E-Paper
Advertisement

సరదాగా వదిలిన కుందేళ్లు.. ఒక దేశాన్నే ఎలా ముంచేశాయో తెలుసా?

సరదాగా వదిలిన కుందేళ్లు.. ఒక దేశాన్నే ఎలా ముంచేశాయో తెలుసా?
Advertisement

Rabbit Invasion: కొందరు తీసుకునే కొన్ని చిన్న చిన్న నిర్ణయాలు ఒక్కోసారి చరిత్రను, ఒక ఖండం రూపురేఖలనే మార్చేస్తాయి. ఆస్ట్రేలియా దేశంలో సరిగ్గా ఇలాంటి విచిత్రమైన సంఘటనే ఒకటి జరిగింది. సరదా కోసం వేటాడటానికి తెచ్చిన కొన్ని చిన్న కుందేళ్లు.. ఏకంగా ఒక దేశ పర్యావరణానికే పెద్ద శాపంగా మారతాయని బహుశా నాటి పాలకులకు కూడా ఊహకంది ఉండదు. నేషనల్ మ్యూజియం ఆఫ్ ఆస్ట్రేలియా ప్రకారం.. 1859 క్రిస్మస్ పండుగ రోజున థామస్ ఆస్టిన్ అనే ఒక సంపన్న భూస్వామి విక్టోరియాలోని తన ఎస్టేట్‌లో 13 ఐరోపా కుందేళ్లను వదిలిపెట్టాడు. అక్కడి నుంచి మొదలైన ఈ ఘటన.. ఆస్ట్రేలియా చరిత్రలోనే అత్యంత దారుణమైన సమస్యగా మారింది.

బ్రిటన్ నుంచి బహుమతిగా వచ్చి..

ఇంగ్లాండ్‌లోని థామస్ ఆస్టిన్ బంధువు ఒకరు ఈ కుందేళ్లను ప్రత్యేకంగా సేకరించి ఆస్ట్రేలియాకు పంపించారు. నిజానికి ఆస్ట్రేలియాకు కుందేళ్లు రావడం ఇదే మొదటిసారి కాదు. అంతకుముందు ఐదు కుందేళ్లు వచ్చినా.. వాటిని ఎప్పుడూ అడవుల్లోకి స్వేచ్ఛగా వదల్లేదు. కానీ ఆస్టిన్ వదిలిన కుందేళ్ల కథ వేరుగా మారింది. ఆస్ట్రేలియాలో వాటికి సమృద్ధిగా ఆహారం, దాక్కోవడానికి స్థలాలు దొరికాయి. అన్నింటికంటే ముఖ్యంగా వాటిని వేటాడి తినే క్రూర మృగాలు (ప్రిడేటర్స్) అక్కడ లేకపోవడం వాటికి బాగా కలిసి వచ్చింది.

శరవేగంగా పెరిగిన కుందేళ్ల సంతతి

Advertisement

కుందేళ్లను వదిలిన ఏడేళ్లలోనే అంటే 1866 నాటికి ఒక్క ఆస్టిన్ ఎస్టేట్‌లోనే వేటగాళ్లు ఏకంగా 14,000 కుందేళ్లను కాల్చి చంపారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇవి ఆగలేదు. 1880 నాటికి ముర్రే నది దాటి న్యూ సౌత్ వేల్స్‌కు, 1886 నాటికి క్వీన్స్‌లాండ్‌కు, 1894 నాటికి నల్లార్బోర్ మైదానాన్ని దాటి పశ్చిమ ఆస్ట్రేలియాకు విస్తరించాయి. బ్రిటన్‌లో కుందేళ్లు విస్తరించడానికి 700 ఏళ్లు పడితే, ఆస్ట్రేలియాలో మూడింట రెండు వంతుల భాగాన్ని ఆక్రమించడానికి కేవలం 50 ఏళ్లు మాత్రమే పట్టింది. ప్రపంచంలోనే ఏ క్షీరదం కూడా ఇంత వేగంగా వేరొక ప్రాంతానికి విస్తరించలేదని జంతుశాస్త్ర నిపుణులు పేర్కొన్నారు.

కంచెలు, వైరస్‌లు.. సుదీర్ఘ పోరాటం

కుందేళ్ల దాడి నుంచి పంటలను, భూములను కాపాడుకోవడానికి రైతులు, ప్రభుత్వాలు తీవ్రంగా ప్రయత్నించాయి. బోన్లు పెట్టడం, పొగబెట్టడం, చంపిన వారికి బహుమతులు ఇవ్వడం వంటివి చేశారు. ఇందులో అత్యంత కీలకమనైదని ఆస్ట్రేలియా ప్రభుత్వం 1901 నుంచి 1907 మధ్య నిర్మించిన భారీ ‘రాబిట్ ప్రూఫ్ ఫెన్స్’ (కుందేళ్ల నిరోధక కంచె). ఉత్తరం నుంచి దక్షినం వరకు ఏకంగా 3,256 కిలోమీటర్ల మేర ఈ కంచెను ఏర్పాటు చేశారు. అయితే కంచె పూర్తికాకముందే కుందేళ్లు ఆ ప్రాంతంలోకి ప్రవేశించడం, కంచె తరచూ పాడవుతూ ఉండటంతో ఈ ప్రయోగం పూర్తిగా విఫలమైంది.

కుందేళ్లను వండుకొని తిన్న పేదలు

Advertisement

మరోవైపు 1930ల నాటి తీవ్ర ఆర్థిక మాంద్యం కాలంలో పేదలకు ఈ కుందేళ్లే ఉచిత మాంసపు వనరుగా మారాయి. చాలామంది వాటిని వేటాడుతూ కడుపు నింపుకున్నారు. 1940ల చివరినాటికి ఆస్ట్రేలియాలో కుందేళ్ల సంఖ్య ఏకంగా 60 కోట్లకు చేరుకుంది. దీంతో శాస్త్రవేత్తలు క్రిమిసంహారకాల వైపు దృష్టి సారించారు. 1950లో ‘మిక్సోమాటోసిస్’ అనే వైరస్‌ను ప్రయోగించగా దోమల ద్వారా అది వేగంగా వ్యాపించి కుందేళ్ల సంఖ్యను తగ్గించింది. కానీ కాలక్రమేణా కుందేళ్లు ఆ వైరస్‌ను తట్టుకునే నిరోధక శక్తిని (రెసిస్టెన్స్) పెంపొందించుకున్నాయి. ఆ తర్వాత ప్రయోగించిన ‘కాలీసివైరస్’‌కు కూడా ఇవి త్వరగానే అలవాటు పడిపోయాయి. ప్రస్తుతం మళ్లీ వీటి సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

పర్యావరణానికి తీవ్ర నష్టం

కుందేళ్ల వల్ల కేవలం వ్యవసాయ రంగానికే కాకుండా.. ఆస్ట్రేలియా పర్యావరణ వ్యవస్థకు కోలుకోలేని నష్టం వాటిల్లుతోంది. అక్కడ పెరిగే చిన్నపాటి మొక్కల నుంచి చెట్ల వరకు ఏదైనా సరే ఇవి తినేస్తున్నాయి. విపరీతంగా పెరిగిన ఈ కుందేళ్లు పచ్చిక బయళ్లను మేయడం వల్ల స్థానిక వృక్షసంపద, వాటిపై ఆధారపడిన స్థానిక జంతువులు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. వాటి మేత వల్ల నేలపై ఉండాల్సిన కనీస గడ్డి పోయి తీవ్రమైన మట్టి కోతకు దారితీస్తోంది.

అత్యంత ప్రమాదకరమైన జీవి

యూనివర్సిటీ ఆఫ్ కాన్‌బెర్రాకు చెందిన బ్రియాన్ కుక్.. 2012లో ప్రచురించిన కథనం ప్రకారం.. ఆస్ట్రేలియా సహజ పర్యావరణ వ్యవస్థలను నాశనం చేయడంలో కుందేళ్ల పాత్ర చాలా పెద్దది. వాటివల్ల జరిగే మంచి ఏమీ లేదని పర్యావరణాన్ని పునరుద్ధరించాలంటే కుందేళ్ల సంఖ్యను అత్యంత కఠినంగా అదుపు చేయాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. రచయిత బ్రియాన్ కోమన్ కూడా కుందేళ్లను ఆస్ట్రేలియాలోనే అత్యంత ప్రమాదకరమైన జీవిగా అభివర్ణించారు.

Also Read: క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నారా? ఈ 5 తప్పులు చేస్తే.. ఆర్థికంగా సర్వనాశనమే!

మానవాళికి ఈ కథ నేర్పే పాఠం!

తన ఎస్టేట్‌లో సరదాగా వేటాడుకోవడానికి థామస్ ఆస్టిన్ చేసిన చిన్న పని.. ఇవాళ ఒక దేశానికి పీడకలగా మారింది. ఆహారం, సరైన రక్షణ ఉండి, దాడి చేసే శత్రువులు లేనప్పుడు ఒక ప్రాణి ఎంతటి విధ్వంసం సృష్టించగలదో చెప్పడానికి ఈ ఘటన ఒక పెద్ద హెచ్చరిక. పెద్దగా ముప్పులేని పర్యావరణంలోకి వేరే ప్రాంతపు జంతువులను స్వేచ్ఛగా ప్రవేశపెడితే ఎలాంటి దుష్పరిణామాలు ఎదురవుతాయో చెప్పడానికి ఆస్ట్రేలియా కుందేళ్ల కథ ఒక సజీవ సాక్ష్యం.

Also Read: ఫలించిన రేవంత్‌ దౌత్యం! తుమ్మిడిహెట్టి రీ డిజైన్‌తో జఠిల సమస్యను పరిష్కరించే దిశగా..! కేసీఆర్ చేతులెత్తేసిన చోటే..తాను సాధించే దిశగా అడుగులు..!

Tags

Related News

నో సిగ్నల్స్, నో వెహికల్స్.. అయినా ఈ ద్వీపానికి పర్యాటకుల క్యూ.. అసలు ఏముందిక్కడ?

నీలగిరి మౌంటైన్ రైల్వే అలర్ట్.. మెట్టుపాళయం–ఊటీ రైళ్లు రద్దు, ఎందుకంటే?

పారిస్ టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఇండియన్ ఎంబసీ ఏం చెప్పిందంటే?

అంతరిక్ష యాత్ర ఇక సామాన్యులకూ సాధ్యమే.. గగన్‌యాన్ మిషన్‌తో కొత్త ఆశలు!

ట్రాఫిక్‌లో చిక్కుకొని రైలు మిస్ అవుతుందని టెన్షన్ వద్దు.. మీ సమస్యకు పరిష్కారం ఇదే

విమానాల్లో ఫైవ్ స్టార్ రేంజ్ ఫుడ్.. ఎయిర్ ఇండియా క్రేజీ ప్లాన్!

ఇండియాను చూసేందుకు ఉద్యోగాలు వదిలేసిన యూరప్ అమ్మాయిలు.. వందే భారత్ జర్నీ చూసి..

Big Stories

Advertisement
×