Men Health Tips: ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఆడవారికంటే మగవారే ఐదేళ్ల నుంచి ఏడేళ్లు తక్కువ కాలం జీవిస్తున్నారు. ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డుల్లో హార్ట్ ఎటాక్, స్ట్రోక్స్‌తో చేరే వారిలో మిడిల్ ఏజ్ పురుషులే ఎక్కువగా ఉంటారని ప్రముఖ డాక్టర్ ప్రియమ్ బోర్డోలోయ్ సోషల్ మీడియ వేదికగా వెల్లడించారు. దీనికి కేవలం జీవనశైలి మాత్రమే కాదు.. బాడీలోని కొన్ని సహజ సిద్ధమైన మార్పులు కూడా కారణమేనని ఆయన వివరించారు.
మహిళల్లో ఉండే ఈస్ట్రోజెన్ హార్మోన్ రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచి, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఇది గుండె సంబంధిత సమస్యల నుంచి వారికి రక్షణ కల్పిస్తుంది. కానీ పురుషుల్లో ఎక్కువగా ఉండే టెస్టోస్టెరోన్ హార్మోన్ వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగి, రక్తనాళాల్లో పూడికలు ఏర్పడే అవకాశం ఎక్కువవుతుంది. దీనివల్ల గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది.
Also Read: కేవలం 14 రోజుల పాటు షుగర్‌కు దూరంగా ఉంటే.. శరీరంలో జరిగే మార్పులివే!
మహిళల్లో రెండు X క్రోమోజోమ్‌లు ఉండగా.. పురుషుల్లో ఒక X, ఒక Y క్రోమోజోమ్ ఉంటాయి. కణాల మరమ్మతుకు, వ్యాధి నిరోధక శక్తికి X క్రోమోజోమ్ చాలా కీలకం. మహిళల్లో ఒక X క్రోమోజోమ్ దెబ్బతిన్నా, రెండోది ఆ లోపాన్ని భర్తీ చేస్తుంది. మగవారికి ఆ అవకాశం లేకపోవడం వల్ల వ్యాధుల బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
మహిళలకు ప్రతినెలా రుతుక్రమం ద్వారా ఐరన్ బయటకు పోతుంది. మగవారిలో మాత్రం ఐరన్ రోజురోజుకూ శరీరంలో పేరుకుపోతూనే ఉంటుంది. ఈ అదనపు ఐరన్ వల్ల కణాలపై ఒత్తిడి పెరిగి, గుండె కండరాల పనితీరు దెబ్బతినే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. దీనివల్ల గుండె ఆరోగ్యంపై క్రమంగా ప్రభావం పడుతుంది.
పురుషుల శరీరం, కండరాల పరిమాణం సాధారణంగా పెద్దగా ఉంటాయి. పెద్ద శరీర నిర్మాణం వల్ల కణాలు త్వరగా అరిగిపోయి, శరీర అవయవాలు త్వరగా బలహీనపడతాయని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే దీనికి సంబంధించి మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉంది. బయోలాజికల్ కారణాలతో పాటు అలవాట్లు, సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం కూడా ఆయుష్షు తగ్గడానికి కారణమవుతున్నాయి.
Also Read: నిద్రలో కాలి కండరాలు పట్టేయడానికి కారణమేంటి? ఎప్పుడు ప్రమాదకరమంటే..