Poop Immediately After Eating| చాలా మంది భోజనం చేశాక వెంటనే వారికి కడుపులో ఒత్తిడిగా ఉంటుంది, టాయిలెట్‌కు వెళ్లాలని తీవ్రంగా అనిపిస్తుంది. ఇది చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. చాలా మందికి ఇలా జరుగుతూనే ఉంటుంది. భోజనం ముగించి కొద్ది నిమిషాల్లోనే పొట్టలో ఒత్తిడి పెరిగి మలం వచ్చేస్తుందని అనిపిస్తుంది. ఇదంతా విచిత్రంగా అనిపించవచ్చు కానీ ఇది కేవలం సహజమైన శరీర ప్రతిస్పందన. ప్రముఖ డాక్టర్ జోసెఫ్ సల్‌హాబ్ (గ్యాస్ట్రో ఎంటెరోలొజిస్ట్) దీన్ని “గ్యాస్ట్రోకొలిక్ రిఫ్లెక్స్” అని వివరించారు.
మన శరీరం జీర్ణక్రియ సరిగ్గా కొనసాగడానికి గ్యాస్ట్రోకొలిక్ రిఫ్లెక్స్ అనే ప్రక్రియను ఉపయోగిస్తుంది. ఆహారం పేగుల్లోకి వచ్చినప్పుడు కడుపు కొద్దిగా విస్తరిస్తుంది. ఈ విస్తరణ మెదడుకు సిగ్నల్ పంపుతుంది. మెదడు వెంటనే పెద్దప్రేగుకు సిగ్నల్ ఇచ్చి కండరాలు కుదించమని చెబుతుంది. ఈ కుదింపుల వల్ల పాత వ్యర్థ పదార్థాలు ప్రేగు ద్వారా ముందుకు నెట్టబడతాయి. కొత్తగా వచ్చిన ఆహారం కోసం స్థలం ఖాళీ చేయడమే ఇందులో ఉద్దేశ్యం. ఇది భోజనం తర్వాత సహజంగా జరిగే ప్రక్రియ.
కడుపులో ఒత్తిడి ఉంటే కొత్త ఆహారం నేరుగా బయటకు వచ్చేస్తుందని అనిపించవచ్చు. కానీ అలా జరగదు. మీరు ఇప్పుడే తిన్న ఆహారం బయటకు రాదు. ఇంతకు ముందు తిన్న ఆహారం జీర్ణమైన తరువాత మిగిలన వ్యర్థాలు మాత్రమే బయటకు వస్తాయి. కొత్త ఆహారం వచ్చినందున శరీరం పాత వ్యర్థాలను తొలగించడానికి రిఫ్లెక్స్ పని చేస్తుంది. అందుకే భోజనం చేసిన వెంటనే ఇలా అనిపిస్తుంది.
ప్రతి ఒక్కరికీ ఈ రిఫ్లెక్స్ ఒకేలా ఉండదు. కొందరికి తేలికగా అనిపిస్తే, మరికొందరికి తీవ్రమైన ఒత్తిడి, నొప్పి లేదా అసౌకర్యం కలుగుతుంది. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ (IBS) ఉన్నవారికి ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. వారి జీర్ణవ్యవస్థ చాలా సున్నితంగా స్పందిస్తుంది. ఒత్తిడి, ఆందోళన కూడా ఈ రిఫ్లెక్స్‌ను బలపరుస్తాయి.
కార్బనేటెడ్ డ్రింక్స్, చక్కెర డ్రింక్స్, ఆల్కహాల్, సిట్రస్ పండ్లు, పాల ఉత్పత్తులు, ఫ్రైడ్ ఫుడ్స్, ఫ్యాటీ ఫుడ్స్ ఈ రిఫ్లెక్స్‌ను ఎక్కువగా ప్రేరేపిస్తాయి. లాక్టోస్ ఇంటాలరెంట్ సమస్య ఉన్నవారికి పాల ఉత్పత్తులు మరింత ఇబ్బంది కలిగిస్తాయి. మీకు ఎలాంటి ఆహారాలు తింటే ఇలాగ అనిపిస్తుందో గమనించండి.
చిన్న చిన్న జీవనశైలి మార్పులతో ఈ సమస్యను నియంత్రించవచ్చు. లో-ఫోడ్‌మ్యాప్ డైట్ పాటించడం మంచిది. నీళ్లు ఎక్కువగా తాగండి. చిన్న చిన్న మొత్తం భోజనం తీసుకోండి. మీరు తినే ఆహారం గురించి డైరీ నోట్ చేసుకోండి. మీకు ఏ ఆహారం ఎక్కువగా ఇబ్బంది కలిగిస్తుందో తెలుసుకోవడానికి ఈ డైరీ సహాయపడుతుంది.
Also Read: ఇంట్లోనే రుచికరమైన గడ్డపెరుగు కేవలం 15 నిమిషాల్లో రెడీ.. చాలా సింపుల్.. ఇలా చేసేయండి
సాధారణంగా ఈ సమస్య హానికరం కాదు. కానీ తీవ్రమైన నొప్పి, విరేచనాలు, రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసే సమస్యలు ఉంటే డాక్టర్‌ని సంప్రదించాలి.
భోజనం చేసిన వెంటనే మలవిసర్జన అనిపించడం శరీరంలో సహజమైన జీర్ణక్రియ రిఫ్లెక్స్ వల్ల జరుగుతుంది. దీన్ని అర్థం చేసుకుంటే అనవసరమైన భయం తగ్గుతుంది. సరైన జీవనశైలి మార్పులతో ఈ సమస్యను సులభంగా నియంత్రించవచ్చు. శరీరం చెప్పే సంకేతాలను గమనించి, అవసరమైతే డాక్టర్ సలహా తీసుకోండి.
ముఖ్య గమనిక: ఈ వ్యాసంలో తెలిపిన సమాచారం డాక్టర్ జోసెఫ్ సల్‌హాబ్ (గ్యాస్ట్రో ఎంటెరోలొజిస్ట్) సూచనలు. సమస్య తీవ్రంగా ఉంటే వెంటనే మీ సమీప వైద్యులను సంప్రదించాలి.