Celina Jaitly: బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొంటున్న గందరగోళ పరిస్థితులు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. తన భర్త, వ్యాపారవేత్త అయిన పీటర్ హాగ్ తనను శారీరకంగా, మానసికగా వేధిస్తున్నాడంటూ ఆమె చేసిన ఫిర్యాదుతో ముంబై పోలీసులు ఆయనపై కఠిన చర్యలకు ఉపక్రమించారు.
Read also-Brahmamudi Serial Today Episode May 9th ‘బ్రహ్మముడి’ సీరియల్: ఇందు మెడలో తాళి తెంపేయబోయిన రేఖ
పీటర్ హాగ్ మీద ఎఫ్ఐఆర్ నమోదైన కొద్ది సేపటికే, సెలీనా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక నిగూఢమైన పోస్ట్‌ను షేర్ చేశారు. ఒక పుస్తకంలోని పేజీని ఫోటో తీసి పోస్ట్ చేస్తూ, అందులోని కొన్ని ముఖ్యాంశాలను హైలైట్ చేశారు. “నార్సిసిస్ట్‌తో బంధాన్ని తెంచుకోవడం అంటే కేవలం విడిపోవడం కాదు, వారు మీ గురించి సృష్టించిన తప్పుడు ఇమేజ్ నుండి మీరు విముక్తి పొందడం. ఈ ప్రక్రియలో మీరు మీ గొంతును, మీ గుర్తింపును మీ జీవితాన్ని మళ్లీ తిరిగి పొందుతారు. మీ కథను మీరే మళ్లీ రాసుకోవాలి” అనే అర్థం వచ్చేలా ఆ పోస్ట్ ఉంది. తన భర్త ప్రవర్తనను ఉద్దేశించే ఆమె ఈ వ్యాఖ్యలు చేసినట్లు స్పష్టమవుతోంది.
సెలీనా ఫిర్యాదును స్వీకరించిన ముంబై పోలీసులు పీటర్ హాగ్ మీద భారతీయ న్యాయ సంహిత (BNS) కింద వివిధ సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేశారు. ఇందులో భార్య పట్ల క్రూరంగా ప్రవర్తించడం, గాయపరచడం మరియు క్రిమినల్ బెదిరింపులకు సంబంధించిన ఆరోపణలు ఉన్నాయి. పీటర్ ప్రస్తుతం దేశంలో లేకపోవడం లేదా విచారణ నుంచి తప్పించుకునే అవకాశం ఉన్నందున, పోలీసులు ఆయనపై లుకౌట్ సర్క్యులర్ (LOC) జారీ చేశారు. దీనివల్ల ఆయన విమానాశ్రయాల్లో పట్టుబడే అవకాశం ఉంది.
తన భర్త తనను కేవలం శారీరకంగానే కాకుండా ఆర్థికంగా కూడా వేధించారని సెలీనా ఆరోపించారు. తన సంపాదనను పీటర్ దుర్వినియోగం చేశారని, తన కెరీర్‌కు ఆటంకం కలిగించారని పేర్కొంటూ ఆమె రూ. 50 కోట్ల భారీ నష్టపరిహారాన్ని డిమాండ్ చేశారు. అంతేకాకుండా, గృహ హింస చట్టం కింద తన ముగ్గురు పిల్లల బాధ్యత రక్షణను కూడా ఆమె కోరుతున్నారు. 2011లో వివాహం చేసుకున్న ఈ జంట మధ్య గత కొంతకాలంగా విభేదాలు నడుస్తున్నాయి. సెలీనా జైట్లీ లాంటి ప్రముఖ నటి తన గొంతు విప్పి గృహ హింసపై పోరాడటం బాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసు దర్యాప్తు ప్రస్తుతం ముమ్మరంగా సాగుతోంది. పీటర్ హాగ్ ఈ ఆరోపణలపై స్పందించాల్సి ఉంది.