Leg Cramps: రాత్రిపూట హాయిగా నిద్రపోతున్న సమయంలో ఒక్కసారిగా కాలు కండరం పట్టుకుని, నరాలన్నీ లాగేస్తుంటే వచ్చే బాధ వర్ణనాతీతం. ఆ క్షణంలో ఏం చేయాలో పాలుపోక నొప్పితో విలవిలలాడిపోతుంటాం. చాలామందికి ఇలాంటి అనుభవం ఎదురవుతూనే ఉంటుంది. వయసుతో సంబంధం లేకుండా అందరినీ వేధించే ఈ సమస్య వెనుక ఉన్న ప్రధాన కారణాలు, వెంటనే ఉపశమనం పొందే మార్గాలు, ఇది ఎప్పుడు ప్రమాదకరంగా మారుతుందో వివరంగా తెలుసుకుందాం.
చాలామంది శరీరంలో పోషకాలు లేదా విటమిన్ల లోపం వల్లే రాత్రివేళ కాళ్ల కండరాలు పడతాయని అనుకుంటారు. కానీ అసలు కారణం మనం పడుకునే విధానం కావచ్చు. నిద్రపోతున్నప్పుడు పాదాలు, వేళ్లు కిందకి సాగిపోయి ‘ప్లాంటార్ ఫ్లెక్సన్’ స్థితిలో ఉంటాయి. దీనివల్ల పిక్క కండరాలు దగ్గరకు ముడుచుకుపోయి సులభంగా పట్టేస్తాయి. అలాగే రోజంతా ఎక్కువసేపు ఒకే చోట కూర్చోవడం, సరిగ్గా కదలకుండా ఉండటం, తీవ్రమైన శారీరక శ్రమ చేయడం లేదా వయసు పెరిగే కొద్దీ నరాలు, కండరాలలో వచ్చే మార్పుల వల్ల కూడా ఈ సమస్య తరచూ వస్తుంటుంది.
ఈ రాత్రివేళ కాళ్ల కండరాలు పట్టేయడం అనేది 60 ఏళ్లు పైబడిన వారిలో చాలా సాధారణంగా కనిపిస్తుంది. అలాగే గర్భధారణ సమయంలో దాదాపు 40 శాతం మంది మహిళలు ఈ బాధను అనుభవిస్తారు. గర్భంలో ఉన్న బిడ్డ బరువు పెరగడం వల్ల కాళ్ల కండరాలపై అదనపు ఒత్తిడి పడి కండరాలు పట్టుకుపోతాయి.
Also Read: రైస్ వాటర్‌తో మెరిసే జుట్టు, గ్లాస్ స్కిన్ సాధ్యమేనా? సోషల్ మీడియాలో చెప్పేదంతా నిజమేనా?
రాత్రిపూట సడన్‌గా కాలు పట్టేస్తే వెంటనే కాలును ముందుకు చాపి, పాదం వేళ్లను మీ ముఖం వైపుకు లాగడానికి ప్రయత్నించండి. ఇలా చేయడం వల్ల కండరం సాగి, నొప్పి వెంటనే తగ్గుతుంది. ఆ ప్రాంతంలో తేలికగా మసాజ్ చేయడం, కాసేపు గదిలో నెమ్మదిగా నడవడం లేదా వేడి నీళ్ల సంచి కాపడం పెట్టడం ద్వారా కూడా మంచి ఉపశమనం లభిస్తుంది.
సమస్య తగ్గాలంటే రోజూ రాత్రి పడుకునే ముందు పిక్కలకు చిన్నపాటి స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయాలి. పడుకునేటప్పుడు కాళ్ల వద్ద దుప్పట్లు మరీ బిగుతుగా లేకుండా వదులుగా ఉంచుకోవాలి. రోజంతా తగినంత నీరు తాగుతూ, శరీరంలో పొటాషియం, మెగ్నీషియం, క్యాల్షియం తగ్గకుండా చూసుకోవాలి. కాఫీలు, ఆల్కహాల్‌కు దూరంగా ఉండడం మంచిది.
సాధారణంగా ఈ నొప్పులు కొద్ది నిమిషాల్లో తగ్గిపోతాయి. కానీ నొప్పి మరీ తీవ్రంగా ఉన్నా, తరచూ వస్తున్నా, కాలిక వాపు, ఎరుపుదనం లేదా కండరాల బలహీనత వంటివి కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే కొన్నిసార్లు ఇవి షుగర్, పక్షవాతం, నరాల బలహీనత, రక్తప్రసరణ సమస్యలు లేదా కిడ్నీ సంబంధిత జబ్బులకు ముందస్తు సంకేతాలు కావచ్చు.
Also Read: మధ్యాహ్నం కాగానే కళ్లు మూతలు పడుతున్నాయా? శరీరం ఇచ్చే డేంజర్ సిగ్నల్ ఇది!