
Opposition Parties on One Nation-One Election(Telugu flash news):
కేంద్రం తెరపైకి తీసుకొచ్చిన వన్ నేషన్ – వన్ ఎలక్షన్ పై రాజకీయ మంటలు చెలరేగాయి. జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాల అధ్యయనం కోసం కేంద్రం మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీపై కాంగ్రెస్ అనుమానాలు వ్యక్తం చేసింది. కమిటీ కూర్పుపైనా సందేహాలు ఉన్నాయని పేర్కొంది.
వన్ నేషన్- వన్ ఎలక్షన్ భారత్ ఐక్యత, రాష్ట్రాలపై దాడి చేసే ఆలోచనగా ఉందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. భారత్ అంటే రాష్ట్రాల సమైక్యతగా పేర్కొన్నారు. జమిలి ఎన్నికలపై ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేయడం నామమాత్రపు ప్రక్రియేనని అన్నారు. ఈ కమిటీ ఏర్పాటు చేసిన సమయంపైనా అనుమానాలు వ్యక్తం చేశారు. కమిటీ నియమ నిబంధనలను చూస్తే సిఫార్సులను ముందే నిర్ణయించారని తెలుస్తోందని రాహుల్ అన్నారు. తమ పార్టీ నేత అధీర్ రంజన్ చౌధరి ఆ కమిటీలో ఉండేందుకు నిరాకరించడం సరైనదేనని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ స్పష్టం చేశారు.
జమిలి ఎన్నికలతో సామాన్యులకు ప్రయోజనమేంటని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నిలదీశారు. ఒకే దేశం- ఒకేసారి ఎన్నికలా? ఒకే దేశం- అందరికీ ఒకే రకమైన విద్య, వైద్యమా? అని ట్విట్టర్ లో ప్రశ్నలు సంధించారు.
వన్ నేషన్ -వన్ ఎలక్షన్ సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసేందుకు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఛైర్మన్‌గా 8 మందితో కమిటీ ఏర్పాటైంది. సాధ్యమైనంత త్వరగా సిఫార్సులు చేయాలని కమిటీకి కేంద్రం సూచించింది. అయితే గడువు మాత్రం నిర్దేశించలేదు. సమావేశాలు, ఇతర కార్యక్రమాలకు విధివిధానాలను కమిటీ రూపొందించుకోవాలని తెలిపింది. ఆ కమిటీ ప్రజల అభిప్రాయలను వింటుందని తాజా విడుదలైన గెజిట్‌లో పేర్కొంది. వినతులు, లేఖలు స్వీకరించి తుది సిఫార్సుల్లో పొందుపరచడానికి వీలు కల్పించింది.