Film Accident: చెన్నై చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు ఎస్.జె. సూర్య నటిస్తున్న ‘కిల్లర్’ సినిమా షూటింగ్ సెట్‌లో ఒక ఘోర ప్రమాదం జరిగింది. ఓట్టేరిలోని పి&సి మిల్స్ ప్రాంతంలో సినిమా చిత్రీకరణ జరుగుతుండగా, ఒక్కసారిగా గ్యాస్ బెలూన్ సిలిండర్ పేలిపోయింది. ఈ పేలుడు ధాటికి అక్కడి వాతావరణం అంతా ఒక్కసారిగా అల్లకల్లోలంగా మారింది.
ఈ దుర్ఘటనలో సినిమా టెక్నీషియన్‌గా పనిచేస్తున్న మదన్ అనే వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేసింది. అలాగే సెట్‌లో ఉన్న మరో ముగ్గురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన చిత్ర యూనిట్.. గాయపడిన వారిని అత్యవసర చికిత్స కోసం చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి అక్కడ ఐసీయూలో చికిత్స అందుతోంది.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు, అసలు సిలిండర్ పేలడానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. షూటింగ్ సెట్లలో భద్రతా ప్రమాణాల లోపం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఈ ప్రమాదంతో ‘కిల్లర్’ సినిమా షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. కోలీవుడ్‌లో ఈ ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని నింపింది.
Also Read: గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?