భారత ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో మారుతి సుజుకి జెట్ స్పీడ్ తో దూసుకెళ్తోంది. కంపెనీ తొలి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఈ-విటారా విడుదలైన కొద్ది నెలల్లోనే సత్తా చాటింది. అమ్మకాల పరంగా దేశంలోని టాప్ EV బ్రాండ్లలో ఒకటిగా నిలిచింది. తాజాగా సేల్స్ రిపోర్టు ప్రకారం.. 2026 జనవరి నుంచి మే వరకు మారుతి సుజుకి మొత్తం 4,365 ఎలక్ట్రిక్ వాహనాలను అమ్మింది. దీంతో కంపెనీ దేశంలో నాలుగో అతిపెద్ద EV బ్రాండ్ గా నిలిచింది. ఇదే సమయంలో విన్ ఫాస్ట్ 4,133 యూనిట్లు అమ్మకగా, BYD, హ్యుందాయ్, కియా లాంటి కంపెనీలు మారుతి కంటే వెనుకబడ్డాయి.
టాప్ పొజిషన్ లో టాటా మోటార్స్
ఎలక్ట్రిక్ విభాగంలో టాటా మోటార్స్ సత్తా చాటుతోంది. 40,373 యూనిట్లతో అగ్రస్థానంలో ఉండగా, మహీంద్రా 23,247 యూనిట్లతో రెండో స్థానంలో ఉంది. JSW MG మోటార్ 22,943 యూనిట్లతో మూడో స్థానాన్ని దక్కించుకుంది. మారుతి నాలుగో స్థానంలో నిలవడం కంపెనీకి పెద్ద బూస్టింగ్ గా మారింది.
ప్రస్తుతం మారుతి సుజుకి భారత మార్కెట్లో కేవలం ఒకే ఒక్క ఎలక్ట్రిక్ మోడల్ అయిన ఈ-విటారాను మాత్రమే విక్రయిస్తోంది. అయినప్పటికీ ఈ మోడల్ మంచి అమ్మకాలు నమోదు చేసింది. హ్యుందాయ్, కియా, విన్ ఫాస్ట్ లాంటి కంపెనీలు ఒకటి కంటే ఎక్కువ EV మోడళ్లను విక్రయిస్తున్నప్పటికీ, మారుతి ఒక్క మోడల్ తోనే వాటిని దాటేసింది. జనవరి నుంచి మే వరకు నెలకు సగటున 873 ఈ-విటారా యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ సంఖ్య విన్ ఫాస్ట్, హ్యుందాయ్, BYD, కియా కంపెనీల నెలవారీ సగటు అమ్మకాల కంటే ఎక్కువగా ఉంది. కంపెనీకి దేశ వ్యాప్తంగా ఉన్న భారీ డీలర్ నెట్ వర్క్, సర్వీస్ సౌకర్యాలు, వినియోగదారుల నమ్మకం కారణంగా ఈ సక్సెస్ సాధించినట్లు కంపెనీ వెల్లడించింది.
ధర పరంగా కూడా ఈ-విటారా పోటీ మోడల్స్ తో పోల్చితే తక్కువగా ఉండటం వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఎంజీ ZS EV, విన్ ఫాస్ట్ VF6, హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, మహీంద్రా BE 6 లాంటి మోడళ్లతో పోలిస్తే ప్రారంభ ధర తక్కువగా ఉండటం ప్లస్ పాయింట్‌గా మారింది. ఎగుమతుల విషయంలో కూడా ఈ-విటారా మంచి సత్తా చాటుతోంది. 2025 సెప్టెంబర్ నుంచి ఇప్పటివరకు 46 దేశాలకు 35 వేలకుపైగా యూనిట్లను మారుతి ఎగుమతి చేసింది. ప్రస్తుతం ఫ్రాంక్స్, జిమ్నీ తర్వాత ఈ-విటారా కంపెనీకి మూడో అతిపెద్ద ఎగుమతి మోడల్ గా నిలిచింది.
ప్రస్తుతం ఉత్పత్తి సామర్థ్యం పరిమితంగా ఉండటంతో సరఫరాలో కొంత ఇబ్బంది ఎదురవుతోంది. అయినప్పటికీ, గత నెలలో ఈ-విటారా బుకింగ్‌లు 4,000 యూనిట్లను దాటినట్లు కంపెనీ వెల్లడించింది. మరో రెండు నెల్లలో ఉత్పత్తిని మరింత పెంచే యోచనలో ఉంది. ఇక EV మౌలిక సదుపాయాల విస్తరణపై కూడా మారుతి దృష్టి పెట్టింది. 2030 నాటికి దేశవ్యాప్తంగా లక్షకు పైగా పబ్లిక్, ప్రైవేట్ ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం 1,100 నగరాల్లో 2,000కుపైగా ఛార్జింగ్ పాయింట్లు అందుబాటులో ఉన్నాయని కంపెనీ తెలిపింది.
Read Also: మారుతి ఫస్ట్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కారు రేపే లాంచ్.. ఇంతకీ వాగన్ ఆరా? ఫ్రాంక్సా?