Men Grooming Psychology: సాధారణంగా చాలామంది మగవాళ్లు బయటకు వెళ్లేముందు జేబులో ఫోన్, వ్యాలెట్‌తో పాటు అస్సలు మర్చిపోకుండా ఒక చిన్న దువ్వెనను కూడా తమతో పాటు తీసుకెళ్తుంటారు. ఆఫీస్‌కైనా, ఫంక్షన్‌కైనా, పండగలకైనా, చివరికి పక్కన ఉన్న కిరాణా షాప్‌కి వెళ్లినా సరే వాళ్ల జేబులో ఆ చిన్న దువ్వెన ఉండితీరాల్సిందే. బయటకు చూడటానికి ఇది చాలా సాధారణమైన అలవాటుగా అనిపించవచ్చు. కానీ, దీని వెనుక మానసిక శాస్త్రం చెప్పే ఆసక్తికరమైన విషయాలు కొన్ని ఉన్నాయి. ఒక మనిషి ఆలోచన తీరు, అతని అలవాట్లు ఎలా ఉంటాయో చెప్పడానికి ఇదొక మంచి ఉదాహరణ.
ప్రజల ముందు మనం ఎలా కనిపిస్తున్నాం అనే దానిపై ప్రతి ఒక్కరికీ ఒక రకమైన అంచనా ఉంటుంది. దీనినే ‘సైకాలజీలో సెల్ఫ్ ప్రెజెంటేషన్’ అంటారు. బైక్ మీద వెళ్లినప్పుడు గాలికి జుట్టు చెదిరిపోవడం లేదా ప్రయాణాల్లో రూపురేఖలు కాస్త మారడం సహజం. అలాంటి సమయంలో వెంటనే సరిచేసుకోవడానికి జేబులో దువ్వెన ఒక సాధనంగా పనికొస్తుంది. ఇలాంటి అలవాటు ఉన్నవారు తాము ఇతరుల ముందు ఎప్పుడూ కాన్ఫిడెంట్‌గా, నీట్‌గా కనిపించాలని బలంగా కోరుకుంటారు.
మన రోజువారీ జీవితంలో వాతావరణం, ట్రాఫిక్ లేదా ఇతర సమస్యలను మనం నియంత్రించలేం. కానీ మన ప్రవర్తనను, మన రూపాన్ని మనం అదుపులో ఉంచుకోగలం. జేబులో దువ్వెన ఉంచుకోవడం అనేది ఒక రకమైన మానసిక ధైర్యాన్ని ఇస్తుంది. బయట ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, కనీసం మన జుట్టును సరిచేసుకునే అవకాశం మన చేతుల్లోనే ఉందనే ఒక చిన్న భావన వారిలో మానసిక ప్రశాంతతను, ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది.
Also Read: ఆండ్రాయిడ్ 16తో వస్తున్న Motorola Edge 70 Plus.. ఐదేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ పక్కా!
ఏదైనా ఒక పనిని మనం పదే పదే చేస్తూ ఉంటే.. అది కాలక్రమేణా మనకు తెలియకుండానే ఒక అలవాటుగా మారిపోతుంది. మొదట్లో ఏదో ఒక అవసరం కోసం దువ్వెన తీసుకెళ్లడం ప్రారంభించినా, రాను రాను అది రోజువారీ దినచర్యలో భాగమైపోతుంది. బయటకు వెళ్లేటప్పుడు వ్యాలెట్ చెక్ చేసుకున్నట్లే దువ్వెన ఉందో లేదో చూసుకోవడం అలవాటైపోతుంది. ప్రత్యేకంగా ఆలోచించాల్సిన అవసరం లేకుండానే ఇది ఒక ఆటోమేటిక్ ప్రాసెస్ లాగా జరిగిపోతుంది.
రోజూ తీసుకెళ్లే దువ్వెనను ఇంట్లో మర్చిపోయినప్పుడు కొందరిలో చిన్న అసౌకర్యం లేదా కంగారు కనిపిస్తుంది. రోజూ వాడే ఒక వస్తువు దగ్గర లేకపోవడం వల్ల అలా అనిపించడం సహజమే. ఆ వస్తువుతో ఏర్పడిన ఒక రకమైన మానసిక అనుబంధం వల్ల, అది లేకపోతే ఏదో కోల్పోయినట్లు లేదా ఆ రోజు పనులకు సిద్ధంగా లేనట్లు భావిస్తారు. దీన్ని మానసిక పరిభాషలో ఒక చిన్న ‘సేఫ్టీ సిగ్నల్’ అని పిలుస్తారు.
జేబులో దువ్వెన ఉంచుకున్నంత మాత్రాన ఆ వ్యక్తి చాలా అహంకారి అని గానీ, ఎప్పుడూ తన అందం గురించే ఆలోచిస్తుంటాడని గానీ అనుకోవాల్సిన అవసరం లేదు. దీని వెనుక కేవలం ప్రాక్టికల్ ఆలోచన కూడా ఉండవచ్చు. అవసరమైనప్పుడు ఉపయోగపడుతుందనే ముందుచూపుతో చేసే పని కావచ్చు. కాబట్టి.. చిన్న చిన్న దినచర్యలు మనుషుల బాధ్యతారాహిత్యాన్ని కాకుండా, వారు ప్రతి విషయానికి ఎంత సిద్ధంగా ఉంటున్నారో తెలియజేస్తాయి.
Also Read: 10000mAh బ్యాటరీ, 4K కెమెరాతో POCO X8 Series.. రూ.3,000 డిస్కౌంట్ ఆఫర్!