాలను కూడా భద్రపరచండి.
Also Read: ట్రావెల్ చేసేటప్పుడు ఇల్లు గుర్తుకొస్తోందా? ఈ సింపుల్ టిప్స్ ట్రై చేయండి
కూలీ సేవలను వినియోగించుకునే ముందు వర్తించే ఛార్జీలను అడిగి తెలుసుకోండి. అధిక డబ్బులు అడిగితే గొడవ పడకుండా సంబంధిత రైల్వే అధికారులకు ఫిర్యాదు చేయండి. ఫిర్యాదులో సరైన వివరాలు అందించడం వల్ల విచారణకు సహాయపడుతుంది. విచారణ ఫలితాలను బట్టి రైల్వే శాఖ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవచ్చు.