KCR Assembly: తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతున్న వేళ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి హాజరవుతారా లేదా అన్నది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా మారింది. ఈసారి కూడా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం లేదని సమాచారం. ఇప్పటికే కేసీఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శలతో మాటల దాడికి దిగింది. అసెంబ్లీకి రాకుండా వేతనం తీసుకొంటున్నారని ప్రతిసమావేశాల్లోనూ కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించి మళ్లీ సీఎంగా అడుగుపెడతారని అప్పటి వరకు హాజరుకారనే గులాబీ నేతలు పేర్కొంటున్నారు. అయితే ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాకముందే అధికార, ప్రధానప్రతిపక్షం మధ్య మాటలయుద్దంతో రాజకీయ వేడి మొదలైంది.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ మూడుసార్లు మాత్రమే అసెంబ్లీకి వచ్చారు. అందులోనూ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేందుకు అసెంబ్లీలోని స్పీకర్ చాంబర్ కు వచ్చారు. ఆతర్వాత ఒకసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజూ, మరోసారి గతేడాది డిసెంబర్ లో జరిగిన శీతాకాల సమావేశాలకు హాజరైన కేసీఆర్.. సంతాప తీర్మాణాల్లో పాల్గొని వెళ్లిపోయారు. ఆ తర్వాత ఈ ఏడాది మార్చిలో జరిగిన బడ్జెట్ సమావేశాలకు సైతం హాజరుకాలేదు. ఈ సమావేశాలకు హాజరవుతారా? లేదా? అనేది ప్రస్తుతం చర్చజరుగుతుంది. అసెంబ్లీకి రావాలని, సలహాలు ఇవ్వాలని కాంగ్రెస్ కోరుతూనే విమర్శలకు ఎక్కుపెట్టింది. ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని, ప్రజా సమస్యలపై అసెంబ్లీకి రాకుండా ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారని సీఎం మండిపడుతున్నారు. కేవలం తన కుటుంబ ప్రయోజనాల కోసమే బతుకుతున్న నేత కేసీఆర్ అని, రాష్ట్ర ప్రజల సమస్యలు పట్టించుకోని ఆయన వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తాము అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయ్యిందన్న సీఎం రేవంత్ రెడ్డి.. ఈ వెయ్యి రోజుల్లో తాను ఒక్క గంట కూడా సెలవు తీసుకోకుండా ప్రజల కోసం పనిచేశానని చెప్పారు. కానీ, మాజీ సీఎం కేసీఆర్ మాత్రం వెయ్యి రోజుల్లో కోటీ 24 లక్షల 40 వేల జీతం జీతం తీసుకున్నా.. కనీసం ఒక్కరోజైనా ప్రజల మధ్యకు రాలేదని సీఎం విమర్శించారు.
అసెంబ్లీకి వచ్చి చర్చల్లో పాల్గొంటే సీఎంతో పాటు మంత్రులు సైతం కౌంటర్లు వేస్తారని, ఆ ఇబ్బందులకంటే రాకుండా ఉండటమే మంచిదనే భావనలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికేసీఆర్ ఆదేశాలమేరకు కేటీఆర్, హరీష్ రావుతో పాటు సీనియర్ నేతలంతా అసెంబ్లీలో ప్రభుత్వ తప్పిదాలను నిలదీస్తూనే ఉన్నారు. హామీలు, గ్యారెంటీలు, డిక్లరేషన్లతో పాటు ప్రభుత్వ తప్పిదాలను సైతం తమదైన శైలీలో ఎండగడుతున్నారు. మాకే సమాధానం చెప్పలేకపోతున్న ప్రభుత్వానికి కేసీఆర్ ఎందుకని, మమ్ముల్ని సభలో మాట్లాడేందుకు సమయం ఇచ్చి ఎదుర్కోవాలని ఇప్పటికే సవాల్ చేస్తున్నారు. వ్యూహాత్మకంలో భాగంగానే కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటున్నట్లు సమాచారం. ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. నేడు జరిగే బీఆర్ఎస్ శాసనసభాపక్షం సమావేశంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇప్పటికే కేటీఆర్ స్పష్టత ఇచ్చారు. కేసీఆర్ కేవలం ప్రతిపక్ష నేతగా సభలో కూర్చోవడం కంటే, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజార్టీ సీట్లు సాధించి, మళ్లీ అధికార ముద్రతోనే కేసీఆర్ అసెంబ్లీ కి వస్తారని పేర్కొన్నారు. అసెంబ్లీకి ఎప్పుడు రావాలో, ఏ సమయంలో అడుగుపెడితే రాజకీయంగా మైలేజ్ వస్తుందో కేసీఆర్‌కు బాగా తెలుసు” అని బీఆర్ఎస్ సీనియర్ నేతలు సైతం సమావేశాల్లో బహిరంగంగానే పేర్కొంటున్నారు.
Also read: ఆడవాళ్లకు డిప్రెషన్.. మగవాళ్లకు హార్ట్ఎటాక్ రిస్క్.. డయాబెటిస్ వెనుక ఇంత కథ ఉందా?
కేసీఆర్ సభకు రాకపోవడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శించేందుకు సమాయత్తమవుతుండగా, బీఆర్ఎస్ నేతలు కూడా గట్టిగా తిప్పికొట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీ ఎన్నిసార్లు పార్లమెంట్ కు వచ్చారనే అంశాన్ని ప్రస్తావించాలని, ప్రజల్లోకి వెళ్లేలా మాట్లాడాలని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. ఆరు గ్యారెంటీల అమలు, మహిళ, నిరుద్యోగ, విద్యార్థి, యువత, రైతాంగ సమస్యలపై అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమవుతున్నారు.
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాకముందే అధికార, ప్రతిపక్షాల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లతో తెలంగాణ రాజకీయం వేడెక్కింది. ఒకవైపు తమను ఎదుర్కొనే ధైర్యం లేకే కేసీఆర్ రావడం లేదని అధికార పక్షం సవాళ్లు విసురుతుండగా, మరోవైపు కేటీఆర్, హరీష్ రావుల నాయకత్వంలో కాంగ్రెస్ విమర్శలకు ఎదురుదాడి చేసేందుకు గులాబీ దళం పూర్తిస్థాయిలో సన్నద్ధమైంది. సభ లోపల కేటీఆర్ సైన్యం, సభ వెలుపల కేసీఆర్ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయో వేచి చూడాలి.
Also read: AP DSC-2025 లో అక్రమాలు.. మంత్రి లోకేష్ సైలెంట్ వెనుక, అధికారులు మాత్రం శాప్ కార్యాలయంలో