K Bhagyaraj: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన అధికారిక ప్రకటనలో భాగ్యరాజ గారి మృతి పట్ల తన సంతాపాన్ని ప్రకటించారు. దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో ఒక సువర్ణ అధ్యాయం ముగిసిందని, కథా కథనాలలో సరికొత్త ట్రెండ్‌ను సృష్టించి, కొన్ని దశాబ్దాల పాటు ప్రేక్షకులను తనదైన శైలి వినోదంతో అలరించిన నటుడు, రచయిత, అద్భుత దర్శకుడు శ్రీ కె. భాగ్యరాజ్ ఇకలేరనే వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆయన పేర్కొన్నారు.
ఈ మరణం కేవలం కోలీవుడ్‌కే కాదు, టాలీవుడ్‌తో పాటు మొత్తం భారతీయ చిత్రసీమకు తీరని లోటు అని డిప్యూటీ సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఒక నటుడిగానే కాకుండా, స్క్రీన్‌ప్లే విభాగంలో సరికొత్త పాఠాలు నేర్పిన ‘స్క్రీన్‌ప్లే మన్నన్’ (చిత్రకథా చక్రవర్తి)గా ఆయన సంపాదించుకున్న కీర్తి అమూల్యం. ప్రేమను, కుటుంబ బంధాలను, సామాజిక విలువలను వెండితెరపై ఒక అద్భుతమైన కావ్యంగా మలచడంలో భాగ్యరాజ్ శైలి ఎప్పటికీ ప్రత్యేకం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ, సినీ రంగానికి ఆయన అందించిన సేవలను పవన్ కళ్యాణ్ గుర్తుచేసుకున్నారు.
భాగ్యరాజ్ సినీ ప్రస్థానం విషయానికి వస్తే…ఎంతోమంది యువ దర్శకులకు మరియు నేటి తరం మేకర్స్‌కు ఒక డిక్షనరీ లాంటి వారు. 1953 జనవరి 7న తమిళనాడులోని ఈరోడ్‌లో జన్మించిన ఆయన, సినిమాపై ఉన్న అపారమైన మక్కువతో మద్రాసు పరిశ్రమలోకి అడుగుపెట్టి, దర్శకుడు భారతీరాజా వద్ద సహాయకుడిగా 1977 నాటి ‘పదినారు వయదినిలే’ వంటి చిత్రాల సమయం నుండి తన ప్రయాణాన్ని ప్రారంభించారు. 1979లో విడుదలైన ‘సువరిల్లాద చిత్రంగళ్’ సినిమాతో పూర్తిస్థాయి దర్శకుడిగా మారి, మొదటి చిత్రంతోనే ఇండస్ట్రీ చూపు తనవైపు తిప్పుకున్నారు. ఆ తర్వాత ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. 1981లో వచ్చిన ‘అంతే ఏలు నాట్కల్’ చిత్రం ఆయన కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలిచింది. ఈ సినిమా తెలుగులో మెగాస్టార్ కథానాయకుడిగా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ‘రాధా కల్యాణం’ పేరుతో రీమేక్ అయి ఇక్కడ కూడా సంచలన విజయం సాధించింది. భాగ్యరాజ్ రాసుకునే కథల్లోని బలం, పాత్రల నడుమ ఉండే భావోద్వేగాలు భాషా బేధాలు లేకుండా అందరినీ కట్టిపడేసేవి అనడానికి ఈ రీమేక్ విజయాలే నిదర్శనం.
తమిళ చిత్రసీమలో ఆయన సృష్టించిన ప్రభంజనం బాక్సాఫీస్ చరిత్రను తిరగరాసింది. ముఖ్యంగా 1983లో వచ్చిన ‘ముంధానై ముడిచ్చు’ చిత్రం ఇండస్ట్రీ హిట్ కొట్టి అప్పట్లోనే రికార్డులను సృష్టించింది. ఈ చిత్రం తెలుగులో ‘మూడు ముళ్లు’గా రీమేక్ అయి ఇక్కడి ప్రేక్షకులను సైతం అమితంగా ఆకట్టుకుంది. కేవలం సెంటిమెంట్ మాత్రమే కాకుండా, కథలో ఆరోగ్యకరమైన హాస్యాన్ని, హృదయాన్ని హత్తుకునే సామాజిక అంశాలను మేళవించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ‘చిన్న వీడు’, ‘ఇదు నమ్మ ఆలు’, ‘రాసుక్కుట్టి’ వంటి ఎన్నో క్లాసిక్ చిత్రాలు ఆయన కలం నుండి జాలువారినవే. తెలుగులో నేరుగా ఆయన ‘మాయదారి మొగుడు’ (1984) వంటి చిత్రాలకు దర్శకత్వం వహించి టాలీవుడ్ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.
also read:వయసు 94.. కానీ విజన్ నెక్స్ట్ లెవెల్…వైరల్ అవుతున్న ‘సింగ్ గీతం’మేకింగ్ వీడియో
హిందీలో అమితాబ్ బచ్చన్ నటించిన ‘ఆఖరీ రాస్తా’ (1986) చిత్రానికి కూడా భాగ్యరాజ్ అందించిన ‘ఒరు కైదియిన్ డైరీ’ కథే మూలాధారం కావడం ఆయన స్క్రీన్‌ప్లే ప్రతిభకు జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చింది.. ఏది ఏమైనా భారతీయ సినిమా చరిత్ర పుటల్లో కె. భాగ్యరాజ్ పేరు ఎప్పటికీ సువర్ణాక్షరాలతో లిఖించబడి ఉంటుందనేది కాదనలేని వాస్తవం.