Peabo Bryson Death: సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ R&B (రిథమ్ అండ్ బ్లూస్) బ్లూస్ దిగ్గజం, గాయకుడు పీబో బ్రైసన్ (Peabo Bryson) ఇక లేరు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన, తన 75వ ఏట తుది శ్వాస విడిచారు. ఇటీవల ఆయనకు గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. ఆయన మరణసమయంలో కుటుంబ సభ్యులు, అత్యంత ఆత్మీయులు ఆయన చెంతనే ఉన్నారు.
Read also-‘కిల్లర్’ మూవీ సెట్లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి
“ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు, స్నేహితులు సహోద్యోగుల నుండి అందుతున్న ప్రేమ, ప్రార్థనలు మమ్మల్ని ఎంతగానో కదిలించాయి. మా హృదయాలు ముక్కలైనప్పటికీ, పీబోను ప్రజలు ఎంతగా ప్రేమించారో, ఆయన అద్భుతమైన స్వరాన్ని గుర్తుచేసుకోవడం మాకు ఓదార్పునిస్తోంది. ఆయన అందించిన అద్భుతమైన సంగీత వారసత్వం రాబోయే తరాలకూ నిలిచి ఉంటుంది” అని కుటుంబ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు.
సంగీత ప్రస్థానం
పీబో బ్రైసన్ ఏప్రిల్ 13, 1951 న అమెరికాలోని సౌత్ కరోలినాలో గల గ్రీన్‌విల్లేలో జన్మించారు. చిన్నతనంలో తన తాతగారి వ్యవసాయ క్షేత్రంలో పెరిగిన బ్రైసన్‌కు సంగీతంపై అమితమైన ఆసక్తి ఉండేది. ఆయన తల్లి ఆఫ్రో-అమెరికన్ కళాకారుల సంగీత కచేరీలకు క్రమం తప్పకుండా తీసుకువెళ్తూ ఆయనలోని గాయకుడిని ప్రోత్సహించారు. ఈ క్రమంలోనే కేవలం 14 ఏళ్ల చిన్న వయసులోనే స్థానిక బ్యాండ్ ‘అల్ ఫ్రీమాన్ అండ్ ది అప్‌సెట్టర్స్’తో కలిసి ఆయన తన వృత్తిపరమైన సంగీత ప్రయాణాన్ని ప్రారంభించారు.
రెండు ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డుల విజేత
పీబో బ్రైసన్ తన సుదీర్ఘ కెరీర్‌లో ప్రపంచ సంగీత రంగంలో అత్యున్నతంగా భావించే గ్రామీ అవార్డులను రెండుసార్లు సొంతం చేసుకున్నారు. 1992 లో ప్రముఖ అంతర్జాతీయ గాయని సెలిన్ డియోన్‌తో కలిసి ఆయన ఆలపించిన ‘బ్యూటీ అండ్ ది బీస్ట్’ టైటిల్ సాంగ్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ పాటకు గాను ఆయన మొదటి గ్రామీ అవార్డును అందుకున్నారు. 1993 లో: రెజినా బెల్లెతో కలిసి ‘అల్లాద్దీన్’ చిత్రం కోసం పాడిన ‘ఎ హోల్ న్యూ వరల్డ్’ పాటకు గాను రెండోసారి గ్రామీ అవార్డును దక్కించుకుని చరిత్ర సృష్టించారు. ఆయన కెరీర్‌లో ‘Feel the Fire’, ‘Can You Stop the Rain’, ‘If Ever You’re in My Arms Again’, ‘I Can’t Imagine’ వంటి ఎన్నో క్లాసిక్ హిట్స్ ఉన్నాయి.