Pawan Health: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత కొన్ని రోజులుగా రాజకీయ కార్యకలాపాలకు కాస్త దూరంగా ఉంటూ, ఇటీవల జరిగిన శస్త్రచికిత్స నుండి కోలుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన నెమ్మదిగా కోలుకుంటూ మళ్లీ ప్రజాక్షేత్రంలో యాక్టివ్ అవుతున్నారు. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో పాల్గొనడంతో పాటు, జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమంలోనూ భాగస్వామ్యమయ్యారు. అయితే ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తన ఆరోగ్య పరిస్థితి గురించి పంచుకున్న విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఆయన ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు, ఇంతటి శారీరక శ్రమను ఆయన ఎలా భరిస్తున్నారనే ఆయన చెప్పుకొచ్చారు.
గతంలో కరోనా మహమ్మారి బారిన పడిన సమయంలో పవన్ కళ్యాణ్‌కు ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ సోకింది. అది ఇప్పటికీ పూర్తిగా నయం కాలేదని, ఆ ప్రభావం తనపై ఇంకా చూపిస్తోందని ఆయన స్వయంగా వెల్లడించారు. రాజకీయ పర్యటనలు, రోడ్‌షోల వల్ల విపరీతమైన దుమ్ము, ధూళికి గురికావడంతో ఆయనకు తీవ్రమైన సైనస్ సమస్య ఏర్పడింది. దీని ప్రభావం కంటిచూపుపై కూడా పడిందని, ఒక్కోసారి లాంగ్ రేంజ్ విజన్ మసకబారుతుందని ఆయన పేర్కొన్నారు. దీని కోసమే ఇటీవల ఆయనకు ఒక మైనర్ సర్జరీ కూడా జరిగింది.
పర్యటనల్లో అభిమానుల కోలాహలం, క్రౌడ్ మేనేజ్‌మెంట్ సరిగ్గా లేకపోవడం వల్ల చాలామంది ఆయన చేతులను పట్టుకుని బలంగా లాగడం వంటివి చేస్తుంటారు. దీనివల్ల రెండు భుజాల వద్ద కండరాలు తీవ్రంగా గాయపడ్డాయి. సినిమాల్లో స్టంట్స్ చేస్తున్న సమయం నుండి పవన్ కళ్యాణ్‌కు వెన్నునొప్పి సమస్య ఉంది. సుదీర్ఘ రాజకీయ ప్రచారాలు, కారు టాప్‌పై నిలబడి ప్రయాణించడం వల్ల ఈ వెన్నుపూస సమస్య మరింత ఎక్కువైంది.
Read also-అక్క కోసం విలన్‌తో పోరాడే తమ్ముడు… ఓటీటీలోకి వచ్చేసిన నాగశౌర్య సినిమా
ఒకవైపు ఉప ముఖ్యమంత్రిగా ప్రభుత్వ బాధ్యతలు, మరోవైపు పార్టీ కార్యక్రమాలు, ఇంకోవైపు పాత సినిమా ప్రాజెక్టులను పూర్తి చేయాల్సిన ఒత్తిడి.. వీటన్నిటి మధ్య ఇంతటి తీవ్రమైన శారీరక నొప్పులను భరించడం సామాన్యమైన విషయం కాదు. అయితే పవన్ కళ్యాణ్ ఇంతటి సహన శక్తిని ప్రదర్శించడానికి గల రహస్యం ఆయన చిన్న వయసులోనే నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ (కరాటే వంటి యుద్ధ విద్యలు) క్రీడలేనని విశ్లేషకులు చెబుతున్నారు. ఆ కఠినమైన శారీరక శిక్షణే ఇప్పుడు ఆయనకు ఇంతటి ఓర్చుకునే శక్తిని, మానసిక దృఢత్వాన్ని ఇస్తోందని చెప్పవచ్చు. అనారోగ్య సమస్యలు వేధిస్తున్నప్పటికీ, ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో ప్రజలకు ఇచ్చిన మాట కోసం, జనసేన కేడర్‌లో ఉత్సాహం నింపడం కోసం పవన్ కళ్యాణ్ విశ్రాంతిని కూడా పక్కనపెట్టి శ్రమిస్తుండటం గమనార్హం.